2020 మేలో అమెరికాలో జరగబోతోంది ప్రపంచ పర్యావరణ, నీటి సదస్సు. దీనికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్... హాజరుకావాలని సదస్సు నుంచీ ఆహ్వానం లభించింది. అమెరికా సివిల్ ఇంజినీర్స్ సొసైటీ నిర్వహించే ఈ ప్రఖ్యాత సదస్సుకు కేటీఆర్‌కి రెండోసారి ఆహ్వానం లభించడం విశేషం. 2017లో కాలిఫోర్నియాలోని శాక్రమెంటోలో జరిగిన ఇదే తరహా సదస్సుకు కేటీఆర్ ముఖ్య అతిథిగా వెళ్లి... కీనోట్ స్పీకర్‌గా మాట్లాడారు. 2017లో కాళేశ్వరం ప్రాజెక్టు, ఇతర తెలంగాణ ప్రభుత్వ ప్రాజెక్టులపై మాట్లాడిన కేటీఆర్... తెలంగాణ ప్రభుత్వం... సాగునీటి, పర్యావరణ సమతుల్యత, నీటి వనరుల అభివృద్ధి కోసం తీసుకున్న చర్యల్ని వివరించారు. ఈసారి కూడా ఆయన కీనోట్ స్పీకర్‌గా హాజరై... తెలంగాణ సాగునీటి అనుభవాల్ని వివరించనున్నారు. నేడు కేటీఆర్ పుట్టిన రోజు వేడుకలు జరుగుతున్న తరుణంలో... ఇలాంటి ఆహ్వానం రావడంతో... టీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.
ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం ఈ సంవత్సరం ప్రారంభమైన విషయాన్ని తాము తెలుసుకున్నామన్న సదస్సు నిర్వాహకులు... ఆ సందర్భంగా... కేటీఆర్‌ని మరోసారి ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. 2020 మే 17 నుంచి 21 వరకు అమెరికాలోని నేవాడాలో ఈ సదస్సు జరగబోతోంది. దీనికి చాలా దేశాల నుంచీ 1000 మంది దాకా నీటి, పర్యావరణ నిపుణులు హాజరు కాబోతున్నారు. వివిధ దేశాల్లోని సాగునీటి వ్యవస్థలు, స్మార్ట్ వాటర్ కార్యక్రమాలపై ఈ సదస్సులో చర్చించనున్నారు.
Published by:Krishna Kumar N
First published:July 24, 2019, 06:47 IST