బాలకృష్ణ, న్యూస్ 18 తెలుగు, హైదరాబాద్.
తెలంగాణలో వంటగది మహారాష్ట్రలో బెడ్ రూం ఒక ఇళ్లు రెండు రాష్ట్రాల్లో నిర్మించడం సాధ్యమవుతుందా? అంటే ఎవరైనా సాధ్యం కాదని టక్కున సమాధానం చెబుతారు. కానీ ఓ వ్యక్తి నిర్మించుకున్న ఇంటిలోని పడకగది మహారాష్ట్రలోకి, వంట గది తెలంగాణలోకి వచ్చింది. అవును మీరు చదివింది నిజమే, తెలంగాణ , మహారాష్ట్ర మధ్య నేటికీ సరిహద్దు వివాదాలు తొలగిపోలేదు అనడానికి ఇది నిదర్శనంగా నిలిచింది.
మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా రాజూర్ తాలూకా మహరాజ్ గూడలో ఓ ఇల్లు రెండు రాష్ట్రాల్లో ఉండటం వైరల్ గా మారింది. అనుకోకుండా ఆ ఇంటిలోని బెడ్ రూం మహారాష్ట్రలో, వంటగది తెలంగాణలోకి వచ్చింది. ఉత్తమ్ పవార్, అతని సోదరుల కుటుంబాలకు చెందిన 13 మంది సభ్యులు ఈ విచిత్రమైన ఇంటిలో నివాసం ఉంటున్నారు. కొన్నేళ్ల క్రితం ఇంటిని విభజించినప్పుడు తనకు, తన సోదరుడికి ఒక్కొక్కరికి నాలుగు గదులు వచ్చాయని ఉత్తమ్ పవార్ చెప్పాడు. తన వంటగది తెలంగాణలో ఉందని, పడకగది మహారాష్ట్ర వైపు ఉందని ఆయన గుర్తు చేశారు. ఇంటి మధ్యలో నుంచి రెండు రాష్ట్రాల సరిహద్దులు వెళ్లినా తనకు ఎలాంటి సమస్యలు ఎదురుకాలేదని ఆయన తెలిపారు.
తమ కుటుంబాలకు రెండు రాష్ట్రాల సంక్షేమ పథకాలు అందుతున్నాయని పవార్ వెల్లడించారు. అంతేకాదు రెండు ప్రభుత్వాలకు వారు పన్నులు చెల్లిస్తున్నారు. మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల రోడ్డు రవాణా అధికారుల వద్ద వాహనాలను రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఇంటి గోడపై చాక్ పీస్‌తో గీసిన సరిహద్దును గుర్తించవచ్చని పవార్ తెలిపారు. మహరాజ్ గూడ గ్రామస్థులు రెండు రాష్ట్రాల సంక్షేమ పథకాల ప్రయోజనాలను అనుభవిస్తున్నారు. మహారాష్ట్ర, తెలంగాణా రెండు రాష్ట్రాలు అభివృద్ధి పనులు చేస్తున్నాయి.తాగునీటి పథకాలు, విద్యుత్ , గృహ మరుగుదొడ్లు, గృహనిర్మాణ పథకాలు ఇలా అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలు రెండు ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి.
తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు సమస్యలు ఈ నాటివి కావు. 7 దశాబ్దాలుగా సరిహద్దు సమస్య కొనసాగుతూనే ఉంది. అనేక సార్లు సర్వేలు చేయడం. సరిహద్దు రేఖను గీయడం చేస్తూ ఉంటారు. సాంకేతిక అంశాల ప్రకారం గీచే రేఖలు గ్రామం మధ్యలో నుంచి ఒక్కోసారి ఇంటి మధ్య లో నుంచి కూడా వెళుతున్నాయి. అవే గుర్తులను అధికారులు వేస్తున్నారు. దీంతో పలు గ్రామాలు సగం ఒక రాష్ట్రంలో మరో సగం మరో రాష్ట్రంలో ఉండిపోతున్నాయి. అంతెందుకు ఒక ఇళ్లే రెండు రాష్ట్రాల్లోకి వస్తోంది. ఆంధ్రా, ఒరిస్సా మధ్య కూడా ఇలాంటి సమస్యే నలుగుతోంది. సరిహద్దుల్లో ఓ గ్రామం రెండు రాష్ట్రాలోకి ఉంది. అక్కడ ఏ రాష్ట్రం పట్టించుకోకపోవడంతో వారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.