హోమ్ /వార్తలు /తెలంగాణ /

TSRTC: ఆదాయం లేదంటూ ఆర్టీసీ సర్వీసు బంద్.. ఇదెక్కడి న్యాయం అంటూ విద్యార్థుల ఆందోళన

TSRTC: ఆదాయం లేదంటూ ఆర్టీసీ సర్వీసు బంద్.. ఇదెక్కడి న్యాయం అంటూ విద్యార్థుల ఆందోళన

భద్రాద్రి

భద్రాద్రి కొత్తగూడెం

ఆదాయం లేదంటూ ఆర్టీసీ అధికారులు పాల్వంచ మండలంలోని పలు గిరిజన తండాలకు ఆర్టీసీ బస్సు సర్వీసులను నిలిపివేశారు. దీంతో ఆయా ప్రాంతాలకు చెందిన గిరిజన విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Khammam, India

  (Dasari Kranthi Kumar, News18, Bhadradri Kothagudem)

  అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని అన్న చందంగా మారింది భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా పాల్వంచ మండలంలోని పలు గిరిజన తండాల విద్యార్థుల పరిస్థితి. ఆదాయం లేదంటూ ఆర్టీసీ అధికారులు పాల్వంచ మండలంలోని పలు గిరిజన తండాలకు ఆర్టీసీ బస్సు (RTC Bus) సర్వీసులను నిలిపివేశారు. దీంతో ఆయా ప్రాంతాలకు చెందిన గిరిజన విద్యార్థులు (Tribal students) తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్సులు లేక నిత్యం ప్రైవేటు వాహనాల్లో పాఠశాలలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.

  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండల కేంద్రానికి 40 కిలోమీటర్ల వరకు గిరిజన గ్రామాలు ఉన్నాయి. మండలంలోని ఏజెన్సీ గ్రామాలైన (Agency Villages) చండ్రాలగూడెం, రేగులగూడెం, ఉలనూరు, నర్సింహాసాగర్, మల్లారం, సారెకల్లు, కారెగట్టు, రెడ్డిగూడెం, యానంబైల్, కిన్నెరసాని, పాండు రంగాపురం, సూరారం, సోములగూడెం, దంతల బోరు, తోగ్గూడెం, నాగారం వంటి మారుమూల గ్రామాలకు బస్సు సౌకర్యం లేదు. రూ.కోట్లు ఖర్చుపెట్టి ప్రభుత్వం రోడ్లను నిర్మించినా ఆయా గ్రామాలకు ఆర్టీసీ అధికారులు మాత్రం బస్సు సర్వీసులు తిప్పడంలేదు. దీంతో మండల కేంద్రానికి వచ్చే ఆయా గ్రామాల ప్రజలతో పాటు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సర్వీసులు లేకపోవడంతో విద్యార్థులు, ప్రయాణికులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ప్రైవేటు వాహనాల్లో ప్రయాణం పెను భారంగా మారుతుంది.

  ఉల్వనూరు నుంచి పాల్వంచకు ఆటో చార్జీ రూ. 50, దంతల బోరు నుంచి రూ. 40, ఎస్సీకాలనీ నుంచి రూ. 30, చొప్పున ఆటో చార్జీలు వసూలు చేస్తున్నారు. ఏజెన్సీ గ్రామాల నుంచి మండల కేంద్రమైన పాల్వంచకు రావాలంటే దూరాన్ని బట్టి రూ. 100 వరకు ప్రయాణికుల నుంచి వసూలు చేస్తున్నారు ఆటో డ్రైవర్లు. ఇదే బస్సు అయితే తక్కువ ధరకు ప్రయాణించే అవకాశం ఉందని స్థానికులు, ప్రయాణికులు వాపోతున్నారు. ఇక మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలకు వచ్చే పేద విద్యార్థులకు ఆటో చార్జీలు భారమై, చదువులకు దూరమవుతున్నారు.

  నిరుపేద విద్యార్థుల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు సౌకర్యం ఏమైందని పలువురు విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఏజెన్సీ గ్రామాల నుంచి ప్రయాణికులు తక్కువగా ఉండడంతో పాల్వంచ నుంచి ఆయా గ్రామాల పరిధిలో ఆర్టీసీ బస్సు సర్వీస్ నిలిపివేశారంటూ ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు స్పందించి మూడు పూటల బస్సు సర్వీస్ ఉండేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Bhadradri kothagudem, Khammam, Local News, RTC buses, Tsrtc

  ఉత్తమ కథలు