Home /News /telangana /

KARUNYA APPOINTMENTS IN TSRTC MAY BE COMPLETED WITHIN THE NEXT THREE MONTHS PRV

TSRTC: టీఎస్​ఆర్టీసీ గుడ్​న్యూస్​.. మూడు నెలల్లో ఆ నియామకాలు పూర్తి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

టీఎస్​ఆర్టీసీ.. సజ్జనార్​ ఎండీగా బాధ్యతలు చేపట్టాక వేగంగా దూసుకుపోతోంది. ఇపుడు నియామకాలు సైతం త్వరితగతిన ఫిల్​ చేసే యోచనలో ఉంది.

    ఉద్యోగం (Job) చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న వ్యక్తి హఠాత్తుగా మరణిస్తే ఆ కుటుంబ సభ్యులు ఆసరా కోల్పోతారు. ఇబ్బందుల్లో కూరుకుపోతారు. ఆరోగ్య కారణాల రీత్యా ఉద్యోగం చేయలేని అసక్తత ఏర్పడినా అదే పరిస్థితి. ఇలాంటి కుటుంబాలను ఆదుకోడానికే కారుణ్య నియామకాలను (compassionate appointments ) ప్రవేశపెట్టారు. తాజాగా టీఎస్​ఆర్టీసీ (TSRTC)లో ఈ కారుణ్య నియామకాల ప్రక్రియ వేగవంతం అవుతోంది. ఈ నేపథ్యంలో నియామకాలను 3 నెలల్లో భర్తీ చేసే యోచనలో ఉన్నారు. దీనిలో భాగంగా ప్రస్తుతం జిల్లాలవారీగా వచ్చిన దరఖాస్తుల నుంచి అర్హులను ఎంపికచేసే ప్రక్రియను వేగవంతం చేశారు. కొవిడ్‌ వల్ల రాష్ట్రవ్యాప్తంగా 430 మంది ఆర్టీసీ కార్మికులు మృతిచెందారు. వీరు కాకుండా డ్యూటీలో ఉండి మరణించినవారు, ఆరోగ్య సమస్యలతో మృతిచెందినవారు, మెడికల్‌ అన్‌ఫిట్‌ అయినవారు కలిపి మరో 600 ఖాళీలను అధికారులు గుర్తించారు.

    ఆన్‌డ్యూటీలో మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు..

    ఈ 1,030 ఖాళీలను కారుణ్య నియామకాలతో (Karunya Appointments) భర్తీ చేసేందుకు మూడు ప్రాధమ్యాలను ఎంచుకొన్నారు. ఆన్‌డ్యూటీలో మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు తొలి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. అనారోగ్య సమస్యలతో మరణించినవారి కుటుంబాలకు రెండో ప్రాధాన్యంగా, మెడికల్‌ అన్‌ఫిట్‌ అయినవారికి మూడో ప్రాధాన్యంగా ఉద్యోగాలు కల్పించనున్నారు. ఈ మేరకు అధికారులు ఇప్పటికే స్పష్టమైన మార్గదర్శకాలను రూపొందించుకొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ విరమణ వయోపరిమితిని రెండేండ్లు పెంచడంతో ఆర్టీసీలో రెండేండ్లపాటు రిటైర్మెంట్లు లేకుండా పోయాయి.



    రెండేండ్ల అనంతరం 2021 డిసెంబర్‌ నుంచి ఉద్యోగ విరమణలు మొదలయ్యాయి. గత నెల(జూలై)లో దాదాపు 160 మంది రిటైర్‌ అయ్యారు. ఈ ఖాళీలను భర్తీ చేయడానికి మరో 3 నెలల సమయం పడుతుందని ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. టీఎస్‌ఆర్టీసీలో డ్రైవర్లు, కండక్టర్లు, సెక్యూరిటీ గార్డులు, శ్రామిక్‌ల పోస్టులను మాత్రమే కారుణ్య నియామకాల ద్వారా భర్తీ చేయనున్నారు. దరఖాస్తులదారుల అర్హతను బట్టి ఈ 4 రకాల ఉద్యోగాల్లో దేనికి సరిపోతే అక్కడ నియమించనున్నారు.

    హెవీ లైసెన్స్‌లు ఉన్నవారికి డ్రైవర్‌, పదో తరగతి పాసైన వారికి కండక్టర్‌ లేదా సెక్యూరిటీ గార్డు, ఐటీఐ చేసిన వారికి శ్రామిక్‌ పోస్టులు ఇవ్వనున్నట్టు అధికారులు చెప్తున్నారు. అయితే దరఖాస్తు దారుల్లో చాలా మంది యువత సెక్యూరిటీ గార్డు పోస్టులకే ఆసక్తి చూపుతున్నారని, అయినప్పటికీ ప్రస్తుతం ఉన్న ఖాళీలు, సంస్థ అవసరాన్ని బట్టే ఉద్యోగ నియామకాలు జరుగుతాయని స్పష్టం చేస్తున్నారు. కొన్ని కేసుల్లో పదో తరగతి పూర్తిచేయనివారు సైతం ఉన్నట్టు తమ దృష్టి వచ్చిందని, అలాంటి వారు తగిన విద్యార్హతలను సాధించేందుకు 10 ఏండ్ల వరకు సమయం ఇచ్చామని ఆర్టీసీ అధికారులు తెలిపారు.

    కారుణ్య నియామకం వివరాలు..

    అయితే ఈ కారుణ్య నియామకాలపై (Karunya appointments) చాలా మందికి చాలా అనుమానాలున్నాయి. ఎప్పుడిస్తారు, ఎలా ఇస్తారు, ఎవరికిస్తారు, ఎక్కడిస్తారు, ఎప్పటిలోపు ఇవ్వాలి, ఏ పోస్టులిస్తారు ఇలా అనేక అనుమానాలున్నాయి. మీకోసమే ఈ సమాచారం

    కారుణ్య నియామకాలు : రెండు రకాలు. ఒకటి : మరణించిన ఉద్యోగి కుటుంబీకులకు ఇచ్చేది. రెండు : వైద్య కారణాల వల్ల ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగి ఆధారితులకు ఇచ్చేది.

    కారుణ్య నియామకాల లక్ష్యం ఏమిటి : మరణించిన లేక అనారోగ్య సమస్య వల్ల ఉద్యోగం చేయలేని అసక్తత ఏర్పడిన ఉద్యోగుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవడం.

    కారుణ్య నియామకాలకు అర్హులెవరు?

    మరణించిన ఉద్యోగి వారసులు, వైద్య కారణాల వల్ల రిటైర్‌మెంట్‌ తీసుకున్న ఉద్యోగి వారసులు, ఏడేళ్లపాటు కనిపించకుండాపోయిన ఉద్యోగి వారసులు ఈ నియామకాలకు అర్హులు. వైద్య కారణాల వల్ల కనీసం ఐదేళ్ల సర్వీసు ఉండగా రిటైర్‌మెంటు తీసుకుంటే ఆ ఉద్యోగిపై ఆధారపడిన కుటుంబంలోని ఒకరికి ఉద్యోగం ఇస్తారు. కనిపించకుండాపోయిన ఉద్యోగి విషయంలో పోలీసు రిపోర్టు ఆధారంగా ఉద్యోగం ఇస్తారు.

    ఎవరికిస్తారు?

    ఎలాంటి కారణ్య నియామకమైనా ఎవరికిస్తారన్న అనుమానం చాలా మందికి ఉంటుంది. దానికి విధివిధానాలు ఉన్నాయి. 1.ఉద్యోగి భార్య/భర్త, 2.కుమారుడు/కుమార్తె, 3.ఉద్యోగి మరణించిన నాటికి కనీసం ఐదేళ్ల మునుపు చట్టబద్ధంగా దత్తత తీసుకున్న కుమారుడు/కుమార్తె, 4.ఉద్యోగి భార్య/భర్త నియామకానికి ఇష్టపడని సందర్భంలో ఆ కుటుంబంపై ఆధారితురాలైన వివాహిత కుమార్తె, 5. మరణించిన ఉద్యోగికి ఒక వివాహిత కుమార్తె, మైనర్‌ కుమార్తె ఉంటే వారి తల్లి సూచించినవారికి ఉద్యోగం ఇస్తారు, 6.ఉద్యోగి అవివాహితుడై మరణించినపుడు అతని తమ్ముడు, చెల్లెలు కారుణ్య నియామకానికి అర్హులు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: JOBS, Tsrtc

    తదుపరి వార్తలు