(G. Srinivas Reddy, News8, Khammam)
సాగు పద్దతుల్లో (Cultivation) మార్పులు తీసుకురావడం ద్వారా గణనీయమైన దిగుబడి పెరిగే ఛాన్స్ వచ్చేసింది. గింజలు విత్తుకునే దశ నుంచి చేపట్టే జాగ్రత్తల వల్ల ఖర్చును తగ్గించుకుంటూ అధిక దిగుబడిని పొందడం (reduce costs and obtain higher yields) ఎలా అన్న దానిపై వ్యవసాయ శాస్త్రవేత్తలు (Agricultural scientists) దృష్టి సారించారు. సాగు పద్దతుల్లో చిన్నచిన్న మార్పులు చేయడం ద్వారా అనుకున్నది సాధించారు. దీన్ని ఎంపిక చేసిన రైతులకు శిక్షణ ఇచ్చి, వారితో సాగులో మార్పు చేయడానికి ఒప్పించారు. ఉమ్మడి ఖమ్మం (Khammam), వరంగల్ (Warangal), కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో తేలికపాటి నేలలు ఉన్న ప్రాంతంలో మొదట ఈ పద్దతిలో పత్తి సాగు (Cotton Cultivation)ను ప్రారంభించారు. ఖమ్మం జిల్లాలోని సింగరేణి, ముదిగొండ మండలాల్లోని 1150 ఎకరాలు, భద్రాద్రి గుండాల, ఇల్లెందు మండలాల్లో ఈ తరహా సాగును ప్రారంభించారు.
మొక్కల మధ్య 20 సెంటీమీటర్ల దూరం..
సంప్రదాయ పత్తి సాగు (Cotton cultivation)లో ఎకరాకు అచ్చు ఒత్తు పద్దతిలో 4200 మొక్కలు, సాలు పద్దతిలో అయితే ఎకరాకు ఏడు వేల మొక్కలు పడతాయి. కానీ ఇప్పుడు సైంటిస్టులు రూపొందించిన కొత్త పద్దతిలో ఎకరాకు 25 వేల మొక్కలు పడతాయి. సాధారణ పద్దతిలో మొక్కల మధ్య 60-90 సెంటీమీటర్ల దూరం, సాళ్ల మధ్య 100-120 సెంటీమీటర్ల దూరం పాటిస్తుంటారు. కానీ ఈ అధిక సాంద్రత పద్దతిలో మాత్రం మొక్కకు మొక్కకు మధ్య కేవలం 20 సెంటీమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది. ఇక సాలుకు సాలుకు మధ్య దూరం 80 సెంటీమీటర్లు పాటించాలి. ఇలా ఒత్తుగా గింజలు నాటుకోవడం ద్వారా ఎకరాకు పాతికవేల మొక్కలు పడతాయి. అయితే ఈ కొత్త పద్దతిలో విత్తనం కొనుగోలు ఖర్చు, విత్తుకునే కూలి ఖర్చులు కాస్త ఎక్కువ అనిపిస్తున్న కారణంగా ప్రోత్సాహకంగా ఎకరాలకు రూ.4 వేలు సాయంగా అందిస్తున్నారు.
ఈ రకం బీటీ విత్తనం సాగులో కొన్ని మెళకువలు పాటించాల్సిన అవసరం ఉందంటున్నారు శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు. దీనికోసం ఎంపిక చేసిన ప్రాంతాల్లోని రైతులకు ముందుగా శిక్షణ ఇచ్చి మరీ సాగును ప్రోత్సహిస్తున్నారు. ఒత్తుగా విత్తుకోడానికి అనువుగా ఒక యంత్రాన్ని కూడా అందుబాటులో ఉంచారు. ఇక మొక్క పెరుగుదలను నిత్యం మోనిటర్ చేసుకుంటూ కొమ్మలు విచ్చలవిడిగా పెరగకుండా నియంత్రించడానికి గ్రోత్ రెగ్యులేటర్‌గా మెపిక్యాట్ క్లోరైడ్ రసాయనాన్ని పిచికారీ చేయాల్సి ఉంటుంది. విత్తనం వేసిన నెలన్నరకు ఒకసారి, రెండు నెలలకు ఒకసారి పిచికారీ చేయడం ద్వారా మొక్కల ఎత్తును, కాండం ఎదుగుదలను నియంత్రిస్తారు. దీనిద్వారా మొక్కకు అవసరమైన గాలి, సూర్యరశ్మిని అందించడం, తద్వారా గులాబి పురుగు, ఇతర చీడపీడలు ఆశించకుండా జాగ్రత్తపడొచ్చు.
ఈ సాగులో ఏంటి లాభం అంటే..
సాధారణ పత్తి సాగు పద్దతిలో కంటే ఈ సాగులో కేవలం విత్తుకునే సమయంలోనే ఖర్చు విత్తనాలకు, విత్తుకునేందుకు కూలీల అవసరం ఎక్కువ. కానీ పంట వేశాక నియంత్రణ, పంట తీసుకోవడం చాలా సులువు అంటున్నారు అధికారులు, సాధారణ పద్దతిలో పంటను నాలుగైదు సార్లు తీయాల్సి ఉంటే.. ఈ పద్దతిలో కేవలం ఒకే ఒక్కసారి పంట తీసుకోవచ్చు. దీని ద్వారా కూలీ ఖర్చును తగ్గించుకోవచ్చు. పైగా పత్తిలో గుడ్డికాయ శాతాన్ని దాదాపు నివారించవచ్చంటున్నారు శాస్త్రవేత్తలు. నీటి సౌకర్యం ఉన్న నేలల్లో ఎకరాకు 25 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉంది. వర్షాల పైనే ఆధారపడి సాగుచేసినా తక్కువలో తక్కువ 13-15 క్వింటాళ్ల దాకా దిగుబడి వస్తుంది. ఒకేసారి పంట మొత్తాన్ని పత్తి తీసే యంత్రాల సాయంతోనూ లాగేసుకోవచ్చంటున్నారు సైంటిస్టులు. ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ సాగు సక్సెస్ అయితే పత్తిరైతుకు ఇక అధిక దిగుబడి, తక్కువ ఖర్చు వల్ల పత్తి నిజంగా బంగారమే అయ్యే ఛాన్స్ ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Agriculuture, Cotton, Cultivation, Khammam