Khammam Girl Rape Case: ఖమ్మం అత్యాచార బాధిత బాలికకు హడావిడిగా అంత్యక్రియలు, ప్రజాసంఘాల ఆగ్రహం

ఖమ్మంలో ప్రజా సంఘాల ఆగ్రహం

ఖమ్మంలో అత్యాచార బాధితురాలి కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా.. డబుల్‌ బెడ్‌రూం ఇల్లు.. మూడెకరాల సాగు భూమి.. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం.. మిగిలిన పిల్లలకు ఉచిత విద్యకు ఏర్పాటు చేయాలని ప్రజాసంఘాలు డిమాండ్ చేశాయి.

 • Share this:
  (జి.శ్రీనివాసరెడ్డి, ఖమ్మం కరస్పాండెంట్, న్యూస్‌18)

  కామాంధుడి చేతిలో బలైపోయిన మైనర్‌ బాలిక నర్సమ్మ కుటుంబానికి న్యాయం చేయాలంటూ వివిధ పార్టీలు.. ప్రజాసంఘాలు.. మహిళా సంఘాలు రోడ్డెక్కాయి. కేసు సత్వర విచారణకు వెంటనే ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టును ఏర్పాటు చేయాలని.. బిడ్డను కోల్పోయి పుట్టెడు దుఖంలో ఉన్న కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా.. డబుల్‌ బెడ్‌రూం ఇల్లు.. మూడెకరాల సాగు భూమి.. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం.. మిగిలిన పిల్లలకు ఉచిత విద్యకు ఏర్పాటు.. వీటిని తక్షణమే ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ రోడ్డెక్కాయి. ఈమేరకు శనివారం కులవివక్ష పోరాట సమితి ఆధ్వర్యంలో కలెక్టర్‌ కర్ణన్‌కు సంఘం బాధ్యులు నివేదించారు. ఆదుకోవాల్సిన ప్రభుత్వం కేవలం రూ.2 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పన్నెండేళ్లకే పాశవికతకు బలైపోయిన బాలికకు అరగంటలో అంత్యక్రియలు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. ప్రభుత్వం ప్రదర్శిస్తున్న ఇలాంటి వైఖరి వల్లే మహిళలు, చిన్నారులపై ఈ రకమైన దాడులు పదేపదే చోటుచేసుకుంటున్నాయని.. కఠినమైన విధానాన్ని తీసుకొచ్చేదాకా ప్రభుత్వ వైఖరిపై పోరాటం చేస్తామని సంఘాలు ప్రకటించాయి.

  పేదరికంలో మగ్గుతూ పనికోసం కుదిరిన ఇంటి యజమాని కొడుకు కామదాహానికి బలైపోయిన దారుణ ఘటన ఖమ్మంలో చోటుచేసుకున్న విషయం తెలిసిందే. డెబ్భైశాతం కాలిన గాయాలతో నాలుగు వారాలపాటు ఆసుపత్రిలో పోరాడిన ఆ బాలిక చివరకు శుక్రవారం కన్నుమూసింది. ఘటనను దాచిపెట్టి వైద్యం చేసిన ఖమ్మంలోని పూజ ఆసుపత్రిని ఇప్పటికే సీజ్‌ చేయగా, అత్యాచారయత్నం చేసి, ఆమె ప్రతిఘటించడంతో పెట్రోల్‌ పోసి నిప్పంటించిన వ్యక్తిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. బాధితురాలి నుంచి మరణవాంగ్మూలం తీసుకున్న అనంతరం ఆమెను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌ తరలించారు.

  ఖమ్మంలో ప్రజా సంఘాల నిరసన ర్యాలీ


  కొద్దిరోజుల అనంతరం ఆమె మృతిచెందడంతో శుక్రవారం మధ్యాహ్నం ఖమ్మం రూరల్‌ మండలంలోని పల్లెగూడెం తరలించారు. అయితే బంధువులు వచ్చిన దాకా కూడా ఆగకుండా అక్కడికక్కడే హడావుడిగా అంత్యక్రియలు జరిపించడంపై సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. కనీసం చివరి చూపైనా కళ్లారా చూసుకోనీయకుండా తమను మభ్యపెట్టి అప్పటికప్పుడే హడావుడి చేశారని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది.

  ఖమ్మంలో ప్రజా సంఘాల నిరసన ర్యాలీ


  బాధిత కుటుంబానికి వామపక్ష పార్టీలకు చెందిన మహిళా సంఘాలు, యువజన, విద్యార్థి సంఘాలు అండగా నిలిచాయి. బాధిత కుటుంబానికి సరైన రీతిలో న్యాయం చేశాకే అంత్యక్రియలు జరపాలని డిమాండ్‌ చేశాయి. ఈ విషయంలో తుదికంటా పోరాడతామని, అన్యాయంగా బలైపోయిన బాలిక కుటుంబానికి న్యాయం జరిగేదాకా ఉద్యమిస్తామని, కామాంధునికి కఠిన శిక్ష పడేదాకా తమ పోరాటం కొనసాగిస్తామన్నారు. ఈమేరకు శనివారం కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చారు.

  సెప్టెంబరు 18న ఉదయం 6 గంటలకు బాలిక నిద్రిస్తున్న గదిలోకి వెళ్లిన ఆ ఇంటి యజమాని కుమారుడు అల్లం మారయ్య.. ఆమెపై అత్యాచారయత్నం చేయబోగా ప్రతిఘటించి దూరంగా నెట్టేసింది. ఈ అక్కసుతో అక్కడున్న పెట్రోలును ఆమెపై పోసి నిప్పంటించాడు. అనంతరం అతడు, అతని తండ్రి సుబ్బారావులు మంటలార్పి ఆస్పత్రికి తరలించారు. ఇంత జరిగినా.. ఆస్పత్రి యాజమాన్యం పోలీసులకు సమాచారమివ్వకుండానే 17 రోజుల పాటు ఆ బాలికకు రహస్యంగా చికిత్స చేసింది. చివరికి బాలిక నోరు విప్పడంతో అఘాయిత్యం వెలుగులోకి వచ్చింది. ఆస్పత్రి నిర్వాకంపై విచారణ జరిపిన జిల్లా వైద్యశాఖ సీజ్‌ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. ఆస్పత్రిపై కేసు నమోదు చేశారు. ఆమె మరణ వాంగ్మూళాన్ని జడ్జి నమోదు చేశారు. జడ్జి, సీపీ, జిల్లా వైద్యాధికారులు తనను పరామర్శించిన సమయంలో తనపై జరిగిన అఘాయిత్యాన్ని పూసగుచ్చినట్టు వివరించింది.
  Published by:Ashok Kumar Bonepalli
  First published: