రైతులకు శుభవార్త: వరికి మద్దతు ధర నిర్ధారణ -దొడ్డు వడ్లతోపాటు వానాకాలం పంట మొత్తాన్నీ కొంటాం: KCR సర్కార్

వరికి మద్దతు ధర

వచ్చే యాసంగి నుంచి వరి వేస్తే ఉరి వేసుకున్నట్లేనన్న కేసీఆర్ సర్కారు.. ప్రస్తుత వానాకాలం సీజన్ కు మాత్రం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. దొడ్డు వడ్లను కూడా కొంటామని, రాష్ట్రంలో పండే ధాన్యం మొత్తాన్ని సేకరిస్తామని, రైతుల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు జమచేస్తామన్న సర్కారు వారు.. వరికి కనీస మద్దతు ధరను కూడా నిర్ధారించారు..

  • Share this:
బాయిల్డ్‌ రైస్‌ను కొనలేమని కేంద్ర ప్రభుత్వం తెగేసి చెప్పడంతో తెలంగాణలో ఇకపై వరి పంట సాగు చేయడం ఏమాత్రం శ్రేయస్కరం కాదని, వరి వేస్తే ఉరి వేసుకున్నట్లేనని రైతుల్ని హెచ్చరించిన కేసీఆర్ సర్కారు ఆ విధానాన్ని వచ్చే యాసంగి నుంచి అమలు చేయనుండగా, ప్రస్తుత వానాకాలం సీజన్ లో మాత్రం రైతులకు శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో పండే ప్రతి గింజనూ తామే కొనుగోలు చేస్తామన్న ప్రభుత్వం.. వరికి మద్దతు ధరను సైతం ప్రకటించింది. అదే సమయంలో ధాన్యం సేకరణకు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. వివరాలివి..

ప్రతి గింజా ప్రభుత్వమే..
వరి పంటపై రైతుల్లో నెలకొన్న భయాందోళనలు, దొడ్డు వడ్లను కొనబోరనే ప్రచారాన్ని పటాపంచలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం స్పష్టమైన విధానాన్ని ప్రకటించింది. గత వానకాలం, యాసంగి మాదిరిగానే ఈ వానకాలంలోనూ గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి నేరుగా రైతుల నుంచే ధాన్యం సేకరించాలని సర్కారు నిర్ణయించుకుంది. ఈ మేరకు ధాన్యం కొనుగోళ్లపై పౌరసరఫరాలశాఖ అన్ని జిల్లాల కలెక్టర్లకు మార్గదర్శకాలు జారీచేసింది. రాష్ట్రవ్యాప్తంగా 6 వేల కొనుగోలు కేంద్రాల ద్వారా ఈ సీజన్‌లో రికార్డు స్థాయిలో 135 లక్షల టన్నుల ధాన్యం సేకరించే అవకాశం ఉన్నదని అధికారులు అంచనా వేశారు.

మద్దతు ధర ఎంతంటే..
తెలంగాణలో పండే ప్రతి గింజనూ ప్రభుత్వమే కొంటుందని భరోసా ఇస్తూ వరికి మద్దతు ధరను సైతం ప్రకటించారు. పౌరసరఫరాలశాఖ మార్గదర్శకాల ప్రకారం.. గ్రేడ్‌ ‘ఏ’ రకం ధాన్యానికి కనీస మద్దతు ధర ఒక క్వింటాల్ కు రూ.1,960గా నిర్ధారించారు. అదే సాధారణ రకం ధాన్యానికి రూ.1,940గా నిర్ణయించారు. సేకరించిన ధాన్యానికి డబ్బులను నేరుగా రైతుల ఖాతాల్లోనే ఆధార్ నంబర్ ఆధారంగా జమ చేస్తారు. ఒకవేళ రైతుకు బ్యాంకు అకౌంట్ లేకుంటే కచ్చితంగా కొత్త అకౌంట్ తీయాల్సి ఉంటుంది.

దొడ్డు వడ్లు కొంటాం..
ఈ వానాకాలం సీజన్ లో దొడ్డు వడ్లను కూడా ప్రభుత్వమే కొంటుందని అధికారులు స్పష్టం చేశారు. గత వానకాలంలో ప్రభుత్వం 48.85 లక్షల టన్నుల ధాన్యం సేకరించగా, ఈ సీజన్‌లోనూ ఉప్పుడు బియ్యం తీసుకోరని, కేవలం రా రైస్‌ (పచ్చి బియ్యం) మాత్రమే తీసుకుంటారని వార్తలు రావడంతో అందుకు అనుగుణంగా అధికారులు చర్యలు తీసుకోనున్నారు. వానకాలం సీజన్‌లో మెజార్టీగా రా రైస్‌ ధాన్యమే వస్తుందని, ఇబ్బందేమీ లేదని అధికారులు తెలిపారు. వచ్చే యాసంగిలో మాత్రం బాయిల్డ్‌ రైస్‌ ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోబోమని ఢిల్లీ సర్కారు ఇప్పటికే స్పష్టంచేసిన విషయం తెలిసిందే.

డిఫాల్ట్‌ మిల్లర్లకు షాక్
ధాన్యం సేకరణ ప్రక్రియ వచ్చే ఏడాది జులై కల్లా పూర్తి కావాల్సి ఉందని, రేషన్ దుకాణాలు, ఇతర ప్రభుత్వ పథకాలకు సరఫరా చేసే బియ్యం 18 లక్షల టన్నులు ఉండొచ్చని పేర్కొన్న అధికారులు.. డిఫాల్ట్‌ మిల్లర్లకు షాకిచ్చారు. సకాలంలో అందించగలిగిన మిల్లర్లకు మాత్రమే ఈసారి అవకాశం కల్పిస్తామని, గతంలో అవకతవకలకు పాల్పడినవారికి ఈసారి అనుమతివ్వబోమని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.

టోల్ ఫ్రీ నంబర్లు..
ధాన్యం తడిచి పాడైపోకుండా అన్ని చోట్లా టర్పాలిన్లు, క్లీనర్లను సమకూర్చుకోవాలని, రంగుమారిన, తడిచిన, మొలకలెత్తిన ధాన్యం ఐదు శాతానికి మించరాదని కలెక్టర్లకు ఇచ్చిన సూచనల్లో ప్రభుత్వం పేర్కొంది. రైస్ మిల్లుల సామర్థ్యం సరిపోకుంటే ప్రైవేటు గోడౌన్లను ప్రభుత్వమే అద్దుకు తీసుకోవాలని, ఈ విషయంలో కలెక్టర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని సూచించారు.ధాన్యం కొనుగోలులో ఇబ్బందులు ఎదురైతే 1800-42500333, 1967 టోల్‌ ఫ్రీ నంబర్లలో ఫిర్యాదు చేయొచ్చు.
Published by:Madhu Kota
First published: