Home /News /telangana /

KHAMMAM FEW FAMILIES ARE CHANGING WEDDING DATES FOR CELEBRITY COOK YADAMMA DISHES KMM PRV

Cook yadamma: సెలబ్రెటీ కుక్​ యాదమ్మ.. ఆమె వంటల కోసం పెళ్లి ముహూర్తాలూ మార్చుతున్నారట..

యాదమ్మ

యాదమ్మ

2023 జనవరి దాకా డేట్స్‌ ఖాళీలు లేవు. ఒక్కరోజంటే ఒక్క రోజు కూడా ఎవరికీ డేట్స్‌ ఇవ్వలేనంత బిజీ. ఇది ఎవరో ఓ సినిమా హీరో.. హీరోయిన్‌.. లేదా ఇంకెవరైనా స్టార్‌ కమెడియన్ డేట్స్‌ గురించిన ముచ్చట కానే కాదు.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India
  (G. Srinivas Reddy, News18, Khammam)

  ఇప్పటి నుంచి అంటే ఈ రోజును నుంచి.. 2023 జనవరి దాకా డేట్స్‌ ఖాళీలు లేవు. ఒక్కరోజంటే ఒక్క రోజు కూడా ఎవరికీ డేట్స్‌ ఇవ్వలేనంత బిజీ. ఇది ఎవరో ఓ సినిమా హీరో.. హీరోయిన్‌.. లేదా ఇంకెవరైనా స్టార్‌ కమెడియన్ డేట్స్‌ గురించిన ముచ్చట కానే కాదు. సెలబ్రిటీ కుక్‌గా మారిన యాదమ్మ (Cook Yadamma) సంగతి. అవును మరి యాదమ్మ వంట వండిందంటే ఇక అంతే. ఏకంగా దేశ ప్రధాని మోదీ (Pm Narendra modi) మొదలు.. సీఎం కేసీఆర్‌ (CM KCR) సహా ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. నలభీమ పాకాలను గుర్తుకు తెచ్చే యాదమ్మ వంట తమ ఇంట చేయాలి అని చాలామంది సెలబ్రిటీలు.. ముందుగా ఆమె డేట్స్‌ అడ్జస్ట్‌ చేసుకుని మరీ ముహూర్తాలు ఫిక్స్ చేసుకుంటారన్నది అతిశయోక్తి ఎంత మాత్రం కాదు. అదీ ఈ చేయితిరిగిన యాదమ్మ అంటే. ఈ మధ్యకాలంలో హైదరాబాద్‌ (Hyderabad) వేదికగా జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లోనూ యాదమ్మే వంట చేసింది. ఆమె చేసిన వంటను రుచి చూసిన ప్రధాని నరేంద్రమోడీ సైతం ఆమెను పిలిపించుకుని మరీ మెచ్చుకున్నారు.

  ఇక నాన్‌వెజ్‌ అంటే చెవికోసుకునే సీఎం కేసీఆర్‌ సైతం ఎన్నడైనా వరంగల్‌కో.. కరీంనగర్‌కో ఏ పని మీదైనా వస్తే.. అది మీటింగ్‌ అయినా.. ఇంకేదైనా యాదమ్మ వంట రుచి చూడాల్సిందే. అదీ యాదమ్మ అంటే మరి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అయితే యాదమ్మ వండే గనోస్‌ ఫ్రై, మటన్‌ బోటి, నాటుకోడి పులుసు, జెల్లిచేప పులుసును ఇష్టంగా తింటారని చెబుతారు. అదీ ఇదని కాదు. యాదమ్మ చేత్తో ఏది చేసినా ఇక అంతే లొట్టలేసుకుంటూ తినాల్సిందే ఎవరైనా..  ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన కుమార్తె వివాహం సందర్భంగా ఎంగేజ్‌మెంట్‌ మొదలు.. రిసెప్షన్‌ దాకా అన్ని వంటకాలను యాదమ్మతోనే చేయిస్తున్నారు. ఖమ్మంలో జరిగే రిసెప్షన్‌కు అయితే ఏకంగా ఐదు లక్షల మందికి షడ్రుచులతో భోజనం సిద్ధం చేస్తున్నారు. ఇలా ఆమె వచ్చే ఏడాది జనవరి దాకా ప్రతి రోజు ఎక్కడో ఒకచోట తన చేతి రుచులను చూపుతునే ఉంటారు.  మరి ఇంతటి ప్రాచుర్యం ఈమెకు ఎలా వచ్చింది.. ఈ డౌటు అందరికీ వచ్చేదే. ‌అంతా తన కష్టంతోనే.. సిన్సియారిటీతోనే సాధించారు యాదమ్మ.

  నెలల కొడుకును భుజాన వేసుకుని..

  ఉమ్మడి కరీంనగర్‌కు చెందిన యాదమ్మ పుట్టెడు దుఖంతో, బండెడు కష్టాల్లో ఉన్నపుడు గరిటె పట్టింది. బావులు తవ్వడం వృత్తిగా ఉండే చంద్రయ్యను తన పద్నాలుగో ఏటా వివాహం చేసుకున్న యాదమ్మకు కొడుకు పుట్టిన మూడు మాసాలకే భర్త చంద్రయ్య ఓ బావి తవ్వుతూ ప్రమాదవశాత్తూ మృతిచెందాడు. దీంతో నెలల కొడుకును భుజాన వేసుకుని బతుకుదెరువును వెతుక్కుంటూ కరీంనగర్‌కు వచ్చిన యాదమ్మ పలువురి ఇళ్లలో వంటలు చేస్తూ బతుకీడ్చేది. అనంతరం వెంకన్న అనే వంట మాస్టర్‌ ఆమెను శుభకార్యాలకు వంటలు చేయడానికి తీసుకెళ్లేవాడు. పెద్ద పెద్ద వంటలు చేయడం, రుచి, ఖచ్చితత్వం ఆమెకు నెమ్మదిగా పేరు తెచ్చాయి. తర్వాత ఆమే స్వంతంగా వంటమాస్టర్‌గా మారింది.

  పొంగులేటి కుమార్తె వివాహం సందర్భంగా..

  ఇలా గత ఇరవై తొమ్మిదేళ్లుగా ఆమె తన వృత్తిలో సంతృప్తి వెతుక్కుంటూనే ముందుకెళ్తోంది. ఉమ్మడి కరీంనగర్‌, వరంగల్‌ జిల్లాల్లోని పలువురు రాజకీయ, పోలీసు, ఇంకా పలువురు ప్రముఖుల ఇళ్లలో ఎలాంటి కార్యక్రమాలు జరిగినా యాదమ్మే వంటమాస్టర్‌. తాజాగా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన కుమార్తె వివాహం సందర్భంగా యాదమ్మ వంటల రుచిని ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రజలకు తొలిసారిగా రుచి చూపించనున్నారు. నిజం చెప్పాలంటే యాదమ్మ డేట్స్‌ దొరకడం కష్టమే. ఎంతో అడ్వాన్సుగా మాట్లాడుకుంటే మాత్రమే ఆమెతో వంట చేయించుకోవడం కుదిరే పని. అదీ ఆమె రేంజ్‌.

  KG to PG Institute: వావ్​..అదిరిపోయిందిగా.. తెలంగాణలో తొలి KG to PG విద్యాలయం ఇదే..

  సినిమా యాక్టర్లు, పెద్ద పెద్ద బిజినెస్‌ మాగ్నట్స్‌, రాజకీయ ప్రముఖులు సైతం యాదమ్మతోనే తమ ఇంట శుభ కార్యాలకు వంట చేయించుకోవాలని అభిలషిస్తుంటారు. ఇంతటి బిజీగా ఉంటే యాదమ్మ ప్రతి ఏటా మహాశివరాత్రి పర్వదినాల్లో మూడు రోజులు మాత్రం వేములవాడ దేవస్థానంలో  ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వేలమందికి చేసే అన్నదాన కార్యక్రమానికి యాదమ్మే స్వయంగా వంట  చేస్తుంటుంది. కేవలం తాను ఎంచుకున్న వృత్తిలో అంకితభావంతో, క్రమశిక్షణతో పనిచేస్తూ యాదమ్మ తనని తాను నిరూపించుకున్నారు. నెలల పసివాణ్ని భుజాన వేసుకుని ఏ దిక్కూలేక బస్తీబాట పట్టిన యాదమ్మ ఎదుగుదల ప్రతి ఒక్కరికీ ఆదర్శం. ఇలా ఈమె వల్ల 150 మందికి పైగా ఉపాధి పొందుతున్నారు.
  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Cooking women, Food, Karimangar, Khammam

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు