GHMC Elections: నేటి నుంచి గ్రేటర్‌లో కేటీఆర్ ఎన్నికల ప్రచారం.. అక్కడి నుంచి మొదలు..

KTR GHMC Elections: గ్రేటర్‌లో ఎన్నికల ప్రచార వ్యూహం అమలు, పార్టీ యంత్రాంగాన్ని సమన్వయం చేసేందుకు 150 డివిజన్లకు సంబంధించి 181 మందితో కూడిన భారీ జాబితాను టీఆర్‌ఎస్‌ రూపొందించింది.

news18-telugu
Updated: November 21, 2020, 9:22 AM IST
GHMC Elections: నేటి నుంచి గ్రేటర్‌లో కేటీఆర్ ఎన్నికల ప్రచారం.. అక్కడి నుంచి మొదలు..
కేటీఆర్ (ఫైల్ ఫోటో)
  • Share this:
గ్రేటర్‌ ఎన్నికల్లో నామినేషన్ల పర్వం పూర్తి కావడంతో ఇక ప్రచారంపై పూర్తిస్థాయిలో దృష్ట పెట్టింది టీఆర్ఎస్. ప్రచారంలో కీలక పాత్ర పోషించనున్న ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్.. కేటీఆర్‌ నేటి నుంచి ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌పై మరోసారి గులాబీ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేసిన కేటీఆర్.. ఆ దిశగా వ్యూహాలు సిద్ధం చేశారు. గత గ్రేటర్ ఎన్నికల్లో అన్నీ తానై టీఆర్ఎస్‌ను గెలిపించిన కేటీఆర్.. ఈసారి కూడా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుపు బాధ్యతను తన భుజాలపై వేసుకున్నారు. నేట నుంచి గ్రేటర్‌లో కేటీఆర్ సుడిగాలి పర్యటన చేయనున్నారు. నేటి నుంచి ఈ నెల 30వ తేదీ వరకు జీహెచ్‌ఎంసీ పరిధిలోని 20 నియోజకవర్గాల్లో రోడ్‌షోలు నిర్వహించనున్నారు.

నేడు కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలో రోడ్‌షో నిర్వహించడం ద్వారా కేటీఆర్ తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం కూకట్‌పల్లిలో ప్రచారం చేయనున్నారు. సాయంత్రం 5 గంటలకు ఓల్డ్‌ అల్లాపూర్‌ చౌరస్తా, చిత్తారమ్మ తల్లి చౌరస్తా, రాత్రి 7గంటలకు ఐడీపీఎల్‌ చౌరస్తా, 8గంటలకు సాగర్‌ హోటల్‌లో జంక్షన్‌లో ప్రచారం నిర్వహించనున్నారు. మరోవైపు గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో మరింత దూకుడు పెంచాలని గులాబీ దళం నిర్ణయించింది. డివిజన్లు, నియోజకవర్గ స్థాయిలో అనుసరించాల్సిన వ్యూహాలపై కసరత్తు పూర్తి చేసింది. ఇందులో భాగంగా రోడ్‌ షోలకు ప్లాన్‌ చేస్తోంది. తక్కువ సమయంలో ఎక్కువ పర్యటనలు ఉండేలా వ్యూహరచన చేస్తోంది.

మిగతా పార్టీల కంటే ముందే అభ్యర్థుల జాబితాను ప్రకటించిన టీఆర్‌ఎస్‌.. అదే స్పీడ్‌తో ప్రచారంలోనూ దూసుకెళ్తోంది. రోజుకు నాలుగు నుంచి ఆరు చోట్ల మంత్రి కేటీఆర్‌ రోడ్‌ షో ఉండేలా ఏర్పాట్లు చేసింది. అలాగే పలు డివిజన్లలో రాష్ట్ర మంత్రులు అభ్యర్థుల పక్షాన ప్రచారం నిర్వహించనున్నారు. మరోవైపు గ్రేటర్‌లో ఎన్నికల ప్రచార వ్యూహం అమలు, పార్టీ యంత్రాంగాన్ని సమన్వయం చేసేందుకు 150 డివిజన్లకు సంబంధించి 181 మందితో కూడిన భారీ జాబితాను టీఆర్‌ఎస్‌ రూపొందించింది. కేటీఆర్‌తో పాటు 11 మంది మంత్రులు, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్లతోపాటు జీహెచ్‌ఎంసీకి శివారుగా ఉన్న పలు మున్సిపల్‌ కార్పొరేషన్ల మేయర్లను ఇన్‌చార్జీలుగా నియమించింది.

వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులకు కూడా ఇన్‌చార్జీల బాధ్యతలు అప్పగించింది. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్‌ నాయకులను కూడా ఇందులో చేర్చింది. నామినేషన్ల దాఖలు మొదలుకొని అసంతృప్తుల బుజ్జగింపు, ప్రచార వ్యూహం అమలు, క్షేత్రస్థాయిలో పార్టీ యంత్రాంగాన్ని సమన్వయం చేయడం, రాష్ట్రస్థాయి నాయకత్వానికి డివిజన్లలోని రాజకీయ పరిస్థితులను ఎప్పటికప్పుడు నివేదించడం వంటి బాధ్యతలను ఇన్‌చార్జీలు నిర్వర్తించాల్సి ఉంటుంది. గ్రేటర్‌ మంత్రులు మహమూద్‌ అలీ, శ్రీనివాస్‌ యాదవ్, సబితా ఇంద్రారెడ్డిలకు డివిజన్‌ ఇన్‌చార్జి బాధ్యతల నుంచి మినహాయింపు ఇచ్చారు.
Published by: Kishore Akkaladevi
First published: November 21, 2020, 9:22 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading