రైతు పూజోత్సవం...అన్నం పెట్టే అసలైన హీరోను అందరూ స్మరించాలి..

వ్యవసాయం ఓ గౌరవప్రదమైన వృత్తిగా, చదువుకున్న యువత సైతం ఓ ఆప్షన్‌గా ఎంచుకునే విధంగా ఉంటే.. ఇటువంటి కార్యక్రమాలు ప్రతీ పౌరుడు చేపడితే రైతుకి మనోధైర్యం పెరిగి ఆత్మహత్యలు తగ్గే అవకాశం వుంటుంది.

news18-telugu
Updated: July 22, 2020, 6:11 PM IST
రైతు పూజోత్సవం...అన్నం పెట్టే అసలైన హీరోను అందరూ స్మరించాలి..
రైతులను సన్మానిస్తున్న యువకులు
  • Share this:
'జై జవాన్‌.. జైకిసాన్‌'.. వినగానే ఎంతో ఎమోషనల్‌గా.. ఒళ్లు పులకరించేలా ఉండే ఈ నినాదం అప్పుడప్పుడూ మాత్రమే ఉనికిలోకి వస్తుంటుంది. ప్రతి తరంలో ఎంతో కొంతమందిని కదలిస్తుంటుంది. ఎప్పుడో దశాబ్దాల క్రితం మాజీ ప్రధాని లాల్‌బహదూర్‌శాస్త్రి ఇచ్చిన ఈ నినాదం ఇప్పుడు యువతను స్పందింపజేస్తోంది. 'కిసాన్‌ సమ్మాన్‌ సంఘటన్‌' అనే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లాకు చెందిన కొందరు చదువుకున్న యువత ఈతరం వ్యవసాయాన్ని విస్మరిస్తున్న వైనంపై ఆవేదనకు గురయ్యారు. ఎండనక, వాననక రుతువులకు అతీతంగా చెమటోడ్చి కష్టించే రైతన్నను నిర్లక్ష్యం చేస్తున్న నేటి పరిస్థితిని కొంతైనా మార్చాలన్న ఆలోచనతో వినూత్నంగా ఓ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

'రైతు పూజోత్సవం' పేరిట ఓ మంచి కార్యక్రమాన్ని తీసుకుని 'సాగు' యోగ్యమైనదేనన్న సంకేతాన్ని చాటుతున్నారు. ప్రపంచానికి అన్నం పెట్టే రైతన్న మాత్రమే నిజమైన హీరో అన్న నినాదంతో భావితరాలు వ్యవసాయంపై మక్కువ చూపేలా కృషి చేస్తున్నారు. ఇప్పటికే వ్యవసాయం చేసే వారికి పెళ్లి కూడా కాని పరిస్థితి ఉందని.. టౌన్లలో చిన్నపాటి ఉద్యోగం ఉన్న వారికి ఉన్న విలువ కూడా రైతన్నకు లేకపోవడం పట్ల తీవ్ర ఆవేదనకు గురై.. ఎలాగైన రైతన్న విలువను ప్రపంచానికి తమ వంతుగా చాటడానికే ఇలా రైతు పూజోత్సవం లాంటి సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టామంటున్నారు ఈ యువత.


సినిమా, క్రికెట్, పబ్జీ లాంటి వాటి మాయలో పడిపోయిన యువతని మేలుకొలిపే దిశగా తాము తెలుగు రాష్ట్రాలలో 'రైతు పూజోత్సవం' అనే కార్యక్రమానికి నాంది పలికినట్టు కిసాన్ సమ్మాన్‌ సంఘటన్‌ సంస్థ ఖమ్మం జిల్లా ప్రతినిధి శాసనాల సాయిరాం 'న్యూస్‌18' తెలుగు కరస్పాండెంట్‌కు వివరించారు.

ప్రస్తుత పరిస్థితి తలుచుకుంటే కడుపు తరుక్కుపోతోందని.. మన జీవితాలలో, మన తినే తిండిలో, మనం పొందే ఆరోగ్యంలో ఇలా నిత్య జీవితంలో.. బతికున్నంత దాకా మన ప్రతి మూమెంట్‌లోనూ రైతన్న కష్టం ఉందన్న నిజాన్ని చాటాలన్నదే తమ స్వచ్ఛంద సంస్థ లక్ష్యమన్నారు. అందుకోసమే ఈ స్వచ్ఛంధ సంస్థ ప్రతినిధులు పల్లెల్లోకి వెళ్లి.. స్వయంగా పొలాల వెంట తిరుగుతూ అరక దున్నుతూ.. ఇంకా నారుమళ్లు చేసుకుంటూ.. దుగాలు చెక్కుకుంటూ కనిపించిన ప్రతి రైతన్నను పలకరిస్తున్నారు. వారి కష్టాన్ని, ఇబ్బందులను వాకబు చేస్తూ ఈ వృత్తిలో ఎదురవుతున్న కష్టనష్టాలను, వారి మనోభావాలను తెలుసుకుంటూ అక్కడే వారికి సన్మానం చేస్తున్నారు. ప్రతి రైతన్న తాను బతుకుతూ పదిమందికి బతుకునిస్తున్న తీరును వివరిస్తూ వారి కష్టం మాత్రమే కాదు.. త్యాగమంటూ గుర్తుచేస్తున్నారు. తమ పిల్లలు ఒక డాక్టర్‌, ఇంజినీర్‌, ఒక సివిల్‌ సర్వెంట్‌.. ఒక సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ కావాలని తల్లిదండ్రులు కలలు కంటారని.. ఒక వ్యవసాయదారుడు కావాలని కలలు కనే పరిస్థితి రావాల్సిన అవసరం ఉందన్న నిజాన్ని ఈ యువ ప్రతినిధులు చాటుతున్నారు. తొలకరి అవుతూనే తాము ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని, ఇప్పటికి దాదాపు మూడు మండలాల్లోని కొండాపురం, సీతారామపురం, బారుగూడెం, వెంకటగిరి, లక్ష్మీపురం, గుర్రాలపాడు సహా
పది గ్రామాలకు పైగా తిరిగి తొంబై మందికి పైగా రైతులను సత్కరించి, వారితో ఆత్మీయంగా మాట్లాడి వారి ఇబ్బందులను తెలుసుకున్నామని ఈ ప్రతినిధులు చెబుతున్నారు. విస్త్రుతంగా భారీగా ఈ కార్యక్రమాన్ని చేయాలనుకున్నా కరోనా వైరస్‌ దృష్ట్యా నెమ్మదిగా ఒక్కొక్కరిని కలుస్తున్నామని, భవిష్యత్‌లో దీన్ని మరింత ఉధృతంగా చేస్తామంటున్నారీ యువత. వీరికి ఎన్నారైల నుంచి అన్ని విధాల మద్దతు ఉండడం ఇక్కడ విశేషం.
వ్యవసాయం ఓ గౌరవప్రదమైన వృత్తిగా, చదువుకున్న యువత సైతం ఓ ఆప్షన్‌గా ఎంచుకునే విధంగా ఉంటే.. ఇటువంటి కార్యక్రమాలు ప్రతీ పౌరుడు చేపడితే రైతుకి మనోధైర్యం పెరిగి ఆత్మహత్యలు తగ్గే అవకాశం వుంటుంది. ఇలా రైతులకి పూర్వ వైభవంతో సంతరించుకుంచుకునేలా చేయడమే తమ కార్యక్రమ ఉద్దేశం అంటున్నారీ యువత. ప్రభుత్వం వైపు నుంచి, రాజకీయ పార్టీల వైపు నుంచి రైతులకు సంబంధించిన ప్రతి ఇబ్బందిని తొలగించేలా, కష్టాన్ని తొలగించేలా ఓ సమగ్ర విధానం కోసం రైతుల ఆలోచనలను గుదిగుచ్చి ఓ నివేదిక తయారు చేస్తామన్నది ఈ యువత మాట.
Published by: Shiva Kumar Addula
First published: July 22, 2020, 6:08 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading