హైకోర్టు న్యాయవాదులు వామన్‌రావు, నాగమణి దంపతుల హత్య కేసు విచారణను ముమ్మరం చేశారు. లాయర్ దంపతులను హత్య చేసేందుకు కత్తులు తయారు చేసిన వారిని పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం పోలీసులు నిందితులు హత్యకు ఉపయోగించిన కత్తులను వెలికితీసే పనిలో పడ్డారు. ఈ కేసు రిమాండ్ రిపోర్ట్ ప్రకారం.. లాయర్ దంపతులను హత్య చేసిన అనంతరం నిందితులు కుంట శీను, చిరంజీవి.. మహారాష్ట్ర పారిపోవడానికి యత్నించారు. ఈ క్రమంలోనే వారు రామగిరి నుంచి సుందిల్ల బ్యారేజ్(పార్వతి బ్యారేజ్) వద్దకు చేరుకున్నారు. అక్కడ హత్యకు వినియోగించిన కత్తులను, రక్తపు మరకలను అంటిన దుస్తులను బ్యారేజ్‌లో పడవేశారు. అనంతరం అక్కడి నుంచి మహారాష్ట్రకు బయలుదేరారు. ఈ క్రమంలోనే పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.
ఇక, ఆదివారం ఈ కేసుకు సంబంధించిన ఇద్దరు నిందితులను పోలీసులు సుందిల్ల బ్యారేజ్ వద్దకు తీసుకెళ్లారు. ఏ ప్రాంతంలో కత్తలు పడేశారనే విషయంపై నిందితులను ప్రశ్నించారు. బ్యారేజ్ ప్రస్తుతం దాదాపు 5 టీఎంసీల నీరు ఉండటంతో.. కత్తులను వెలికితీసేందుకు పోలీసులు వైజాగ్ నుంచి గజ ఈతగాళ్లను రప్పించారు. ఈ నేపథ్యంలో బ్యారేజ్ పరిసరాల్లో భారీగా పోలీసులను మోహరించారు.
ఇక, జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న ముగ్గురు ప్రధాన నిందితులు కుంట శ్రీనివాస్, చిరంజీవి, కుమార్‌లను తమ కస్టడీలోకి తీసుకున్న పోలీసులు వారిని రామగుండం కమిషనరేట్‌లో విచారిస్తున్నారు. డీసీపీ అశోక్‌కుమార్ నేతృత్వంలో సీసీఎస్ పోలీసులు వివిధ కోణాల్లో వారి నుంచి వివరాలు రాబడుతున్నట్లు సమాచారం. మరోవైపు ఈ కేసులో నాలుగో నిందితుడిగా ఉన్న బిట్టు శ్రీనును కస్టడీకి కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన మంథని న్యాయస్థానం బిట్టు శ్రీనును వారం రోజులు కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
Published by:Sumanth Kanukula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.