Home /News /telangana /

LOCALS WERE KEEN TO CATCH THEM AS FISH WERE COMING ON THE ROADS OF NIRMAL DISTRICT VB

Fishing On Road: రోడ్లపైకి వచ్చిన చేపలు.. ఎగబడిన జనం.. వైరల్ అవుతున్న వీడియో..

రోడ్లపై జనం పరుగులు

రోడ్లపై జనం పరుగులు

Fishing On Road: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ముఖ్యంగా నిర్మ‌ల్ జిల్లా లో వానలు దంచికొడుతున్నాయి. దీంతో అక్కడ వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వ‌ర‌ద నీరు నిర్మ‌ల్ ప‌ట్ట‌ణంలోకి చేర‌డంతో రోడ్ల‌న్ని జ‌ల‌మ‌యం అయ్యాయి. వరద నీటికి వాగుల్లో, చెరువుల్లోని చేపలు కొట్టుకుంటూ రోడ్లపైకి వచ్చాయి. చేప‌ల‌ను ప‌ట్టుకునేందుకు స్థానికులు ఆస‌క్తి చూపారు.

ఇంకా చదవండి ...
    తెలంగాణ వ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. ఒక్క ప్రాంతానికే పరిమితం కాకుండా వర్షాలు రాష్ట్ర వ్యాప్తంగా విపరీతంగా కురుస్తున్నాయి. ఎడతెరపిలేని వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో నిర్మల్ జిల్లా కేంద్రం మొత్తం నీట మునిగిపోయింది. వ‌ర‌ద నీరు నిర్మ‌ల్ ప‌ట్ట‌ణంలోకి చేర‌డంతో రోడ్ల‌న్ని జ‌ల‌మ‌యం అయ్యాయి. వ‌ర‌ద నీటిలో చేప‌లు కొట్టుకురావ‌డంతో వాటిని పట్టుకునేందుకు జ‌నం ప‌రుగులు పెట్టారు. వలలు, చీరలతో రోడ్లపైనే చేప‌ల‌ను ప‌ట్టుకునేందుకు స్థానికులు ప్రయత్నించారు. ఒక కిలోను మించి బరువున్న చేపల్ని కొందరు దొరకబుచ్చుకున్నారు. ఆ చేపలు ఒక్కోటి దాదాపు కిలోకు పైగానే బరువున్నాయి. రోడ్లపై చేపలు దొరకుతున్న విషయం తెలిసి.. జనం వాటి కోసం ఎగబడ్డారు. దొరికినవారు ఎంచక్కా వాటిని సంచిలో వేసుకుని ఇంటికి తీసుకెళ్లారు. నిర్మల్ రోడ్లపై చేపల వేటకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.

    గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షానికి నిర్మల్ పట్టణం నీట మునిగిందని, ఎన్టీఆర్ఎఫ్ బృందాలను తక్షణమే పంపి వెంటనే ముమ్మరచర్యలు చేపట్టాలని ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సోమేశ్ కుమార్ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, ఎస్పీలకు సూచించారు. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు ఇంట్లో నుంచి బయటకు రావద్దని కోరారు. నిర్మల్ జిల్లా భైంసాలోని గడ్డెన వాగు పూర్తిగా నిండిపోయింది. దీంతో ఐదు గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదిలారు. ఇదే సమయంలో ఆటోనగర్‌ను వరదనీరు ముంచెత్తింది.


    వరదలో 40 మందికిపైగా చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న అధికారులు నాటు పడవల సాయంతో వారిని బయటకు తీసుకొస్తున్నారు. విషయం తెలుసుకున్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆటోనగర్‌కు చేరుకుని సహాయక చర్యలను పరిశీలించారు. తెలంగాణ వ్యాప్తంగా 44.2 మి.మీ. వ‌ర్ష‌పాతం న‌మోదవగా... ఆదిలాబాద్, నిర్మ‌ల్, నిజామాబాద్ జిల్లాల్లో అత్య‌ధికంగా 115.5 మి.మీ. వ‌ర్షపాతం న‌మోదైంది. ఒక్క నిర్మ‌ల్ జిల్లాలోనే 204 మి.మీ. వ‌ర్ష‌పాతం న‌మోదవగా... జిల్లాలోని నర్సాపూర్‌లో అత్యధికంగా 245మి.మీ వర్షపాతం నమోదైంది. జూన్ 1వ తేదీ నుంచి ఇప్పటివరకూ జిల్లాలో 474.3మి.మీ వర్షపాతం నమోదైంది. నిర్మల్ చరిత్రలోనే ఇంత భారీ వర్షపాతం మునుపెన్నడూ లేదని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. నీట మునిగిన కాలనీల్లో సహాయక చర్యలకు అధికారులను ఆదేశించారు.
    Published by:Veera Babu
    First published:

    Tags: Adilabad, Floods, Nirmal district, Telangana rains

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు