‘పాసుబుక్కులివ్వడం లేదు.. నేను చస్తా’

పురుగుల మందుతో తహసీల్దార్ కార్యాలయం ఎదుట వృద్ధురాలు

చనిపోతానంటూ వృద్ధురాలు పురుగుల మందు డబ్బా తీసుకొచ్చినా.. కనీసం ఒక్క ఉద్యోగి కూడా ఆమెను వారించలేదు.

 • Share this:
  (జి.శ్రీనివాసరెడ్డి, ఖమ్మం కరస్పాండెంట్, న్యూస్‌18)

  రెవెన్యూ లీలలు అన్నీ ఇన్నీ కావు. వారికి పేద.. ధనిక, వయసు.. ముసలి అని తేడాలే లేవు. ఎవరికైనా ఒకటే ట్రీట్‌మెంట్‌. పైసలు పడందే అసలు పనులు కావు. ఎంతటి వారి పట్లయినా వారి తాలూకూ నిర్లక్ష్యమే ఎక్కడ చూసినా.. బహుశా అందుకేనేమో సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ సైతం తనకు ఓ వీఆర్వో నుంచి ఎదురైన అనుభవాన్ని అసెంబ్లీలో బాహాటంగానే చెప్పారు. దీనికోసమే రెవెన్యూ వ్యవస్థలో సమూల మార్పులు చేస్తానంటూ ఆయన ప్రతిన బూనారు. తమ శాఖ మనుగడకు ముప్పు వాటిల్లుతున్నా.. కనీసం ఆ శాఖాధికారుల్లో కనీస చలనం లేదు. ఇసుమంతైనా మానవత్వం చూపరన్న సత్యం ఈ ఘటనతో మరోసారి స్పష్టమవుతోంది. ఈ తాజా ఉదాహరణలోకి వెళ్తే.. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం రామచంద్రరావు బంజర గ్రామానికి చెందిన దూదిపాళ్ల కనకమ్మ తనకున్న కొద్దిపాటి భూమిని రక్త సంబంధీకులు ఆక్రమించుకుని తనపై దౌర్జన్యం చేస్తున్నారంటూ అనేకసార్లు రెవిన్యూ అధికారులకు ఫిర్యాదు చేసింది. అయినా వారు పట్టించుకోలేదు. 30 ఏళ్లకు పైగా సాగు చేసుకుంటున్న తన భూమికి వేరొకరికి పాసు పుస్తకాలు చేశారంటూ ఆమె ఫిర్యాదు చేస్తోంది. తన భూమిని వేరొకరికి పుస్తకాలు ఎక్కించి అదేమంటే కోర్టుకెళ్లమంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇలా ఎన్నిసార్లు కాళ్లరిగేలా తిరిగినా తనను పట్టించుకోవడం లేదన్న బాధతో.. పాపం ఆ వృద్ధురాలు చివరకు శుక్రవారం మధ్యాహ్నం పురుగుమందు తీసుకునిపెనుబల్లి తహశీల్దారు కార్యాలయం మెట్ల పైన కూర్చొంది.

  రోదిస్తూ తన బాధను వెళ్లబోసుకుంటూ తనకు న్యాయం చేయాలంటూ ఏడుస్తున్నా.. కనీసం ఆ ఆఫీసులోని ఒక్కరంటే ఒక్కరు కూడా బయటికొచ్చి ఓదార్చడం మాట దేవుడెరుగు.. పురుగుమందు తాగొద్దని వారించిన దాఖలా లేదు. ఎవరేమైతేనేం.. తమకు కావాల్సింది ఇస్తేనే పనిచేస్తామన్నది వారివైఖరిగా మారిందని ఆ వృద్ధురాలు వాపోతోంది. ఎట్టకేలకు అక్కడికొచ్చిన ఇతర సందర్శకులు వారించి ఆమెను ఓదార్చడంతో కథ విషాదాంతం కాకుండా ఉంది.
  Published by:Ashok Kumar Bonepalli
  First published: