KCR NATIONAL PARTY BRS LIKELY TO CONTEST ELECTIONS IN ANDHRA PRADESH AP LEADERS ARE WELCOMING CM KCR STRATEGIES SK
CM KCR: తెలంగాణ సీఎం కేసీఆర్‌తోనే ఏపీకి న్యాయం.. ఆంధ్రాలోనూ బీఆర్ఎస్ పోటీ..!
సీఎం కేసీఆర్ (పాత ఫొటో)
Telangana: ఆంధ్రప్రదేశ్ బాగుపడాలంటే కేసీఆర్ లాంటి నాయకుడి అవసరం ఉందని సురేంద్ర రెడ్డి తెలిపారు. ఏపీ గళాన్ని ఢిల్లీలో బలంగా వినిపించ గల సత్తా ఆయనకే ఉందని.. ప్రజలు కూడా అదే నమ్ముతున్నారని అన్నారు.
భారత్‌లో బీజేపీ, కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి రావాల్సి ఉందని ఈ మధ్య తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR) పదే పదే చెబుతున్నారు. బీజేపీ హయాంలో భారత దేశం సర్వనాశనమయిందని.. కాంగ్రెస్ పార్టీ కోలుకోలేని స్థితిలో ఉందని.. దేశం బాగుపడాలంటే మరో కూటమి రావాలని అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోనే జాతీయ స్థాయిలో చక్రం తిప్పేందుకు సీఎం కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే మమతా బెనర్జీ (Mamata Banerjee) అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal), దేవెగౌడ (Deve Gouda), ఉద్ధవ్ థాక్రే (Uddhav Thackeray), స్టాలిన్ (Stalin) వంటి నేతలను కలిశారు. అనంతరం కొత్త జాతీయ పార్టీ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. కొత్త పార్టీకి సంబంధించి ఇప్పటికే సీఎం కేసీఆర్ అంతా సిద్ధం చేశారని.. తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) పార్టీయే.. భారత్ రాష్ట్ర సమితి (BRS) రూపాంతరం చెందుతుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అతి త్వరలోనే జాతీయ పార్టీపై ప్రకటన చేస్తారని సమాచారం అందుతోంది. రాష్ట్రపతి ఎన్నికల తర్వాత ఏ క్షణమైనా కొత్త పార్టీని ప్రారంభించవచ్చని వార్తలు వస్తున్నాయి.
ఏదైనా పార్టీ జాతీయపార్టీగా గుర్తింపు పొందాలంటే కనీసం 4 రాష్ట్రాల్లో 6 శాతం ఓట్లు సాధించాల్సి ఉంటుంది. ఇది జరగాలంటే తెలంగాణతోపాటు ఏపీలోను, తెలుగు ప్రజలు ఇతర రాష్ట్రాల్లోని కొన్ని నియోజకవర్గాల్లో కూడా బీఆర్ఎస్ పోటీచేయాల్సి ఉంటుంది. ఇటీవల మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌తో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. ఆ భేటీలో భారత్ రాష్ట్ర సమితి గురించి చర్చించారని.. బీఆర్ఎస్ ఏపీ బాధ్యతలను ఆయనకు అప్పజెప్పవచ్చని ఊహాగానాలు వినిపించాయి. ఈ క్రమంలో మరో ఆంధ్రా నేత సీఎం కేసీఆర్‌పై ప్రశంసలు కురిపించారు. మోదీని ఎదురించే మొనగాడు.. కేసీఆర్ ఒక్కరేనని ప్రశంసలు కురిపించారు. ఆయన వల్లే ఏపీకి న్యాయం జరుగుతుందని అన్నారు.
ఆంధ్ర రాష్ట్ర ప్రజాసమితి అధ్యక్షుడు పెల్లకూరు సురేంద్రరెడ్డి శుక్రవారం హైదరాబాద్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. సీఎం కేసీఆర్‌పై ప్రశంసలు కురిపించారు. ఢిల్లీలో ఏపీకి జరుగుతున్న అన్యాయంపై గళమెత్తే సత్తా ఒక్క కేసీఆర్‌కే ఉందని ఆయన అన్నారు. కేంద్రం చూపిస్తున్న వివక్షా పూరిత రాజకీయంలో.. ఆంధ్రప్రదేశ్ బాగుపడాలంటే కేసీఆర్ లాంటి నాయకుడి అవసరం ఉందని సురేంద్ర రెడ్డి తెలిపారు. ఏపీ గళాన్ని ఢిల్లీలో బలంగా వినిపించ గల సత్తా ఆయనకే ఉందని.. ప్రజలు కూడా అదే నమ్ముతున్నారని అన్నారు. ఏపీలో ఆంధ్ర రాష్ట్ర ప్రజాసమితి పార్టీ... బీఆర్ఎస్తో కలిసి పోటీచేస్తుందని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో ఏపీలో బీఆర్ఎస్ ఖచ్చితంగా పోటీ చేస్తుందన్న అభిప్రాయాలను రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏపీలో కూడా కేసీఆర్‌కు క్రేజ్ ఉందని.. దానిని కేసీఆర్ ఖచ్చితంగా వినియోగించుకుంటారని అంటున్నారు. కర్నాటక, మహారాష్ట్ర సరిహద్దు జిల్లాల్లో కూడా పోటీ చేసే అవకాశాన్ని పరిశీలిస్తారని భావిస్తున్నారు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.