హైదరాబాద్: ఆర్థికంగా వెనుకబడి ఉన్న ఎస్సీ కులాల సంక్షేమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ వ్యాఖ్యానించారు. ఎస్సీ కులాల యువత అభ్యున్నతి కోసం టీఆర్ఎస్ సర్కారు ఎన్నో పథకాలను ప్రవేశపెడుతోందని ఆయన అన్నారు. దీనిలో భాగంగా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీపై రుణాలను అందజేస్తున్నామని వివరించారు. వాస్తవానికి ఈ రుణాలను పొందేందుకు దరఖాస్తు చేయడానికి ఈ నెల 21వరకే గడువు ఉందని గుర్తు చేశారు. అయితే మరింత మంది ఎస్సీ యువతకు ఈ పథకం అందేందుకు ఆ గడువు తేదీని ఈ నెల 21 నుంచి 31కి పొడిగిస్తున్నామని కొప్పుల ఈశ్వర్ ప్రకటించారు. ఎస్సీ యువతకు రుణాలను అందించేందుకు, వారికి ఉపాధి కల్పించేందుకు ఈ ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 786 కోట్ల రూపాయలను కేటాయించామన్నారు.
ఎస్సీ యువత కోసం కేటాయించిన 786 కోట్ల రూపాయల్లో సబ్సిడీ కింద 500కోట్లు ఉండగా, బ్యాంకుల ద్వారా 279 కోట్లు, లబ్దిదారుల వాటా కింద 7కోట్లు ఉంటాయన్నారు. ఎస్సీ కులాల్లోని పేద రైతులు వ్యవసాయ భూముల అభివృద్ధి, మైనర్ ఇరిగేషన్, విద్యుత్ లైన్లు, కనెక్షన్ల ఏర్పాటుకు కార్పొరేషన్ ద్వారా నేరుగా రుణాలు పొందవచ్చన్నారు. బ్యాంకుల సహకారంతో ట్రాక్టర్లు, సరుకు రవాణా కోసం నాలుగు చక్రాల వాహనాలు, క్యాబ్ లు, ఆటోలు, మినీ డైరీ కింద గేదెలు, ఆవుల కొనుగోలుకు సబ్సిడీ మంజూరు చేస్తామన్నారు. ఎస్సీ కులాలలోని పేదలు, నిరుద్యోగ యువత సకాలంలో దరఖాస్తు చేసుకోవడం ద్వారా ఈ అవకాశాన్ని సద్వినియోగ పర్చుకోవాలని మంత్రి కొప్పుల కోరారు.
గడిచిన ఆరేళ్లుగా ఎస్సీ కులాల అభ్యున్నతి కోసం టీఆర్ఎస్ సర్కారు కృషి చేస్తోందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో ఎస్సీ కార్పోరేషన్ ద్వారా లక్షలాది మంది యువతకు రుణాలు అందజేశామని మంత్రి కొప్పుల ఈశ్వర్ వెల్లడించారు. లక్షలాది మంది యువత ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకున్నారనీ, సొంత వ్యాపారాలు చేస్తున్నారని వెల్లడించారు. నిరుద్యోగ యువత అంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. యువత సకాలంలో ఉద్యోగాలో, వ్యాపారాలో చేసుకుంటే కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకుంటుందనీ, వారి భవిష్యత్తుకు బంగారు బాట వేసుకోవచ్చునని కొప్పుల ఈశ్వర్ అన్నారు.