హోమ్ /వార్తలు /తెలంగాణ /

Video: భద్రాద్రిలో హోరెత్తిన వరదలో గర్భిణి.. ‘పేగు’ దక్కాలంటే వాగు దాటాలిలా..

Video: భద్రాద్రిలో హోరెత్తిన వరదలో గర్భిణి.. ‘పేగు’ దక్కాలంటే వాగు దాటాలిలా..

గర్భిణిని వాగు దాటిస్తున్న బంధువులు

గర్భిణిని వాగు దాటిస్తున్న బంధువులు

వర్షాకాలం సీజన్ వస్తే ఏజెన్సీ ప్రాంతం నుంచి మండలకేంద్రంలోని 8 కిలోమీటర్ల దూరంలోగల ఆసుపత్రికి తరలించేందుకు గిరిజనులు ప్రతి ఏడాది నానావస్థలు పడుతున్నారు.

(జి. శ్రీనివాసరెడ్డి, ఖమ్మం కరస్పాండెంట్, న్యూస్‌18)

ఇటీవల కురిసిన భారీ వర్షానికి ఏజెన్సీ ప్రాంతాల్లోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వర్షం కారణంగా పలు గ్రామాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని గుండాల, ఆళ్లపల్లి మండలాలలోని కిన్నెరసాని, మల్లన్నవాగు, ఏడుమెలికలవాగుకు వరద ఉధృతి పెరుగుతోంది. వరద ఉధృతికి గుండాల మండలంలోని మల్లన్నవాగుపై గల తాత్కాలిక వంతెన కొట్టుకుపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఈరోజు మధ్యాహ్నం నరసాపురం తండాకు చెందిన నునావత్ మమత అనే ఎనిమిది నెలల గర్భిణీని ఆసుపత్రికి తరలించేందుకు ఆమె కుటుంబసభ్యులు నానా అవస్థలు పడ్డారు. ద్విచక్రవానంపై ఆమెను తీసుకువెళ్లగా ..ఇటీవల మల్లన్నవాగుపై గల తాత్కాలిక వంతెన సైతం కొట్టుకుపోవడంతో గర్భిణీని ఆమె కుటుంబసభ్యులు తమభుజాలపై మోసుకెళ్లి ఒడ్డుదాటించారు. ఒకవైపు పురిటినొప్పులతో మరోవైపు వరద ఉధృతితో గర్భిణీ నానావస్థలు పడి ఒడ్డుకు చేరుకుంది. ప్రస్తుతం గర్భిణీని గుండాలలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి అదుపులోనే ఉందని వైద్యసిబ్బంది తెలిపారు.


వర్షాకాలం సీజన్ వస్తే ఏజెన్సీ ప్రాంతం నుంచి మండలకేంద్రంలోని 8 కిలోమీటర్ల దూరంలోగల ఆసుపత్రికి తరలించేందుకు గిరిజనులు ప్రతి ఏడాది నానావస్థలు పడుతున్నారు. వర్షం కారణంగా ఇప్పటికే గుండాల నుంచి మణుగూరు, నర్సంపేట, వరంగల్ కు రాకపోకలు బందయ్యాయి. దీంతో ప్రయాణికులకు అవస్థలు తప్పడంలేదు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని జిల్లా కలెక్టర్ ఎంవిరెడ్డి గతంలో ఆదేశించారు. గర్భిణీల జాబితాను సేకరించి ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు. అయినా ఇలాంటి ఘటనలు పునరావృతం కావడం అధికారుల నిర్లక్ష్యానికి అద్ధం పడుతోంది.

First published:

Tags: Bhadradri kothagudem, Telangana