హోమ్ /వార్తలు /తెలంగాణ /

Hyderabad Old City: పాతబస్తీలో అర్ధరాత్రి ఉద్రిక్తత.. గోషామహల్‌ చుట్టూ భారీ సెక్యూరిటీ

Hyderabad Old City: పాతబస్తీలో అర్ధరాత్రి ఉద్రిక్తత.. గోషామహల్‌ చుట్టూ భారీ సెక్యూరిటీ

రాజాసింగ్

రాజాసింగ్

Hyderabad Old city Protests: పాతబస్తీలో పోలీసులు భద్రతను పెంచారు. రాజాసింగ్ ప్రాతినిధ్యం వహిస్తున్న గోషామహల్‌కు వెళ్లే అన్ని రహదారులను మూసివేశారు. సిటీ కాలేజీ చౌరస్తాలో బారీకేడ్లను అడ్డం పెట్టి.. అటు వైపుగా ఎవరినీ వెళ్లనీయడం లేదు.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja singh) వ్యాఖ్యలతో హైదరాబాద్ పాత బస్తీ (Hyderabad Old city Protests) అట్టుడుకుతోంది. చాలా చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆయనకు బెయిల్ ఇవ్వడంతో అర్ధరాత్రి ఆందోళనలు మిన్నంటాయి. మొగల్‌పురా, శాలిబండ, చంచల్‌గూడ, అలియాబాద్‌, సయ్యద్‌ అలీ చబుత్రా, చార్మినార్‌, లాడ్‌బజార్‌, మీర్‌చౌక్‌, దారుల్‌ షిఫా, గుల్జార్‌ హౌస్‌ ప్రాంతాల్లో యువతపెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చి నిరసనలు వ్యక్తంచేశారుః. శాలిబండ చౌరస్తాలో రాజాసింగ్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. మొగల్‌పురా ప్రాంతంలో పోలీసులపై వాహనాలపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. రాళ్ల దాడిలో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. పలువురికి గాయాలయ్యాయి. అలియాబాద్‌ క్రాస్‌ రోడ్డులో చేపట్టిన ర్యాలీలో నిరసనకారులు రాళ్లు రువ్వడంతో స్థానికులు, వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.  పోలీసులు పలువురు నిరసనకారులను అదుపులోకి తీసుకుని శాలిబండ పోలీస్టేషన్‌కు తరలించారు.


  Rajasingh : ఎమ్మెల్యే రాజాసింగ్‌కి ఊరట .. బెయిల్‌ మంజూరు చేసిన కోర్టు


  రాజాసింగ్ ప్రాతినిధ్యం వహిస్తున్న గోషామహల్‌ (Goshamahal)కు వెళ్లే అన్ని రహదారులను మూసివేశారు. సిటీ కాలేజీ చౌరస్తాలో బారీకేడ్లను అడ్డం పెట్టి.. అటు వైపుగా ఎవరినీ వెళ్లనీయడం లేదు. మూసాభౌలీ, హుస్సునీ ఆలం, చార్మినార్, శాలిబండ నుంచి ఆందోళనకారులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. వారిని సిటీ కాలేజీ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఎవరూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదని నచ్చజెప్పారు. సిటీ కాలేజీ నుంచి బేగంబజార్, హైకోర్టుకు వెళ్లే రహదారులను మూసివేశారు. పాతబస్తీలో ఆందోళనల నేపథ్యంలో పోలీసులు భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. రాజాసింగ్‌కు బెయిల్ ఎందుకు ఇచ్చారని ఆందోళనకారులు మండిపడుతున్నారు. మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆయనపై జైల్లో వేసి.. కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు. పాత బస్తీలో ఆందోళనల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. శాంతిభద్రతలు అదుపుతప్పకుండా చర్యలు తీసుకుంటున్నారు. దక్షిణ మండల డీసీపీ, అదనపు డీసీ పీ, ఎస్బీ అడిషనల్‌ డీసీపీ, ఏసీపీ, ఇన్‌స్పెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పరిస్థితులు సమీక్షిస్తున్నారు.  మహమ్మద్ ప్రవక్త (Prophet Muhammad)పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు ఎమ్మెల్యే రాజాసింగ్‌ను మంగళవారం పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఆయన్ను నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు. 14వ అదనపు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ రాజాసింగ్‌కు 14రోజుల రిమాండ్‌ విధించింది. అయితే ఆ తర్వాత రాజాసింగ్‌ తరపు లాయర్ బెయిల్‌ పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీం కోర్టు నిబంధనల ప్రకారం 41సీఆర్‌పీసీ(CRPC) పాటించకుండా ఎలా రిమాండ్‌ చేస్తారని ప్రశ్నించారు. ఆయన వాదనలను పరిగణలోకి తీసుకున్న కోర్టు రాజాసింగ్ రిమాండ్‌ను తిరస్కరించింది. బెయిల్ మంజూరుచేస్తూ.. ఆయన్ను వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. బెయిల్ రావడంతో రాజాసింగ్ నేరుగా గోషామహల్‌లోని తన నివాసానికి వెళ్లిపోయారు. ఆయన మద్దతుగా కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. అదే సమయంలో ఆయనకు వ్యతిరేకంగా పాతబస్తీలో ఆందోళనలు జరుగుతున్నాయి. ఇరువర్గాల నిరసనల నేపథ్యంలో.. పరిస్థితి అదుపు తప్పకుండా.. పోలీసులు రంగంలోకి దిగారు. పాతబస్తీలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Charminar, Hyderabad, Raja Singh, Telangana

  ఉత్తమ కథలు