కృష్ణా ప్రాజెక్టులన్నీ కళ కళ.. గోదావరి ప్రాజెక్టులన్నీ ఖాళీగా..

శ్రీశైలం డ్యాం

కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులన్నీ నిండగా, గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్టులు మాత్రం ఖాళీగానే ఉన్నాయి. ఆల్మట్టి, ఉజ్జయినితో పాటు నారాయణపూర్‌, జూరాల, తుంగభద్ర, శ్రీశైలం, నాగార్జునసాగర్‌, పులిచింతల ప్రాజెక్టులు నిండుకుండల్లా మారాయి.

  • Share this:
ఈ సారి వరణుడు కాస్త ఫర్వాలేదనిపించాడు.. కొన్ని రోజుల పాటు వానలు బాగానే పడ్డా.. ఇప్పుడు తగ్గుముఖం పట్టాయి. దీంతో రాష్ట్రానికి వరద కూడా తగ్గింది. అయితే, రాష్ట్రంలోని గోదావరి, కృష్ణా బేసిన్‌లలో పరిస్థితి భిన్నంగా ఉంది. కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులన్నీ నిండగా, గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్టులు మాత్రం ఖాళీగానే ఉన్నాయి. ఈ ఏడాది సీజన్‌ మొదట్లోనే కృష్ణాకు భారీ వరదలు వచ్చాయి. కర్ణాటక, మహారాష్ట్రల్లో కురిసిన భారీ వర్షాలకు వరద వచ్చింది. 15-20 రోజుల పాటు భారీ వరద వచ్చింది. దీంతో కృష్ణా బేసిన్‌లోని అన్ని ప్రాజెక్టులు నిండడంతో గేట్లు ఎత్తి నీటిని సముద్రంలోకి విడుదల చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆల్మట్టి, ఉజ్జయినితో పాటు నారాయణపూర్‌, జూరాల, తుంగభద్ర, శ్రీశైలం, నాగార్జునసాగర్‌, పులిచింతల ప్రాజెక్టులు నిండుకుండల్లా మారాయి. గత పదేళ్లలో ఆగస్టులో ఈ స్థాయిలో వరద రావడం ఇదే తొలిసారని అధికారుల అంచనా వేశారు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు శ్రీశైలం ప్రాజెక్టులోకి సుమారు 860 టీఎంసీల నీరు వచ్చింది. సాగర్‌లోకి 561, ఆల్మట్టిలోకి 813, జూరాలలోకి 804 టీఎంసీల వరద వచ్చింది. ప్రస్తుతం కృష్ణా బేసిన్‌లోని అన్ని ప్రాజెక్టుల్లో సుమారు 956 టీఎంసీల నీరు నిల్వ ఉంది. దీంతో ఖరీఫ్‌ పంటలకే కాకుండా, రబీలో కూడా కొంత నీటిని రైతులకు అందించే అవకాశం ఉందని ఇంజనీర్లు అంచనా వేస్తున్నారు.

అయితే, గోదావరి బేసిన్‌లో పరిస్థితి భిన్నంగా ఉంది. ఎగువన సరైన వర్షాలు కురవకపోవడంతో ఇప్పటి వరకు గోదావరి ప్రాజెక్టుల్లోకి వరద నీరు రాలేదు. శ్రీరాంసాగర్‌లోకి కేవలం 12 టీఎంసీల నీరే వచ్చింది. నిజాంసాగర్‌లోకి 0.13 టీఎంసీలు, సింగూరులోకి 0.31 టీఎంసీలు, లోయర్‌ మానేరులోకి 0.43 టీఎంసీల నీరు వచ్చింది. మిడ్‌మానేరులోకి 5.18 టీఎంసీలు వచ్చింది. అయితే ఇందులో ఎక్కువ శాతం కాళేశ్వరం నుంచి పంప్‌ చేస్తున్న నీరే ఉంది.

కడెం, ఎల్లంపల్లి ప్రాజెక్టుల్లోకి మాత్రం వరద వచ్చింది. ఈ రెండు ప్రాజెక్టులు పూర్తిగా నిండాయి. ఎల్లంపల్లి దిగువన గోదావరి నదిలో వరద భారీగానే నమోదైంది. ముఖ్యంగా ప్రాణహిత గోదావరిలో కలిసిన తర్వాత మేడిగడ్డ బ్యారేజి నుంచి భారీ వరద ప్రవాహం నెలకొంది. ఎగువన నీటి కొరతను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం కాళేశ్వరం నుంచి లిప్టు చేస్తున్న నీటితో అక్కడి రైతుల అవసరాలను తీర్చాలని ప్రభుత్వం యోచిస్తోంది.
First published: