కేంద్రంపై కేసీఆర్ గుస్సా... త్వరలో మళ్లీ ఢిల్లీకి... ఈసారి బలమైన ఆధారాలతో...

కేంద్రం నుంచి రావాల్సిన డబ్బులు రాకపోతే తమకు ఇబ్బందులు తలెత్తుతాయనే విషయాన్ని ఢిల్లీకి వెళ్లి ప్రధానికి, కేంద్ర ఆర్థిక మంత్రికి వివరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచిస్తున్నారు.

news18-telugu
Updated: December 7, 2019, 8:08 PM IST
కేంద్రంపై కేసీఆర్ గుస్సా... త్వరలో మళ్లీ ఢిల్లీకి... ఈసారి బలమైన ఆధారాలతో...
సీఎం కేసీఆర్(ఫైల్ ఫోటో)
  • Share this:
కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధుల్లో కోత విధిస్తున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. పార్లమెంటులోనూ, బయటా దేశంపై ఆర్థిక మాంద్యం ప్రభావం లేదని కేంద్ర ప్రభుత్వం ప్రతీ రోజూ గొప్పలు చెప్పుకుంటున్నది. కానీ, వాస్తవాలు ఇందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయని కేసీఆర్ అన్నారు. గత ఎనిమిది నెలల్లో కేంద్రం నుంచి రావాల్సిన వాటాలో 8.3 శాతం తగ్గిందని, ఇదేంటని అధికారులు కేంద్రంతో మొరపెట్టుకుంటే.. 15 శాతం తగ్గుతుందని చెబుతున్నారని కేసీఆర్ అన్నారు. 15 శాతం తగ్గుదల అంటే మొత్తం ఏడాదికి కేంద్ర పన్నుల వాటాలో రాష్ట్రానికి రావాల్సిన నిధుల్లో రూ.2,957 కోట్లు తగ్గనున్నాయి.

‘ఈ పరిస్థితి ఇట్లనే కొనసాగితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింత ఆందోళనకరంగా తయారయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అన్నవస్త్రం కోసం పోతే ఉన్నవస్త్రం పోయిందన్నట్లు పరిస్థితి తయారయింది. ఆర్థిక పరిస్థితి అనిశ్చితి స్థితిలో ఉంది. ’ అనే అభిప్రాయం వ్యక్తమైంది. కేంద్ర పన్నుల వాటా గణనీయంగా తగ్గిన నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని శాఖలకు సమాంతరంగా నిధులు తగ్గించాలని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిని ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. అన్ని శాఖలను అప్రమత్తం చేసి, అన్ని శాఖల్లో ఖర్చులకు కోత విధించుకోవాలని, కఠినమైన నియంత్రణ పాటించాలని సిఎం ఈ సందర్భంగా సూచించారు.

కేంద్ర మంత్రికి సిఎం లేఖ

కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర పన్నుల వాటాను విడుదల చేయాలని, లేనట్లయితే వాస్తవాలను వెల్లడించాలని కోరుతూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శనివారం లేఖ రాశారు. 2017-18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జిఎస్టీలో అంతర్భాగంగా ఉండే ఐజిఎస్టీ ద్వారా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన రూ.2,812 కోట్లకు కూడా కేంద్రం ఎగనామం పెట్టిందని ప్రభుత్వం ఆక్షేపించింది. కేంద్రం నుంచి జిఎస్టీ నష్ట పరిహారం కింద రాష్ట్రానికి రూ.1,719 కోట్ల బకాయిలు అందవలసి ఉన్నది. ఈ డబ్బులు కూడా వెంటనే విడుదల చేయాలని కేంద్ర మంత్రికి రాసిన లేఖలో సిఎం కేసీఆర్ కోరారు.

ప్రధానిని కలిసే ఆలోచనలో ముఖ్యమంత్రి

కేంద్రం నుంచి రావాల్సిన డబ్బులు రాకపోతే తమకు ఇబ్బందులు తలెత్తుతాయనే విషయాన్ని ఢిల్లీకి వెళ్లి ప్రధానికి, కేంద్ర ఆర్థిక మంత్రికి వివరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచిస్తున్నారు. ఐదారు రోజుల తర్వాత అధికారులను వెంటబెట్టుకుని వెళ్లి, పరిస్థితి తీవ్రతను వివరించి నిధులు అడగాలని భావిస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి- ఇతర ఆర్థిక అంశాలపై ఈనెల 11న జరిగే కేబినెట్ సమావేశంలో మంత్రులు, అధికారులకు సమగ్రమైన నోట్ అందించాలని ఆర్థిక శాఖ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: December 7, 2019, 8:08 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading