జి. శ్రీనివాసరెడ్డి, న్యూస్ 18 తెలుగు, ఖమ్మం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఓ యువకుడికి అమెరికాలో అరుదైన గౌరవం అవకాశం లభించింది. సిఎస్ఐఆర్ - ఐఐసిటి హైదరాబాద్ లో డాక్టర్ జీవీఎం శర్మ అనే ప్రముఖ శాస్త్రవేత్త పర్యవేక్షణలో పిహెచ్.డి పూర్తి చేసిన ఇల్లెందు మండలం చల్లసముద్రం గ్రామ పంచాయతీ రేపల్లెవాడ గ్రామానికి చెందిన వాంకుడోత్ జయరాం అనే యువకుడికి అమెరికాలోని ఆల్బర్ట్ ఐన్ స్టీన్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ లో అసోసియేట్ ప్రొఫెసర్ హోదా లభించింది. న్యూయార్క్ లోని మాంటేఫైరే హాస్పిటల్ లో జయరాం తన పరిశోధనా సహాకారాలను అందించనున్నాడు. జయరాం ఇక్కడ కీలకమైన క్యాన్సర్ పరిశోధనలో చేయనున్నారు.
అంతే కాకుండా కమ్యూనికేబుల్ డిసీజ్ పరిశోధన, బయోమెడికిల్ అభివృద్ధి ఉండనున్నాయి. జయరాం చేసే పరిశోధనలకు ప్రారంభ వార్షిక వేతనంగా 60 లక్షలు ఇవ్వనున్నారు. ఇల్లెందు మండలం రేపల్లెవాడ గ్రామానికి చెందిన వాంకుడోత్ జామ్లా - జాంకీ దంపతుల కుమారుడు జయరాంను తమ గ్రామానికి సమీపంలో ఉన్న ముకుందాపురం విశ్వశాంతి విద్యాలయంలో 10వ తరగతి వరకు చదువుకున్నాడు. అనంతరం ఇల్లెందులో ఇంటర్, ఖమ్మంలో డిగ్రీ, వరంగల్ లో ఎంఎస్సీ చేశాడు. ఆ తర్వాత సిఎస్ఐఆర్ ద్వారా హైదరాబాద్ ఐఐసిటి లో పిహెచ్ డి పూర్తి చేశాడు. జయరాం తన పిహెచ్.డిలో తన థీసిస్ సమర్పించిన తర్వాత హైదరాబాద్ లోని లక్షాయ్ లైఫ్ సైన్సెస్ లోనూ, అరజెన్ లైఫ్ సైన్సెస్ లోనూ రీసెర్చ్ సైంటిస్ట్ గా పని చేశాడు. ఇప్పుడు తన మేథా శక్తితో అమెరికాలో కొత్త అణువుల సంశ్లేషణ, డ్రగ్ డిస్కవరీ ప్రొగ్రాం, యువ సహచరులకు శిక్షణ ఇవ్వడంతో పాటు ఆల్బర్ట్ ఐన్ స్టీన్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ లో అసోసియేట్ ప్రొఫెసర్ గా పని చేయనున్నారు.
ఒక మారు మూల గ్రామానికి చెందిన జయరాం తన గ్రామంలోనే 10వ తరగతి వరకు చదువుకుని నేడు ఉన్నత స్థాయికి ఎదిగినందుకు పాఠశాల యాజమాన్యం ఎంతో గర్వ పడుతున్నారు. ఆదివారం పాఠశాల ఆవరణలో విద్యార్థుల సమక్షంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జయరాం, ముకుందాపురం విశ్వశాంతి విద్యాలయం విద్యార్థులకు చక్కని సందేశం ఇచ్చారు. తాను ఏ స్థాయిలో ఉన్నా తనను తీర్చి దిద్దిన పాఠశాల ను మర్చిపోనని, మీరంతా మంచిగా చదువుకుంటే తన సహాయ సహకారాలు అందిస్తానని విద్యార్థుల కరతాళ ధ్వనుల మధ్య చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.