(G. Srinivas Reddy, News18, Khammam)
దాదాపు కొన్ని నెలల పాటు కొనసాగిన సైలెన్స్‌ను బ్రేక్ చేయడం.. ఏదో ఒక పెద్ద స్థాయి ఘటనకు పాల్పడి తమ ఉనికిని బలంగా చాటుకోవడం.. తద్వారా భయోత్పాతాన్ని సృష్టించడం.. నిధులు రాబట్టడం.. కొత్త తరంతో రిక్రూట్‌మెంట్ వేగిరం చేయడం లక్ష్యంగా మావోయిస్టులు (Maoists) వ్యూహం సిద్ధం చేసుకున్నట్టు నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీన్లో భాగంగానే చత్తీస్‌ఘడ్- తెలంగాణ (Chhattisgarh Telangana), ఆంధ్రా- ఒడిషా, మహారాష్ట్ర- తెలంగాణ సరిహద్దుల్లో ఉద్రిక్తత పరిస్థితికి తెరతీశారు. ఇన్‌ఫార్మర్‌గా పనిచేస్తూ పోలీసులకు తమ ఉనికిని చేరవేస్తున్నాడన్న నెపంతో భద్రాద్రి (Bhadradari Kothagudem) జిల్లాలో కొద్ది రోజుల క్రితం ఒక మాజీ సర్పంచిని నరికి చంపారు. వర్షాలు తగ్గడంతో మూవ్‌మెంట్‌కు సానుకూలత ఏర్పడింది. దీనికితోడు వరుస వర్షాలకు పొంగిన వాగులు వంకలతో దాదాపు రెండు నెలల పాటు ఎలాంటి యాక్టివిటీకి అవకాశం కుదరని పరిస్థితి. కాస్త కుదుటపడగానే మళ్లీ మావోలు ఊపందుకున్నట్టు తెలుస్తోంది.
తెలంగాణ (Telangana) రాష్ట్రంలో మావోయిస్టుల అలజడి మళ్లీ మొదలైంది. పోలీసుల ఎన్‌కౌంటర్లలో అనేక సార్లు తప్పించుకున్న అడెల్లు దళం రాష్ట్రంలోకి ప్రవేశించినట్లు నిఘా వర్గాలు పేర్కొన్నాయి. గత వారం రోజులుగా చత్తీస్‌ఘడ్ సరిహద్దు ప్రాంతాలతో పాటు, ఉమ్మడి ఖమ్మం (Khammam)జిల్లా, ఆసిఫాబాద్, మంచిర్యాల , మంథని, జయశంకర్ భూపాలపల్లి, గోదావరి పరివాహక ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో రెండ్రోజుల కిందట పెద్దపల్లి జిల్లాలో జరిగిన కార్యక్రమానికి రోడ్డు మార్గాన వెళ్లాల్సిన సీఎం కేసీఆర్.. అనూహ్యంగా హెలికాప్టర్‌లో వెళ్లడానికి కారణం కూడా ఇదేనని తెలుస్తోంది.
పోలీసు ఇన్ఫార్మర్ అన్న నెపంతో కొద్దిరోజుల క్రితం భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లాలో ఉపసర్పంచ్‌ని మావోలు నరికి హతమార్చారు. మావోయిస్టు పార్టీ సారథి, కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు ఆదేశాల మేరకు మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్, పాండు అలియాస్ మంగులు ఇంకొన్ని దళాలు మహారాష్ట్ర, దక్షిణ ఛత్తీస్‌గఢ్ మీదుగా తెలంగాణలోకి ప్రవేశించినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. పెద్దపల్లి జిల్లాలో సీఎం సభే టార్గెట్‌గా మావోయిస్టులు ప్లాన్ వేసినట్లు సమాచారం. అయితే, ఆఖరి నిమిషంలో కేసీఆర్ రోడ్డు మార్గాన కాకుండా, హెలికాప్టర్‌లో పెద్దపల్లికి చేరుకున్నారు.
ఉమ్మడి కరీంనగర్ (Karimnagar) జిల్లాలోని అధికార టీఆర్ఎస్ (TRS), బీజేపీ నేతలను మావోయిస్టులు లక్ష్యంగా చేసుకున్నారని నిఘా వర్గాలు గుర్తించాయి. ఇప్పటికే వారందరిని పోలీసులు అప్రమత్తం కూడా చేశారు. 2020 జూలైలో ఆదిలాబాద్ అడవుల నుంచి ఛత్తీస్‌గఢ్ వెళ్లిన అడెల్లు దళం మళ్లీ తిరిగి రావడంతో అందరిలో టెన్షన్ మొదలైంది. రాజకీయ నేతలను హతమార్చి నిధులు, ఉనికి చాటుకునేందుకు తెలంగాణలో మావోలు కదలకలు జరుగుతున్నట్ల పోలీసులు భావిస్తున్నారు.
మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్ (Adilabad) జిల్లాలో అడెల్లు భాస్కర్ దళం అడవుల్లోకి ప్రవేశించినట్లు పోలీసులు నిర్థారించారు. ఈ క్రమంలో పది మంది మోస్ట్ వాంటెడ్ మావోల పోస్టర్లను కొమురం భీం జిల్లా ఎస్పీ విడుదల చేశారు. మావోయిస్టులపై రూ.95 లక్షల రివార్డు ప్రకటించారు. వీరిలో మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్‌పై రూ.20 లక్షలు, బండి ప్రకాశ్ అలియాస్ ప్రభాత్‌పై రూ.20 లక్షలు, వర్గీస్‌మడేపై రూ.20 లక్షలు, కుంజం మనీష్‌పై రూ.5 లక్షలు, చెన్నూరి శ్రీను అలియాస్ హరీష్‌పై రూ.5 లక్షలు, రోషన్‌పై రూ.5 లక్షలు నందు అలియాస్ వికాస్‌పై రూ.5 లక్షలు, కంతి లింగవ్వ అలియాస్ అనితపై రూ.5 లక్షలు, మాడావి మీనాపై రూ.5 లక్షలు, సంగీతపై రూ.5 లక్షల రివార్డు ప్రకటించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.