(G.SrinivasReddy,News18,Khammam)
అక్కడ ఏం జరుగుతోంది..? పక్క రాష్ట్రానికి చెందిన పావురం( Pigeon) ఎందుకు వచ్చింది..? దానికి వేసిన ట్యాగ్ ఏంటీ..? రెక్కల ఈకలపై వేసిన ముద్రకు అర్ధం ఏమిటి..? ఇప్పుడు ఇదే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. పూర్వం రాయబారం పంపాలంటే పావురాలు, చిలుకలను ఉపయోగించే వాళ్లు. కాలం మారింది. టెక్నాలజీ పరుగులు పెడుతోంది. కాని ఈ ఫైజీ జనరేషన్(5G Generation)లో కూడా పక్క రాష్ట్రంలో ఉన్న పావురాలు ఎందుకు వచ్చిందనే చర్చ ఖమ్మం (Khammam)జిల్లాలో జోరుగా సాగుతోంది. అసలు ఈ పావురం ఏంటీ..దాని కథేంటి..?
పావురం ఏంటీ ..దానికి ట్యాంగ్ ఏంటీ..
ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం మామునూరులో ఓ పావురం వచ్చింది. గ్రామాల్లో పావురాలు కనిపించడం సహజం. కాని మామునూరలో కనిపించిన పావురం కాలికి ట్యాగ్ ఉండటంతో ఈవార్త స్థానికంగా కలకలం రేపుతోంది. అయితే పావురం రెక్కలపై ఉన్న ముద్ర చూస్తుంటే ఇది తమిళనాడుకు చెందినట్లుగా స్థానికులు భావించారు. దాని రెక్కలపై Delta1000KM అని ముద్ర వేసి ఉంది. పొరుగు రాష్ట్రం పావురాన్ని గుర్తించిన గ్రామస్తులు దానిని పంచాయతీ సెక్రెటరీ శ్రీనుకు అందజేశారు.
వైరల్ అవుతున్న ఫోటోలు..
ఎక్కడి నుంచో వచ్చిన పావురం వార్త ఇప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే కాదు సోషల్ మీడియా గ్రూప్‌లలో కూడా వైరల్‌గా మారింది. ఈ పావురం రెక్కలపై ఉన్న ముద్ర ప్రకారం తమిళనాడుకు చెందినదిగా భావిస్తున్నారు. కాని అందరికి మాత్రం ఏదో తెలియని ఆందోళన, ఆశ్చర్యం. ఎక్కడిది ఈ పావురం..! ఎందుకొచ్చింది..అనే ప్రశ్నలు వేస్తున్నారు. పంచాయతీ సెక్రట్రీకి అప్పగించినప్పటికి అనుమానం తీరకపోవడంతో విషయాన్ని పోలీసులకు చేరవేశారు గ్రామస్తులు. సోషల్ మీడియాలో పావురం ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తున్నారు.
ఆసక్తికరమైన చర్చ..
తమిళనాడు ట్యాగ్‌తో ఉన్న పావురం ఖమ్మం జిల్లాలోకి రావడంపై జనంలో మాత్రం ఏదో తెలియని ఆశ్చర్యం, ఆందోళన కనిపిస్తోంది. ఈ పరిణామం వల్ల ప్రమాదం పొంచి ఉందా లేక ..ఏదైనా అరిష్టం జరుగుతుందా లేక ఎవరైనా సీక్రెట్ ఆపరేషన్ చేస్తున్నారా అనే సందేహాలు వ్యక్తమవుతన్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Khammam, Telangana News