ఖమ్మంలో బీఆర్ఎస్ బహిరంగ సభ అట్టహాసంగా జరిగింది. ఈ సభకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సిపిఐకి చెందిన డి రాజా రావడంతో బహిరంగ సభ ప్రాధాన్యత పెరిగింది. మంత్రులు హరీష్ రావు, పువ్వాడ అజయ్ కుమార్ సహా ఇతర నాయకులంతా పెద్ద ఎత్తున జన సమీకరణాన్ని చేర్చారు. ఇటీవల రాజకీయాల్లో చోటు చేసుకున్న పరిణామాలతో కేసీఆర్ ఖమ్మంలో జెండా పాతాలని భావిస్తున్నారు. అందుకే పార్టీ బలోపేతం కోసం ఇక్కడే బహిరంగ సభ ఏర్పాటు చేశారు.
కొన్నిరోజులుగా ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) బీఆర్ఎస్ పై వ్యతిరేకత చూపిస్తున్నారు. ఆయన బీజేపీలో వెళ్తున్నారని ప్రచారం జరిగింది. ఈ క్రమంలో ఆయన వర్గం అధికార పార్టీలోనే ఉంటారా లేక పొంగులేటితోనే వెళ్తారా అనే సస్పెన్స్ నెలకొంది. ఇక కేసీఆర్ బహిరంగ సభతో దీనిపై ఓ క్లారిటీ వచ్చినట్లు తెలుస్తుంది. పొంగులేటి (Ponguleti Srinivas Reddy) బీఆర్ఎస్ ను వీడనున్నట్లు స్పష్టంగా అర్ధమవుతున్నప్పటికీ ఏ పార్టీలో చేరుతారనే సందేహం ఉంది. అయితే పొంగులేటితోనే తమ పయనం అని ఆయన వర్గీయులు చెప్పకనే చెప్పినట్లు తెలుస్తుంది. దీనికి కారణం వారు బహిరంగ సభకు దూరంగా ఉండడం. వారికి ఆహ్వానం అందినా కూడా సభకు వెళ్లకపోవడంతో పొంగులేటితో పాటే వారు పార్టీ మారతారనే ప్రచారం జరుగుతుంది.
ఉమ్మడి ఖమ్మంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) బలమున్న నాయకుడు. కేవలం ఒక్క స్థానంలోనే కాదు. ఖమ్మంలోని నాలుగైదు స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టగలిగే సత్తా పొంగులేటి సొంతం. అందుకే తన అనుచరులు వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని పొంగులేటి ఇటీవల వ్యాఖ్యానించారు. అయితే అతను పార్టీ వీడితే అధికార పార్టీకి కొంతబలం తగ్గే అవకాశం ఉంది. మరి పొంగులేటి బీజేపీలో చేరితే ఆయన అనుచరులకు టికెట్ కావాలనే ప్రతిపాదనను హైకమాండ్ ముందు ఉంచే అవకాశం లేదు. ఈ పరిణామాలన్నింటితో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) వర్గం సభకు హాజరు కాకపోవడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అయింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CM KCR, Khammam, Ponguleti srinivas reddy, Telangana