నేడు టీఆర్ఎస్ 20వ ఆవిర్భావ దినోత్సవం.. అలా చేద్దామన్న కేటీఆర్..

కేటీఆర్(ఫైల్ ఫోటో)

కార్యకర్తలు అందరూ ఎక్కడి వారు అక్కడే ఉండి, తమ ఇళ్లపై టీఆర్ఎస్ పార్టీ జెండాను ఎగరేయాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు.

 • Share this:
  తెలంగాణ రాష్ట్ర సమితి 20వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేడర్‌కు కీలక సూచనలు చేశారు. కార్యకర్తలు అందరూ ఎక్కడి వారు అక్కడే ఉండి, తమ ఇళ్లపై టీఆర్ఎస్ పార్టీ జెండాను ఎగరేయాలని పిలుపునిచ్చారు. పార్టీ ఆవిర్భావం సందర్భంగా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నామని, వారం రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాల్లో కార్యకర్తలు సామాజిక దూరం పాటిస్తూ రక్తదానం చేయాలని సూచించారు. ఈ క్రమంలో ఈ రోజు కేటీఆర్ స్వయంగా రక్తదానం చేశారు. 20 సంవత్సరాల పాటు ప్రజల్లో మమేకమైన అనుభవంతో మరోసారి ప్రజల సేవకు పునరంకితం అవుదామని కేటీఆర్ పిలుపునిచ్చారు. ‘20 సంవత్సరాల పార్టీ ప్రస్థానం ఒక్కమాటలో చెప్పాలంటే ఆనాటి జలదృశ్యం నుంచి ఈనాటి సుజల దృశ్యం వరకు అని చెప్పవచ్చు. దేశ రాజకీయాల పైన టిఆర్ఎస్ పార్టీ ప్రత్యక్షంగా ప్రభావం చూపించ లేక పోయినప్పటికీ తన పథకాలు కార్యక్రమాల ద్వారా పరోక్షంగా ప్రభావం చూపిస్తున్నది. టిఆర్ఎస్ పార్టీ ముద్ర భారతదేశ రాజకీయ యవనికపై స్పష్టంగా కనిపిస్తుంది.’ అని కేటీఆర్ అన్నారు.

  తమ ప్రభుత్వం కార్యక్రమాలు పథకాలను కేంద్ర ప్రభుత్వం మరియు వివిధ రాష్ట్రాలు స్ఫూర్తిగా తీసుకున్న విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. కేవలం సింగిల్ పాయింట్ ఎజెండా తో తన గమ్యాన్ని ముద్దాడిన పార్టీ దేశంలో టిఆర్ఎస్ పార్టీ ఒకటేనన్నారు. 60 లక్షల మంది కార్యకర్తలతో టిఆర్ఎస్ పార్టీ ఈనాడు అజేయ శక్తిగా నిలిచిందన్నారు. తెలంగాణలో హరితవిప్లవం తో పాటు క్షీర విప్లవం, పింక్ విప్లవం (మాంసం) నీలి విప్లవం (చేపలు), శ్వేత విప్లవం (పాలు) జల విప్లవం తెలంగాణలో ఆవిష్కృతమైందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఇన్ని సంవత్సరాలుగా అవహేళన చేయబడ్డ భాష, యాస,సంస్కృతి, సాంప్రదాయాలు ఈరోజు తమదైన గౌరవాన్ని దక్కించుకున్నాయన్నారు.

  టిఆర్ఎస్ పార్టీ ఈరోజు ఇన్ని విజయాలు సాధించి ఈ స్థితిలో ఉన్నదంటే దానికి కారణం కచ్చితంగా కెసిఆర్ నాయకత్వం, ఆయన ఇచ్చిన స్ఫూర్తినే కారణమని కేటీఆర్ అన్నారు. ప్రజలు ప్రతిపక్షాలను వద్దు అనుకుంటున్నారు అందుకే ప్రతి ఎన్నికల్లో 100% విజయాలు టిఆర్ఎస్ పార్టీకి కట్టబెడుతూ వస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం అన్ని జిల్లాల్లోనూ టిఆర్ఎస్ పార్టీ కార్యాలయాలు సిద్ధమయ్యాయి. ప్రస్తుత సంక్షోభం ముగిసిన తర్వాత వాటి ప్రారంభోత్సవ లతోపాటు కార్యకర్తల శిక్షణ కార్యక్రమాల పైన కూడా ఆలోచన చేస్తున్నట్టు తెలిపారు.
  Published by:Ashok Kumar Bonepalli
  First published: