Srinivas Reddy, Khammam, News18
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ఇటీవల (జనవరి 11) రాత్రి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావు నివాసానికి చేరుకున్నారు. అప్పటికే అక్కడ రోడ్డుపైన ఎదురుచూస్తున్న సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యను తన కారులో ఎక్కించుకొని తుమ్మల నివాసానికి చేరుకున్నారు. హరీష్ వెంట మంత్రి అజయ్ కుమార్ సహా ఇంకా ఇతర నేతలు ఉన్నారు. తన నియోజకవర్గం లోని గండుగులపల్లి వచ్చిన మంత్రి హరీష్ రావును అశ్వరావుపేట ఎమ్మెల్యే వెంకటేశ్వర్లు మర్యాదపూర్వకంగా కలుసుకొని శాలువా కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా హరీష్ రావు వేసిన జోకుతో అక్కడ ఉన్న నేతలంతా పగలబడి నవ్వారు.
"డొంక రోడ్డు కావాలని సీఎం గారికి దరఖాస్తు ఇచ్చింది మీరేనా.." అంటూ హరీష్ రావు ఎమ్మెల్యే నాగేశ్వరరావును ప్రశ్నించారు. దీంతో అది అడిగింది ఆయన కాదు వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ అంటూ సండ్ర బదులిచ్చారు. దీంతో అక్కడ ఉన్న వాళ్లంతా ఒక్కసారి గొల్లున నవ్వి..ఒకరిపై ఒకరు సరదాగా జోకులు వేసుకున్నారు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కల్పించుకొని..మెయిన్ రోడ్లన్నీ అయిపోయాయిగా అందుకని డొంక రోడ్డు అడిగి ఉంటాడని అన్నారు. మంత్రి అజయ్ స్పందిస్తూ ఈనన్ని సెంట్రల్ లైటింగ్ రోడ్లు వెడల్పు ఇవి అడుగుతుంటారని చెప్పారు. ఇలా తుమ్మల ఇంట కాసేపు బీఆర్ఎస్ నేతలు అంతా సరదాగా గడిపారు.
ఈనెల 18న ఖమ్మం కలెక్టరేట్ సహా జిల్లా కార్యాలయాల నీటిని ప్రారంభించడానికి రానున్న సీఎం కేసీఆర్ పర్యటనను విజయవంతం చేయడానికి..అలాగే ఖమ్మంలో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన బహిరంగ సభను విజయవంతం చేయడానికి అవసరమైన వ్యూహ ప్రతి వ్యూహాలను రచించడానికి మంత్రి హరీష్ ను కేసీఆర్ పంపారు. ఇప్పటికే మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పార్టీ వీడనున్నారన్న వార్తల నేపథ్యంలో..గత కొంతకాలంగా దూరం దూరంగా ఉంటూ వస్తున్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంత్రి హరీష్ రావు కలుసుకోవడం ఆసక్తిగా మారింది.
ఈనెల 18న ఖమ్మంలో జరుపతలపెట్టిన బీఆర్ఎస్ జాతీయసభకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక్కడ జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించేందుకు ఖమ్మం వచ్చిన రాష్ట్ర మంత్రి హరీష్ రావు సభాస్థలి పరిశీలన అనంతరం మధిరకు వెళ్లారు. అక్కడ జనసమీకరణ కోసం సన్నాహక సమావేశం నిర్వహించారు . మంత్రి వెంట జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ , ఎంపీలు నామా, వద్దిరాజు ,జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్ లు ఉన్నారు.
తర్వాత అక్కడ నుంచి నేరుగా గండుగుల పల్లిలోని తుమ్మల నివాసానికి వెళ్లారు. మంత్రులు వెంట ఎంపీ నామ నాగేశ్వరరావు , వద్దిరాజు రవిచంద్ర ,ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య , మెచ్చా నాగేశ్వరావు , ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వరరెడ్డి , తాతా మధు లు ఉన్నారు. అందరు కలవడం సరదా కబుర్లతో వారి భేటీ నవ్వులు కురిపించింది. అక్కడకు వెళ్లిన వారిలో కొందరు అయిష్టంగానే వెళ్లినట్లు తెలుస్తోంది. తన ఇంటికి వచ్చిన అతిధులకు మర్యాద చేయడంలో ముందు ఉండే తుమ్మల వారికి డిన్నర్ ఏర్పాటు చేశారు.
18న ఖమ్మంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగనున్న బీఆర్.యస్ సభ జయప్రదంలో కీలకంగా వ్యవహరించాలని తుమ్మలను హరీష్ రావు కోరారు. దీంతో తుమ్మల ప్రాధాన్యత మరోసారి పార్టీలో పెరిగింది. కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న తుమ్మల ఇటీవల పార్టీకి దగ్గరైయ్యే ప్రయత్నం చేస్తున్నారు. రెండు రోజుల క్రితం హైద్రాబాద్ లో జరిగిన కేటీఆర్ మామ హరినాథ్ రావు కర్మ కార్యక్రమంలో సీఎం తో కలిసి పాల్గొన్నారు. తిరిగి మంత్రులు ఇప్పటివరకు తనంటే గిట్టని నేతలు ఇంటికి రావడం తుమ్మల చాణిక్యానికి నిదర్శనంగా రాజకీయ పరిశీలకులు చెప్పుకుంటున్నారు.
జిల్లాలో ప్రజల్లో పట్టున్న నేతగా ఉన్న మాజీఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తిరుగుబాటు బావుటా వేగరవేయడంతో తుమ్మల వచ్చిన అవకాశాన్ని తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటివరకు కారాలు మిరియాలు నూరిన నేతలు తుమ్మల నివాసానికి వెళ్లడం జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామంగా చెప్పుకుంటున్నారు. రాజకీయాలు అంటే ఇంతే ఉంటాయని ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియడం లేదని క్యాడర్ కూడా చెవులు కోరుకుంటున్నారు. కొందరు అవాక్కవుతున్నారు. మరికొందరు బిత్తర పోతున్నారు. మరికొందరు దటీస్ కేసీఆర్ రాజకీయం అంటున్నారు. ముందు ముందు రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి మరి. టిఆర్ఎస్ పార్టీలో మొదటి నుంచి ట్రబుల్ షూటర్ గా పేరు ఉన్న మంత్రి హరీష్ రావు ఖమ్మం ఉమ్మడి జిల్లాలో పార్టీ పరిస్థితిని మెరుగుపరచడానికి నేతల మధ్య సమన్వయం కుదర్చటం కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రయత్నంలో ఆయన ఎంత వరకు సఫలీకృతం అవుతారో చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Harish Rao, Khammam, Local News, Telangana