Home /News /telangana /

KURNOOL YSRCP MLA SHILPA CHAKRAPANI REDDY TELANGANA BJP RAJA SINGH WAR OF WORDS OVER SRISAILAM ISSUE SK

Raja singh VS Chakrapani: తెలంగాణ ఎమ్మెల్యే వర్సెస్ ఏపీ ఎమ్మెల్యే.. రాజీనామాకు సిద్ధం

శిల్పా చక్రపాణిరెడ్డి, రాజాసింగ్

శిల్పా చక్రపాణిరెడ్డి, రాజాసింగ్

శ్రీశైలం క్షేత్రంలో ముస్లింలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని, దీని వెనక కర్నూల్ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ఉన్నారని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. రజాక్‌‌ను రంగంలోకి దింపి అక్రమాలకు పాల్పడుతున్నాడని మండిపడ్డారు.

ఇంకా చదవండి ...
    ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం కేంద్రంగా తెలుగు రాష్ట్రాల రాజకీయాలు వేడెక్కుతున్నాయి. తెలంగాణ ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. శ్రీశైలం క్షేత్రంలో ముస్లింలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని, దీని వెనక కర్నూల్ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ఉన్నారని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. రజాక్‌‌ను రంగంలోకి దింపి అక్రమాలకు పాల్పడుతున్నాడని మండిపడ్డారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతున్నాయి. రాజాసింగ్ వ్యాఖ్యలపై శిల్పా చక్రపాణి రెడ్డి స్పందించారు. తనపై ఆరోపణలు నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమని సవాల్ విసిరారు. శ్రీశైలంలో పెద్దల సమక్షంలో చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు చక్రపాణి.

    ''రాజాసింగ్ ఎప్పుడు వస్తానంటే అప్పుడు శ్రీశైలంలో పెద్దల సమక్షంలో చర్చకు సిద్ధం. ఆరోపణలు నిరూపిస్తే నేను రాజీనామా చేస్తా. ఆరోపణలు నిరూపించకపోతే రాజీనామాకు సిద్ధమా? హిందూత్వాన్ని అడ్డంపెట్టుకొని ఏపీలో పైకిరావాలని బీజేపీ చూస్తోంది. శ్రీశైలంలో ముస్లింలను రెచ్చగొట్టేందుకు మేము ఎవరం? 40 ఏళ్లుగా శ్రీశైలంలో ముస్లింలు వ్యాపారాలు చేసుకుంటున్నారు. రజాక్ అనే వ్యక్తి 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. నేను 9 ఏళ్ల నుంచి మాత్రమే ఉన్నా. ఆయన పార్టీ కార్యకర్త మాత్రమే. అవనసర ఆరోపణలు చేస్తే మర్యాదగా ఉండదు. నేను ఎన్నో దేవాలయాలకు ఆర్థిక సాయం చేశాను. ఈ విషయం గురించి మఠాధిపతులు, పీఠాధిపతులను అడితే తెలుస్తుంది.'' అని శిల్పాచక్రపాణి రెడ్డి పేర్కొన్నారు.

    అటు వైసీపీ నేత రజాక్ సైతం రాజాసింగ్‌పై మండిపడ్డారు. శ్రీశైల మల్లిఖార్జునస్వామిని ఏ మతం వారైనా పూజించవచ్చని అన్నారు. ఇతర మతస్తులు పూజించకూడదని మీ గ్రంథంలో ఎక్కడైనా ఉందా.. అని ప్రశ్నించారు. శ్రీశైలం దేవస్థానంలో తన పేరు మీద ఎవరికీ కాంట్రాక్ట్‌లు ఇప్పించలేదని.. పైసా పని కూడా చేయలేదని స్పష్టం చేశారు రజాక్.

    కాగా, శ్రీశైలంలోని దుకాణ సముదాయాల్లో ముస్లింలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని రాజాసింగ్ ఆరోపించారు. తాత్కాలిక ప్రాతిపదికన ఇచ్చిన షాపులను తొలగించాలని కోర్టు ఆదేశించినా పట్టించుకోవడం లేదని విమర్శించారు. వైసీపీ ఎమ్మెల్యే చక్రపాణి తన టీమ్‌ను తయారు చేసి, వైసీపీ నేత రజాక్‌కు బాధ్యతలు అప్పగించారని మండిపడ్డారు రాజాసింగ్. శ్రీశైలంలో గొడ్డు మాంసం, మద్యం కూడా అమ్ముతున్నారని, ఈ విషయంపై బీజేపీ కార్యకర్తలు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే చక్రపాణిని కట్టడి చేసి.. శ్రీశైల క్షేత్రాన్ని కాపాడాలని సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. శ్రీశైలం పవిత్రను ప్రభుత్వం కాపాడాలని.. ఒకవేళ తాము జోక్యం చేసుకుంటే పరిస్థితి మరోలా ఉంటుందని హెచ్చరించారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Raja Singh, Srisailam, Srisailam Temple

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు