ఖమ్మం జిల్లా టీఆర్ఎస్లో నేతల మధ్య ఉన్న విభేదాలను తొలగించి.. అందరినీ ఒకతాటిపైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఈ క్రమంలోనే జిల్లాకు చెందిన మంత్రి, ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలువురు ఎమ్మెల్యేలకు కేటీఆర్ క్లాస్ తీసుకున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ఈ భేటీ అనంతరం ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డితో గంటలకు పైగా కేటీఆర్ ఏకాంతంగా చర్చలు జరపడం జిల్లా రాజకీయవర్గాల్లో ఆసక్తి రేపుతోంది. ఇటీవల ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సొంత పార్టీ టీఆర్ఎస్లో జరుగుతున్న రాజకీయ విభేదాలుపై పొంగులేటి తనదైన శైలిలో స్పందించారు. పొంగులేటి వ్యాఖ్యలు ఖమ్మం జిల్లాతో పాటు టీఆర్ఎస్ పార్టీలో తీవ్ర దుమారాన్ని రేపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కేటీఆర్‌తో పొంగులేటి ప్రత్యేకంగా సమావేశం అయినట్టు తెలుస్తోంది.
గంటకుపైగా సుదీర్ఘంగా సాగిన ఈ చర్చల్లో.. జిల్లాలో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. ఇటీవల పొంగులేటి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన కేటీఆర్ కారణాలను అడిగి తెలుసుకున్నట్లుగా తెలుస్తోంది. తనను నమ్ముకున్న కార్యకర్తలను స్థానికంగా ప్రజా ప్రతినిధులు ఇబ్బందులకు గురిచేయడం, వ్యక్తిగతంగా టార్గెట్ చేసి కేసులలో ఇరికించటం, పార్టీ పదవుల నుంచి తొలగించటం వంటి ఘటనలు చోటు చేసుకోవటంతోనే కార్యకర్తల్లో, అభిమానుల్లో ఆత్మస్తైర్యం నింపడానికి మాట్లాడినట్లు యువనేతకు పొంగులేటి వివరణ ఇచ్చుకున్నట్లు తెలుస్తోంది.
ఇక జిల్లా రాజకీయాలను ప్రభావితం చేసే పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కేటీఆర్ నుంచి పూర్తి భరోసా లభించినట్లు ఆయన అనుచరులు చర్చించుకుంటున్నారు. ఎంపీ సీటు వదులుకుని టీఆర్ఎస్ పటిష్టత కోసం పని చేస్తున్న పొంగులేటికి పార్టీలో త్వరలోనే మంచి ప్రాధాన్యత లభిస్తుందని టాక్ వినిపిస్తోంది. అయితే కేటీఆర్ నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఏ రకమైన హామీ లభించిందనే దానిపై మాత్రం స్పష్టత రావాల్సి ఉంది.
Published by:Kishore Akkaladevi
First published:January 21, 2021, 22:52 IST