తెలంగాణ (Telangana)లో బోనాల (Bonalu) పండుగ సందడి నెలకొంది. ముఖ్యంగా హైదరాబాద్ లో బోనాల పండుగ వాతావరణం కనిపిస్తోంది. సికింద్రాబాద్లోకి ఉజ్జయినీ మహంకాళి ఆలయంలో (Ujjain Mahankali Temple in Secunderabad) బోనాల పండుగ జరుగుతోంది. మహిళలు ఉదయం నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. ఆదివారం ఉదయం సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి తెల్లవారు జామున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సభ్యులు తొలి బోనం సమర్పించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మంత్రి తలసాని మాట్లాడుతూ.. రైతులు పాడిపంటలతో సమృద్ధిగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నానని చెప్పారు. రాజకీయాలకు అతీతకంగా అందరినీ బోనాల జాతరకు ఆహ్వానించామని తెలిపారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేశామన్నారు.
మరోవైపు వీఐపీల తాడికి కూడా ఎక్కువ కావడంతో అధికారులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దంపతులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వర్షాలు కురిసి పంటలు పండాలని ఆకాంక్షించానని తెలిపారు. కరోనా పూర్తిగా తొలగిపోవాలని అమ్మవారిని ప్రార్థించానని, కరోనా పూర్తిగా తొలగిపోవాలని అమ్మవారిని ప్రార్థించానని కిషన్రెడ్డి పేర్కొన్నారు.
బోనం సమర్పించిన కవిత..
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాల సందర్భంగా ఆదివారం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (TRS MLC Kavita) సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని మోండా మార్కెట్ డివిజన్ లోని ఆదయ్య నగర్ లైబ్రరీ నుండి 2 వేల మంది మహిళలు బోనాలతో (Bonalu) వెంట రాగా.. బంగారు బోనంతో (Bonam) బయలు దేరి మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించారు. అమ్మవారి దర్శనానికి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వెళ్లగా.. ఉజ్జయిని ఆలయం దగ్గర ఏర్పాట్లపై కాంగ్రెస్ (Congress) నేతలు మండిపడ్డారు. ఇది ఆలయమా? టీఆర్ఎస్ ఆఫీసా? అంటూ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. నేతలను పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
సీఎం కేసీఆర్ నేడు ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకుంటారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లో వరద ముంపును క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి పర్యటన అనంతరం ఏటూరునాగారం నుంచి హైదరాబాద్ చేరుకుంటారు. అనంతరం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళీ బోనాల ఉత్సవాల్లో పాల్గొంటారు. ఇక హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ నేడు సికింద్రాబాద్ బోనాలకు హాజరవుతారు. కుటుంబ సమేతంగా ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకోనున్నారు.
నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు..
మరోవైపు లష్కర్ బోనాలకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. భక్తులు, వీఐపీ (VIP)లు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశాలు ఉండటంతో మహంకాళి ఆలయం చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఆదివారం తెల్లవారుజామున 4 గంటల నుంచి సోమవారం బోనాల జాతర ముగిసేవరకు హైదరాబాద్ (Hyderabad) నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు (Traffic Restrictions) అమలు చేయనున్నారు. ట్రాఫిక్ ను డైవర్షన్స్ (Traffic Diversions) చేశారు. ఆలయానికి 2 కి.మీ దూరం నుంచే ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bonalu, Hyderabad, Kalvakuntla Kavitha, Telangana, TS Congress