news18-telugu
Updated: August 5, 2020, 2:28 PM IST
ఖైరతాబాద్ వినాయకుడు(ఫైల్ ఫోటో)
తెలంగాణలో అత్యంత ప్రముఖమైన ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహ తయారీ మొదలైంది. ఈ సారి ఖైరతాబాద్ గణపతి 9 అడుగుల ఎత్తులో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. కరోనా నేపథ్యంలో దర్శనం కోసం భక్తులను అనుమతించటంలేదని ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ్ కమిటీ వెల్లడించింది. ఈసారి భక్తులు ఆన్లైన్లోనే ఖైరతాబాద్ మహాగణపతిని దర్శనం చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది. కాగా, ఈసారి మహావిష్ణువు రూపంలో ఖైరతాబాద్ గణేషుడు భక్తులకు కనిపించనున్నారు. శ్రీ ధన్వంతరి నారాయణ మహాగణపతిగా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ్ కమిటీ నామకరణం చేశారు. ఒక వైపు లక్ష్మిదేవి మరో వైపు సరస్వతి దేవి విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారు.
ఈసారి పర్యావరణహితంగా ఖైరతాబాద్ వినాయకుడు రూపుదిద్దుకోబోతున్నాడు. మట్టితో తయారు చేసి అదే ప్రదేశంలో నిమజ్జనం చేసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోవైపు ప్రభుత్వ నిబంధనల మేరకు విగ్రహాన్ని 9 అడుగులకే పరిమితం చేశామని కమిటీ తెలిపింది. భక్తులకు ప్రసాదం, తీర్థం ఇవ్వటంలేదని.. 11 రోజుల పాటు కమిటీ సభ్యులు మాత్రమే పూజలు నిర్వహిస్తారని పేర్కొంది. సామూహిక నిమజ్జనం నిర్వహించటం లేదని స్పష్టం చేసింది. ఈ నిబంధనలు దృష్టిలో పెట్టుకుని భక్తులు కూడా సహకరించాలని కమిటీ కోరింది.
Published by:
Kishore Akkaladevi
First published:
August 5, 2020, 2:28 PM IST