(G. Srinivas reddy, News18, Khammam )
తమ్మినేని కృష్ణయ్య దారుణ హత్య (Tammineni Krishnaiah murder) ఖమ్మం నగరాన్నే కాదు.. జిల్లాను సైతం ఓ కుదుపు కుదిపేసింది. ఒక్కమాటలో చెప్పాలంటే ఉమ్మడి ఖమ్మం (Khammam) జిల్లాను సైతం నివ్వెరపోయేలా చేసింది. అధికార పార్టీకి చెందిన ఓ మండల స్థాయి నేతను పట్టపగలు అత్యంత పాశవికంగా చంపడం (Murder).. అదీ వేట కొడవళ్లతో నరకడం.. పైగా చేతులు నరికి పట్టుకెళ్లడం పట్ల పగలు, ప్రతీకారాలు.. కసి ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఒకే ఉమ్మడి కుటుంబంలోని వ్యక్తుల మధ్య పొడసూపిన రాజకీయ (Political) విబేధాలు.. ఆధిపత్య ధోరణులు.. వెరసి నిన్నమొన్నటి దాకా తమలో ఒకడే అయి.. నాలుగు దశాబ్దాలు కలసి నడిచినా.. చివరకు కక్షలకు బలయ్యాడు. ఈ హత్యకు ప్రత్యక్ష సాక్షి ఇచ్చిన ప్రాథమిక సమాచారాన్ని బట్టి, పోలీసు జాగిలం చూపిన దారిని బట్టి చూస్తే ఈ దారుణ హత్య (Brutal Murder) వెనుక ఉన్నది తమ్మినేని కోటేశ్వరరావు అని తేలిపోయింది. నిజానిజాలు, సాక్ష్యాలు, విచారణలు ఎలా ఉన్నా ఆవేశంలో ఉన్న తమ్మినేని కృష్ణయ్య కుటుంబ సభ్యులు, బంధువులు, పార్టీ సానుభూతిపరులు చేసిన దాడిలో సీపీఎం నాయకుడు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సోదరుడు తమ్మినేని కోటేశ్వరరావు నివాసం, వాహనాలు ధ్వంసం అయ్యాయి.
ఖమ్మం. ప్రశాంతతకు నిలయం. పెట్టుబడులకు స్వర్గధామం. నాటి ఉమ్మడి రాష్ట్రంలోనూ.. నేటి ప్రత్యేక రాష్ట్రంలోనూ ఖమ్మం జిల్లా అంటే ఓ ప్రత్యేకత. రెండు తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు అన్ని జిల్లాలకు చెందిన ప్రజలు ఇక్కడ హాయిగా ప్రశాంతంగా జీవనం సాగిస్తుంటారు. ఒక్క తెలుగు వాళ్లే కాదు.. పొరుగున ఉన్న చత్తీస్‌ఘడ్, ఒడిషా, యూపీ, బీహార్, గుజరాత్, రాజస్థాన్.. ఇలా దాదాపు ప్రతి రాష్ట్రానికి చెందిన వాళ్లూ ఇక్కడ రకరకాల వ్యాపారాలలో సెటిల్ అయిపోయారు. ఎవరు ఎవరినీ పెద్దగా ప్రభావితం చేయలేని స్థాయిలో దాదాపు అంతా వాణిజ్యమయం అయిన ఖమ్మంలో ఓ ప్లాటు కొనుక్కుని అమెరికా వెళ్లిపోయి.. పాతికేళ్లకు తిరిగొచ్చినా అక్కడ ఎలాంటి ఇబ్బంది ఉండదన్నది జనం నమ్మకంగా ఉన్న పరిస్థితి. ఇలా ఖమ్మం అనగానే ఓ బ్రాండ్‌లా పేరు పడిపోయంది. మల్టిపుల్ పొలిటికల్ పార్టీలు ఉండడం.. నేతలు నడిపించిన దారి.. దార్శనికతగా చెప్పుకోవచ్చు. కానీ క్రమంగా ఆ పరిస్థితి మారుతోంది. అక్కడక్కడా కబ్జాలు కామన్‌గా మారాయి. సెటిల్‌మెంట్లు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఆర్థిక అంశాలకు రాజకీయ విబేధాలు తోడవుతున్నాయి. చివరకు ఆధిపత్య పోరాటంలో ఒకరిని ఒకరు దారుణంగా చంపుకునేంతగా పరిస్థితి దిగజారింది. తాజాగా స్వతంత్ర దినోత్సవం నాడు తెరాస నేత తమ్మినేని కృష్ణయ్య దారుణ హత్య దిగజారిన పరిస్థితికి నిదర్శనం.
తెదేపా జెండా కట్టాడని..
తెల్దారుపల్లి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పెద్దగా పరిచయం అక్కర్లేని ఊరు ఇది. సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్వగ్రామం కావడం.. మొదటి నుంచి సీపీఎంకు తిరుగులేని పట్టున్న ఊరు కావడం.. ఖమ్మం నగరానికి తలాకిటే ఉండటం.. కరుడు కట్టిన కమ్యూనిస్టులకు పుట్టినిల్లుగా పేరురావడం.. వెరసి ఈ ఊరిలో గత నాలుగు దశాబ్దాలుగా ఎర్రజెండా మినహాయించి వేరే జెండా పట్టిన వాళ్లు లేరు.. జెండా కట్టిన ఇల్లు లేదు. ఎప్పుడో ఇరవైయ్యేళ్ల క్రితం తెలుగుదేశం పార్టీ జెండా కట్టిన ఒక వ్యక్తి కూడా దారుణ హత్యకు గురయ్యాడు. 2001లో అప్పటి తెదేపా ప్రభుత్వంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అనుచరుడు ఏగినాటి వెంకటయ్య తెదేపా జెండా కట్టాడని సీపీఎం పార్టీకి చెందిన కార్యకర్తలు హత్య చేశారు. మళ్లీ ఇప్పుడు గ్రామంలో గులాబీ జెండా పట్టి తమ ఆధిపత్యానికి సవాలు విసిరిన తమ్మినేని కృష్ణయ్యను సైతం అదే పార్టీకి చెందిన వ్యక్తులు దారుణంగా హత్య చేశారు.
దాదాపు నలభై ఏళ్ల పాటు సీపీఎం పార్టీలో పనిచేసిన, తమ్మినేని వీరభద్రంకు సన్నిహితునిగా మెలిగిన కృష్ణయ్య పార్టీ మారడం, తమకు తిరుగులేని ఆధిక్యత ఉన్న ఊరిలో రెండో జెండాను పరిచయం చేయడం.. ఎంపీటీసీగా భార్యను గెలిపించుకోవడం.. సొసైటీ డైరెక్టర్‌గా గెలవడం లాంటివి కృష్ణయ్య రాజకీయ ప్రత్యర్థులకు కంటగింపుగా మారింది. తన భర్త హత్య వెనుక సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఉన్నారని మృతుడు కృష్ణయ్య భార్య మంగతాయారు ఆరోపించారు. హత్యలో పాలుపంచుకున్నట్టు ప్రత్యక్ష సాక్షి చెప్పిన పేర్లను బట్టి ఈ మర్డర్ వెనుక ఉన్నది సీపీఎం నేతలేనని మృతుడి కుమారుడు, కుమార్తె ఆరోపిస్తున్నారు. తనకు సన్నిహితుడైన తమ్మినేని కృష్ణయ్య దారుణ హత్య పట్ల మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్రంగా స్పందించారు. హత్యకు బాధ్యులైన వారిని వదిలేది లేదని, చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Brutally murder, Khammam, Politics