Home /News /telangana /

KOTHGUDEM PEOPLE TO BE AFRAID BY VANAMA RAGAVA ACITIVITIES KMM VRY

Vanama Raghava : కొడుకు కాలకేయుడైతే.. తండ్రి దృతరాష్ట్రుడా..? గూడేం ప్రజల బెంబెలు..

ragava vanama and venkateshwar rao

ragava vanama and venkateshwar rao

Vanama Raghava : కొడుకు కాలకేయుడు.. తండ్రి దృతరాష్ట్రుడా అన్నట్టుంది కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు పరిస్థితి.. కొడుకు అరాచకాలకు కళ్లు మూసుకుని ఇప్పుడు కూడా వత్తాసు పలకడంపై పెద్ద దుమారమే రేగుతోంది. 

  ( జి.శ్రీనివాసరెడ్డి, కరస్పాండెంట్, న్యూస్‌18 తెలుగు, ఖమ్మం జిల్లా )

  వనమా రాఘవ అలియాస్‌ రాఘవేంద్రరావు. అతనిది ఆది నుంచి అరాచకమే.. పాల్పడిన దురాగతాలు వందల్లో.. పోలీసులకు ఫిర్యాదు అయింది పదుల్లో.. కేసులు నమోదైంది మాత్రం వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు.. అధికారం అండగా.. డబ్బు ఇచ్చిన బలం అతన్ని అరాచకాలకు పురిగొల్పింది. దీనికితోడు తండ్రి నాలుగు మార్లు ఎమ్మెల్యే, ఓ మారు మంత్రిగా పనిచేసి ఉండడం.. వెరసి అతని అరాచకాలకు అడ్డుఅదుపూ లేకుండా పోయింది. పేరుకు తండ్రి పదవిలో ఉన్నప్పటికీ.. అధికారం మాత్రం రాఘవదే. ఇది ఏళ్లుగా కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలు ఎరిగిన విషయమే. కొడుక్కి తెలీకుండా ఏమైనా నిర్ణయం తీసుకుంటే అది అమలు కానీయడని చెబుతుంటారు. వివిధ పథకాలకు లబ్దిదారుల ఎంపిక మొదలు.. నియోజకవర్గంలో రెవెన్యూ, పోలీసు, ఇతర శాఖల అధికారులు మొదలు, సిబ్బంది దాకా అతని ఆమోదం లేకుండా రాలేరు.. వచ్చినా పనిచేయలేరు. రాఘవేంద్ర ఆమోదంతో వచ్చారంటే ఆయన చెప్పినట్టు చేయాల్సిందే. తన కనుసన్నల్లో పనిచేయకుంటే ఇక ఆ అధికారి మూటాముల్లె సర్దుకోవాల్సిందేనన్నది జగమెరిగిన సత్యం. 

  కళ్లు మూసుకున్న తండ్రి..

  నిజానికి కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకు మాస్‌ లీడర్‌గా పేరుంది. పంచాయతీ వార్డు మెంబర్‌గా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన వనమా వెంకటేశ్వరరావు సర్పంచిగా, సొసైటీ ఛైర్మన్‌గా, మున్సిపల్‌ ఛైర్మన్‌గా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, ఓ సారి మంత్రిగా పనిచేశారు. కొడుకును రాజకీయ వారసునిగా తయారు చేయాలన్న మమకారంతో రాఘవేంద్రను మొదటి నుంచి ప్రోత్సహించడం.. అతను చేసే అరాచకాలను చూసీ చూడనట్టు పోవడమే తీరా కొడుకు రాఘవ కాలకేయునిలా మారాడు. అదుపులో పెట్టాల్సిన తండ్రి మాత్రం దృతరాష్ట్రునిలా వ్యవహరించాడు. ఫలితం రాఘవేంద్ర ఎందరో ఉసురు పోసుకున్నాడని ఆ నియోజకవర్గప్రజలు చెబుతుంటారు. కుటుంబ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం.. ఆస్తి వివాదాల్లో భాగపంపిణీలు చేయడం.. వ్యాపార లావాదేవీల్లో భాగస్వాముల మధ్య తలెత్తే వివాదాలను కేంద్రంగా చేసుకుని ఆర్ధికంగా పిండుకోవడం.. ఇలా ఒకటి కాదు రెండు కాదు. అతనిపై ఉన్న ఆరోపణలు వందల్లోనే. పోలీసుల దాకా వచ్చి ఫిర్యాదు చేసేవి పదుల్లో అయితే.. కేసు రిజిస్టర్‌ అయినవి ఇప్పటిటి కేవలం ఆరు. అతని అరాచకాలు దీనికి ఖచ్చితంగా వందరెట్లు ఉంటుందని అందరికీ తెలిసినా నోరుమెదపలేని పరిస్థితి. పోలీసులు, రెవెన్యూలో ప్రత్యేకంగా ఒక వర్గాన్నే తయారు చేసుకున్నాడన్న ఆరోపణలు ఉన్నాయి. రాఘవతో పెట్టుకుంటే ప్రమాదం ఏ రూపంలో ముంచుకొస్తుందోనన్న భయంతో బిక్కుబిక్కుమంటూ బతకడేమేనని చెబుతుంటారు. అయినా రాజకీయ అండతో, ధనబలంతో దశాబ్దాలుగా రాఘవ అరాచకాలు సాగుతునే ఉన్నాయి.

  Huzurabad : కడప నుండి కరీంనగర్‌కు చేరింది, అయినా యువతికి దక్కని న్యాయం, చలిలోనే..! ఇంతకి ఏం జరిగింది..?


  గిరిజనుల భూముల్లోను ఇదే తంతూ...? 

  గిరిజన భూముల ప్రత్యేక హక్కుల చట్టం 1\70 చట్టం అమలులో ఉన్న ప్రాంతమైనప్పటికీ ప్రభుత్వ స్థలాల కబ్జా యధేచ్చగా సాగించినట్టు ఆరోపణలున్నాయి. దీనికి సంబంధించి 2006లో పాలకోయతండాలో ఆక్రమణల తొలగిస్తున్న అధికారులపై దౌర్జన్యానికి పాల్పడిన కేసు ఇతనిపై ఉంది. ఇక ఎన్నికల సమయంలో డబ్బు, మద్యం, చీరలు, ఇంకా ఇతర సామగ్రి పంపిణీలో అందెవేసిన చేయి అయిన రాఘవపై 2013లో మాత్రం ఒక్క కేసు నమోదైంది. ఇంకా 2020 సోనియానగర్‌లో ఓ భూవివాదంలో భూక్య జ్యోతి అనే మహిళపై దాడి చేయించిన కేసు, ఎస్సీ ఎస్టీ కమిషన్‌ జోక్యం చేసుకున్నాక రిజిస్టర్‌ అయ్యిందంటే అతని పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. 2021లో మలిపెద్ది వెంకటేశ్వరరావు అనే వ్యాపారి వనమా రాఘవ వల్లే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు పేర్కొంటూ ప్రాణాలు తీసుకున్నాడు.

  రామకృష్ణ కుటుంబం బలి..

  ఇక తాజా ఘటనలో నాగరామకృష్ణ కుటుంబాన్ని రాఘవ బలితీసుకున్నాడు. రామకృష్ణ కారులో లభ్యమైన మొబైల్‌ ఫోన్‌లో సెల్ఫీగా రికార్డు చేసిన వీడియో రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. రాఘవ లాంటి కీచకునిపై కఠిన చర్యలు తీసుకోవాలన్న చర్చ నడుస్తోంది. నాలుగు రోజులుగా అతని కోసం గాలిస్తున్న పోలీసులకు ఇంకా రాఘవ ఆచూకీ లభ్యం కాలేదు. నాటకీయంగా అతని తండ్రి, ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఒక. బహిరంగ లేఖ విడుదల చేశారు. తాను స్వయంగా కొడుకును పోలీసులకు అప్పగిస్తానని లేఖలో పేర్కొన్నప్పటికీ.. రాఘవను హైదరబాదులో అరెస్టు చేశారని తొలుత వార్తలు వచ్చినప్పటికీ.. తమకు ఇంకా రాఘవ దొరకలేదని, ఎనిమిది బృందాలు వెతుకుతున్నాయని ఏఎస్పీ రోహిత్‌రాజ్‌ స్పష్టం చేశారు.

  Telangana News : అయ్యో పాపం .. కడుపులో ఉన్న శిశువు ఏం చేసిందమ్మా... నిండు గర్భిణి దారుణం..!


  కొనసాగుతున్న కొత్తగూడెం బంద్

  ఇక వనమా రాఘవ అరాచకాలకు నిరసనగా కొత్తగూడెం నియోజకవర్గం బంద్‌కు వపక్షాలు పిలుపునిచ్చాయి. శుక్రవారం నాడు బీజేపీ, కాంగ్రెస్‌, తెదేపా సహా వామపక్షాలు బంద్‌ నిర్వహిస్తున్నాయి. అయితే వనమా రాఘవ అరాచకాలు ప్రభుత్వానికి తలవంపులుగా తయారయ్యాయని తెరాస అధిష్టానం భావిస్తున్నట్టు తెలిసింది. మొత్తం ఎపిసోడ్‌పై సమగ్ర నివేదిక ఇవ్వాల్సిందిగా పార్టీ జిల్లా బాధ్యులను ఆదేశించినట్టు తెలిసింది. దీనిపై పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ తీవ్రంగానే స్పందిస్తారన్న అంచనాల మధ్య, ముందస్తు జాగ్రత్తల్లో భాగంగానే తానే స్వయంగా కొడుకును పోలీసులకు అప్పగిస్తానని ఎమ్మెల్యే వనమా ప్రకటించారని చెబుతున్నారు.
  Published by:yveerash yveerash
  First published:

  Tags: Kothagudem, Vanama

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు