Telangana: బల్దియా పీఠంపై ఆంధ్రా మహిళలు.. సెటిలర్లకు పెద్దపీట వేసిన ప్రజలు..

ఖమ్మం మేయర్, డిప్యూటీ మేయర్

Telangana: తెలంగాణ ఉద్యమానికి ఊపిరులూదిన గడ్డ ఖమ్మంలో ఇప్పుడు ఇద్దరు మహిళలు కీలక స్థానాలను దక్కించుకున్నారు. వీరిలో ఖమ్మం మేయర్‌గా ఎన్నికైన పునుకొల్లు నీరజ కాగా.. మరొకరు డిఫ్యూటీ మేయర్‌ షేక్‌ ఫాతిమా జోహ్రా. నీరజ స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా ఆగిరిపల్లి గ్రామం కాగా.. షేక్‌ ఫాతిమా జోహ్రా స్వస్థలం గుంటూరు.

 • Share this:
  (జి.శ్రీనివాసరెడ్డి, ఖమ్మం జిల్లా, న్యూస్‌18 తెలుగు)

  నీరజ వివాహం చేసుకుంది పెదపారుపూడికి చెందిన పునుకొల్లు రామబ్రహ్మం.. ఈ కుటుంబం 1988లో ఖమ్మం వచ్చి వ్యాపార రంగంలో సెటిల్‌ అయ్యారు. 1967 జనవరి 24న జన్మించిన నీరజ బీఏ పూర్తిచేయకుండానే చదువును ఆపేశారు. 2005లో తెదేపా తరపున 23వ డివిజన్‌ నుంచి తొలిసారిగా కౌన్సెలర్‌గా పోటీచేసి గెలుపొందారు. ఆనక 2016లో 17వ డివిజన్‌ కార్పోరేటర్‌గా గెలిచారు. అనంతరం తాజాగా జరిగిన ఎన్నికల్లో 26వ డివిజన్‌లో గెలిచి మేయర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆమె భర్త రామబ్రహ్మం అటు వ్యాపార రంగంలోనూ.. ఇటు రాజకీయరంగంలోనూ చురుగ్గా వ్యవహరిస్తుంటారు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు నమ్మకస్తునిగా.. ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావుకు సన్నిహితునిగా.. ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణకు.. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు సన్నిహితునిగా పేరుంది. రామబ్రహ్మం గత మూడు దఫాలుగా డీసీసీబీ డైరెక్టర్‌గా ఎన్నికవుతూ వస్తున్నారు. ఇలా మొదటి నుంచి తెదేపాను బలంగా అంటిపెట్టుకుని ఉన్న రాజకీయ కుటుంబం కావడం.. గత ఎన్నికల సమయంలో అప్పటి మంత్రి తుమ్మల పిలుపుతో పార్టీ మారి తెరాసలోకి రావడం.. ప్రస్తుత మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌తోనూ సాన్నిహిత్యం కుదరడం.. ఇలా ఆయన సైతం తన సామాజిక వర్గంలో చురుగ్గా ఉండే నీరజనే ఎంచుకున్నట్టు తెలుస్తోంది. ఆయన సూచన మేరకే సీఎం కేసీఆర్‌ మేయర్‌గా నీరజ అభ్యర్థిత్వంపై నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. మంత్రి అజయ్‌కుమార్‌ నిర్ణయాన్ని, ఇతర అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు సైతం బలపర్చడంతో ఆమె ఎన్నిక సునాయాసంగా ముగిసింది. ఇక డిప్యూటీ మేయర్‌గా ఎన్నికైన షేక్‌ ఫాతిమా జోహ్రా స్వస్థలం గుంటూరు. 1984 మే 10న జన్మించిన ఆమె పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ చేశారు. ఆమె భర్త ముక్తార్‌ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌కు నమ్మిన బంటుగా పేరుంది. దీంతోనే గతంలోనే ముక్తార్‌కు సుడా డైరెక్టర్‌గా అవకాశం ఇచ్చారు.. గతంలోనే మాటిచ్చిన విధంగానే మైనారిటీ కోటాలో ముక్తార్‌ భార్యకు డిప్యూటీ మేయర్‌ పదవిని కట్టబెట్టారు. దీంతో ప్రధాన సామాజిక వర్గాలైన కమ్మ, ముస్లిం మైనారిటీలకు దగ్గర కావాలన్న వ్యూహం తెరాస పెద్దల్లో కనిపిస్తోంది.

  నెలరోజుల ఉత్కంఠకు తెరదించుతూ.. ఖమ్మం మేయర్‌.. డిప్యూటీ మేయర్‌ అభ్యర్థులు ఎవరన్నది తేలిపోయింది. మేయర్‌ పీఠం దాదాపు అందరూ అంచనా వేసినట్టుగా పునుకొల్లు నీరజనే వరించింది. ఈ విషయమై 'న్యూస్‌18 తెలుగు' పబ్లిష్‌ చేసిన మేయర్‌ ఎవరు..? ఎలాంటి అంశాలను ప్రాతిపదికగా తీసుకుంటారు.. పోలిటికల్‌ ఈక్వేషన్లు తదితర అంశాలపై 'న్యూస్‌18తెలుగు' ప్రచురించిన కథనం నిజమైంది. ఇక డిప్యూటీ మేయర్‌ విషయంలో మైనారిటీకు దక్కుతుందన్న విషయంలోనూ అంతే అయింది. 60 డివిజన్లు ఉన్న ఖమ్మం మున్సిపల్‌ కార్పోరేషన్‌ ఎన్నికల్లో 43 డివిజన్లను సొంతంగా గెలిచిన తెరాసకు మేయర్‌, డిఫ్యూటీ మేయర్‌ పదవులు, అధికారం సులువుగా దక్కింది. అభివృద్ధి మంత్రం బాగా పనిచేయడంతో అనుకున్న స్థాయిలో డివిజన్లను గెలుచుకోగలిగిన సంతృప్తి అధికార పార్టీ నేతల్లో కనిపిస్తోంది. ఇంకా కొన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే మరో పది దాకా గెలిచేవారమన్న వాదనా లేకపోలేదు.

  సెటిలర్లను మచ్చిక చేసుకోడానికేనా..?
  ఖమ్మం. సెటిలర్ల గుమ్మం. పేరుకు తెలంగాణలో ఉన్నా.. ఇక్కడి భాష, ఆహారపు అలవాట్లు.. పండుగలు.. సంస్కృతి దాదాపు ఆంధ్ర వాతావరణం కనిపిస్తుంటుంది. దీనికి కారణం.. ఆంధ్ర ప్రాంతంతో సుదీర్ఘ సరిహద్దులు ఉండడం.. విస్త్రుతమైన బంధుత్వాలు నెరపడం.. నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, ప్రకాశం, కృష్ణ, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లాల నుంచి దశాబ్దాలుగా ఇక్కడికి వచ్చి రకరకాల వ్యాపారాలు, వృత్తులు, వ్యాపకాలలో సెటిల్‌ అయిన వేలాది కుటుంబాల నేపథ్యం కూడా కారణం. ఇలా సెటిలర్లుగా వచ్చి స్థిరపడిన వారిలో సింహ భాగం కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారే కావడంతో.. ఇక్కడ రాజకీయ, వ్యాపార, వృత్తి నిపుణులైన డాక్లర్లు సైతం ఆ వర్గానికి చెందిన వారే అధిక సంఖ్యలో ఉన్నారు. దీంతో దాదాపు అన్ని పార్టీలలోనూ కమ్మ సామాజిక వర్గ ప్రాబల్యం కనిపిస్తూనే ఉంటుంది. ఇక్కడ వైద్యరంగం, గ్రానైటు, సింగరేణి ఉద్యోగాలు.. కేటీపీఎస్‌ తదితర రంగాలలో ఆంధ్ర నుంచి వచ్చి సెటిల్‌ అయిన వారి సంఖ్య చెప్పుకోదగినదే. ఈ క్రమంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన పలు ఉద్యమాల్లోనూ ఆంధ్ర సెటిలర్లు మేము సైతం అంటూ పాల్గొన్నారు. ఉద్యమంలో తమ పాత్రను చురుగ్గా పోషించారు. సుదీర్ఘకాలంగా ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలు నెరవేరాలన్న లక్ష్యం కోసం ఆంధ్ర సెటిలర్లు సైతం ఉద్యమించారు.

  దీంతోనే ప్రత్యేక తెలంగాణ సాకారం అయిన అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్‌ సెటిలర్లను కడుపులో పెట్టుకుని చూసుకుంటామని పలుమార్లు ప్రత్యేకంగా పేర్కొన్న విషయం తెలిసిందే. గణనీయంగా ఉన్న సెటిలర్ల ఓటు బ్యాంకును అనుకూలంగా మలచుకున్న తెరాస.. ఇంకా అక్కడక్కడా తెలుగుదేశం పార్టీతో ఎమోషనల్‌ బాండింగ్‌ ఉన్న సామాజికవర్గాలను సైతం లక్ష్యంగా పదవులు పంచుతూ వస్తోంది. ఇప్పటిదాకా జరిగిన ఎన్నికల్లో ఏభై శాతం దాకా సెటిలర్లు తెరాసకు మద్దతు తెలుపుతున్నట్టు సర్వేలు చెబుతుండగా.. ఇక భవిష్యత్తులో సెటిలర్ల ఓటు బ్యాంకును గుండుగుత్తగా కొల్లగొట్టే లక్ష్యంతోనే తాజా ఎంపికలకు తెర తీసినట్టు విశ్లేషకుల అంచనా. వాస్తవానికి వీరికంటే ప్రాబల్యం కలిగిన, విశ్వసనీయత కలిగిన వ్యక్తులు కార్పొరేటర్‌గా గెలిచినప్పటికీ.. భవిష్యత్‌ లక్ష్యాల సాధనకు ఈ రెండు పదవుల ఎంపికను అనువుగా మార్చుకున్నట్టు భావిస్తున్నారు.
  Published by:Veera Babu
  First published: