Khammam: పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీలో పొల్గొన్నందుకు యువకుల కిడ్నాప్‌.. అట్టుడుకుతున్న మన్యం..

మాట్లాడుతున్న పోలీసులు

Khammam: మన్యంలో మరోసారి కాల్పుల మోతలు మొదలయ్యాయి. ఇప్పటికే రావణకాష్టంలా మారిన దుస్థితిలో రోజురోజుకూ పరిస్థితులు దిగజారిపోతున్నట్టు కనిపిస్తున్నాయి. పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీలో పాల్గొన్నారన్న కారణంగా ఆదివాసీ యువకులను మావోయిస్టులు కిడ్నాప్‌ చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

 • Share this:
  (జి. శ్రీనివాసరెడ్డి, న్యూస్‌18 తెలుగు, ఖమ్మం జిల్లా) 

  మన్యంలో మరోసారి కాల్పుల మోతలు మొదలయ్యాయి. ఇప్పటికే రావణకాష్టంలా మారిన దుస్థితిలో రోజురోజుకూ పరిస్థితులు దిగజారిపోతున్నట్టు కనిపిస్తున్నాయి. నిన్నటికి నిన్న నారాయణ్‌పూర్‌ జిల్లాలో మావోయిస్టులతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ జవాన్‌ మృతిచెందాడు. మరో జవానుకు తీవ్రగాయాలయ్యాయి.  మంగళవారం నారాయణ్‌పూర్‌ ఎమ్మెల్యే చందన్‌కశ్యప్‌ తన నియోజకవర్గ పర్యటనలో ఉండగా.. ఎమ్మెల్యే కాన్వాయ్‌కి పోలీసు బలగాలు బందోబస్తు ఏర్పాటు చేశాయి. దీనికోసం ఐటీబీపీకి చెందిన 45వ బెటాయిలియన్‌ బలగాలు ప్రధాన రహదారిలో తనిఖీలు చేపట్టాయి. ఆ రహదారిలో ఎమ్మెల్యే కాన్వాయ్‌ వెళ్లిపోయిన సరిగ్గా పదినిమిషాలకే తనిఖీల కోసం వచ్చిన బలగాలపై మావోయిస్టులు కాల్పులకు దిగారు. హోరాహోరీగా జరిగిన ఈ కాల్పుల్లో ఒక జవాన్‌ మృతిచెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో తప్పించుకున్న మావోల కోసం కూంబింగ్‌ తీవ్రతరం చేశారు. ఇదే క్రమంలో పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీలో పాల్గొన్నారన్న కారణంగా ఆదివాసీ యువకులను మావోయిస్టులు కిడ్నాప్‌ చేశారు. దీంతో మన్యంలో అలజడి రేగుతోంది.

  సుక్మా జిల్లాలో ఈ మధ్యన పోలీసు రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ జరిగింది. రకరకాల భద్రతా బలగాలకు చెందిన విభాగాల్లోకి స్థానిక యువతకు భాగస్వామ్యం కల్పించడానికి నిర్వహించిన ఈ ర్యాలీలో ఆదివాసీ యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అయితే దీనిపై తీవ్రంగా స్పందించిన మావోయిస్టులు సుక్మా జిల్లాలోని జేగురుగొండకు చెందిన యువకులను పిలిపించి నిర్భందించారు. ప్రజాకోర్టు నిర్వహించి శిక్షలు ఖరారు చేసే పనిలో నిమగ్నమయ్యారు. దీంతో స్థానికంగా ఉన్న మరో నలుగురు యువకులు మావోయిస్టులకు నచ్చజెప్పడానికి ప్రయత్నించగా వారిని కూడా నిర్భందించారు. దీంతో కిడ్నాప్‌కు గురైన వారి సంఖ్య పదకొండుకు చేరింది. గత వారంలో జరిగిన ఈ ఘటన వెలుగులోకి ఆలస్యంగా రావడంతో పోలీసు ఉన్నతాధికారులు కూడా స్పందించారు. పోలీసు శాఖలో చేరవద్దని హెచ్చరించి పంపుతారన్న ఆశాభావంతో ఈ పదకొండు మంది యువకులకు చెందిన కుటుంబసభ్యులు ఆశాభావంతో ఎదురుచూస్తున్నారు. ఇన్నిరోజులైనా ఇప్పటిదాకా వదిలేయకపోవడంతో కుటుంబాలు ఆందోళనకు గురవుతున్నాయి.

  దీనికితోడు బీజపూర్‌ జిల్లాకు చెందిన మాజీ మావోయిస్టు వింజం రాజును మావోయిస్టులు దారుణంగా చంపారు. గంగులూరులో నివాసం ఉండే రాజు సోమవారం జరిగిన సంతలో నిత్యావసరాలు తీసుకుని వెళ్తుండగా అడ్డగించిన మావోయిస్టులు దారుణంగా నరికి చంపి ప్రధాన రహదారిలో పడేసి వెళ్లిపోయారు. దీంతో వరుస ఘటనలతో నారాయణ్‌పూర్‌, బీజపూర్‌, సుక్మా జిల్లాల్లో అలజడి రేగుతోంది. ఎప్పుడు ఏంజరుగుతుందోనన్న భీతి అందరినీ వెంటాడుతోంది. మరోవైపు అమరవీరుల సంస్మరణ దినోత్సవాలకు మావోయిస్టులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ నెల 27 నుంచి ఆగస్టు 3వ తేదీదాకా జరిగే ఈ సంస్మరణ వారోత్సవాలను విజయవంతం చేయాలని ఇప్పటికే మావోయిస్టు టాప్‌ క్యాడర్‌ సంకేతాలిచ్చినట్టు చెబుతున్నారు. దీంతో పోలీసు ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అన్ని రకాల బందోబస్తును, కూంబింగ్‌ను ముమ్మరం చేస్తున్నారు.
  Published by:Veera Babu
  First published: