అమెరికాలో తెలంగాణ యువకుడు మృతి చెందాడు. ఖమ్మంకు చెందిన మహాంకాళి అఖిల్ సాయి సోమవారం రాత్రి బుల్లెట్ తగిలి ప్రాణాలు విడిచాడు. కొడుకు మరణ వార్త విని అతని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. చేతిలో గన్ మిస్ ఫైర్ అయిందని మొదట చాలా మంది భావించారు. కానీ తమ కొడుకు మృతికి అతని స్నేహితుల ప్రమేయం ఉందని అనుమానం మొదలైంది. ఈ విషయం తెలుసుకున్న అఖిల్ సాయి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. అమెరికాలోని అలబామా రాష్ట్రం ఆబర్న్ సిటీలో ఉంటున్న 25 ఏళ్ల మహాంకాళి అఖిల్ సాయి అనే యువకుడు బుల్లెట్ తగిలి ప్రాణాలు కోల్పోయాడు. అఖిల్ సాయి తెలంగాణలోని ఖమ్మం జిల్లా మధిర పట్టణానికి చెందిన వాడు.ఏడాది క్రితమే అతడు ఎంఎస్ చేసేందుకు యూఎస్ వెళ్లాడు. అబర్న్ యూనివర్సిటీలో ఎంఎస్ చేస్తున్నాడు. అక్కడే చదువుకుంటూ... అలబామాలోని మోంట్ గోమెరీలో గ్యాస్ స్టేషన్ లో పార్ట్ టైమ్ జాబ్ కూడా చేస్తున్నాడు.
ఈ క్రమంలోనే సోమవారం రాత్రి డ్యూటీ చేస్తున్న టైంలో ఈ దుర్ఘటన జరిగింది. సెక్యూరిటీ గార్డు చేతిలో ఉన్న తుపాకీ తీసుకొని పరిశీలించబోయాడని... ఆ గన్ మిస్ ఫైర్ అయిందని ప్రచారం జరిగింది. అయితే అఖిల్‌సాయి స్నేహితుడిని ఒకరిని అరెస్టు చేశారని ప్రచారం జరుగుతోంది. అఖిల్ స్నేహితుడు రవితేజ అనే వ్యక్తి కాల్పులు జరిపాడని ప్రచారం నడుస్తోంది. అందుకే పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారని సమాచారం.
కాల్పుల్లో బుల్లెట్ అఖిల్ సాయి శరీరంలోకి దూసుకెళ్లింది. వెంటనే గ్యాస్ స్టేషన్ సిబ్బంది అతన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అఖిల్ సాయి చనిపోయాడని తెలుస్తోంది. మరోవైపు అమెరికాలో ప్రాణాలు విడిచిన అఖిల్ సాయిపై తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఆయన తల్లిదండ్రులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. అఖిల్ సాయి మృతదేహాన్ని తెలంగాణకు తెప్పించేందుకు ప్రభుత్వం తనవంతు సాయం చేస్తుందని కేటీఆర్ తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Khammam, Local News, Telangana