Telangana: పండుగ పూట పేదలకు కేసీఆర్ సర్కార్ భారీ కానుక.. డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీకి ముహూర్తం ఫిక్స్

news18-telugu
Updated: October 23, 2020, 7:12 PM IST
Telangana: పండుగ పూట పేదలకు కేసీఆర్ సర్కార్ భారీ కానుక.. డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీకి ముహూర్తం ఫిక్స్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం పథకాన్ని ప్రారంభించింది. ఇళ్లు లేని నిరుపేదలకు అన్ని హంగులతో డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మించి ఇస్తామని 2014 ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ పార్టీ హామీ ఇచ్చింది. అయితే కొన్ని చోట్ల మినహా అనేక చోట్ల ఇళ్ల నిర్మాణాలు ఇంకా పూర్తి కాలేదు. నిర్మాణం పూర్తయినా.. కొన్ని చోట్ల పంచలేదు. ఈ విషయంపై అధికార పార్టీ ప్రతిపక్షాల నుంచి పలు సందర్భాల్లో విమర్శలు ఎదుర్కొటోంది. అయితే పూర్తి అయిన చోట్ల ఇళ్లను పంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పంచేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. తొలి విడతలో గ్రేటర్ లోని పేదలకు 1152 ఇళ్లను పంపిణీ చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.

మొదటగా జియాగూడలో 840, కట్టేల మండిలో 120, గోడే కా కబర్ 192 ఇళ్ళను పంపిణీ చేసేందుకు నిర్ణయించారు. ఈ ఇళ్లను మంత్రి సోమవారం మంత్రి కేటీఆర్ అర్హులైన పేదలకు పంపిణీ చేయనున్నారు. ఇందుకు ఏర్పాట్లను అధికారులు ప్రారంభించారు. ఆయా ఏర్పాట్లను గ్రేటర్ కు చెందిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యవేక్షిస్తున్నారు. త్వరలోనే జీహెచ్ఎంసీ పరిధిలో నిర్మాణాలు పూర్తయిన డబుల్ బెడ్రూం ఇళ్లను పంపిణీ చేయనున్నట్లు సమాచారం. గ్రేటర్ ఎన్నికల లోపే సాధ్యమైనంతమేర ఇళ్ల పంపిణీ ప్రక్రియ పూర్తి చేయాలన్నది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది.

ఇదిలా ఉంటే.. వరి ధాన్యం కొనుగోలు కోసం గ్రామాల్లో ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర చెల్లించి, మక్కలు కొనుగోలు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. క్వింటాల్ కు రూ.1,850 మద్దతు ధర చెల్లించి మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేస్తామని, రైతులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరారు. మక్కలకు మద్దతు ధర వచ్చే అవకాశం లేదు కాబట్టి, వర్షాకాలంలో రైతులు మక్కలు సాగు చేయవద్దని ప్రభుత్వం కోరిందని, అయినప్పటికీ రైతులు మక్కల సాగు చేశారని సీఎం కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. వద్దంటే మక్కలు సాగు చేశారని, వాస్తవానికి ప్రభుత్వానికి మక్కలు కొనుగోలు చేసే బాధ్యత లేదని సిఎం అన్నారు. అయినప్పటికీ రైతులు నష్టపోవద్దనే ఏకైక కారణంతో ప్రభుత్వం నష్టాన్ని భరించడానికి సిద్ధపడి మక్కలు కొనుగోలు చేయాలని నిర్ణయించినట్లు కేసీఆర్ వెల్లడించారు.

గత యాసంగిలో మార్క్ ఫెడ్ 9 లక్షల టన్నుల మక్కలను మార్క్ ఫెడ్ ద్వారా ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసిందని సీఎం కేసీఆర్ అన్నారు. దీనికోసం రూ. 1668 కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. ఆ మక్కలకు బయట మార్కెట్లో ధర లేకపోవడం వల్ల వేలం వేయాల్సి వచ్చిందని అన్నారు. దీనివల్ల కేవలం రూ. 823 కోట్ల రూపాయలు మాత్రమే వచ్చాయని.. మార్క్ ఫెడ్‌కు మొత్తంగా 845 కోట్ల నష్టం వచ్చిందని అన్నారు. క్వింటాళుకు రూ.1,760 చొప్పున ధర చెల్లించి మార్క్ ఫెడ్ మక్కలను కొన్నదని తెలిపారు. సేకరణ, రవాణా తదితర ఖర్చులన్నీ కలిపి క్వింటాళుకు రెండు వేల రూపాయలు ఖర్చు అయింది. కానీ వేలంలో వచ్చింది క్వింటాళుకు కేవలం 1,150 రూపాయలు మాత్రమే అని తెలిపారు. క్వింటాళుకు 850 రూపాయల నష్టం వచ్చిందని అన్నారు. మక్కలకు దేశ వ్యాప్తంగా మార్కెట్ లేకపోవడం వల్ల తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వస్తున్నదని సీఎం కేసీఆర్ వివరించారు.
Published by: Nikhil Kumar S
First published: October 23, 2020, 7:08 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading