KARIMNAGAR UNION MINISTER KISHAN REDDY BY ELECTION CAMPAIGN IN HUZURABAD CONSTITUENCY KNR SSR
Huzurabad: హుజురాబాద్ ప్రచారంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాక పుట్టించే కామెంట్స్
ఈటలకు మద్దతుగా కిషన్ రెడ్డి ఎన్నికల ప్రచారం
హుజురాబాద్ నియోజకవర్గంలో ఉప ఎన్నికల వేడి రాజుకుంది. అక్టోబర్ 30న ఉప ఎన్నిక జరగనుండటంతో ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఈటల రాజేందర్‌కు మద్దతుగా బీజేపీ తరపున కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శుక్రవారం ఇల్లందకుంట మండలం సీతంపేటలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
కరీంనగర్:హుజురాబాద్ నియోజకవర్గంలో ఉప ఎన్నికల వేడి రాజుకుంది. అక్టోబర్ 30న ఉప ఎన్నిక జరగనుండటంతో ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఈటల రాజేందర్‌కు మద్దతుగా బీజేపీ తరపున కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శుక్రవారం ఇల్లందకుంట మండలం సీతంపేటలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలంగాణ చరిత్ర మళ్లీ రాస్తే.. హుజురాబాద్ పేరు కూడా ఉండేలా తీర్పు ఇవ్వాలని ఆయన ఓటర్లకు పిలుపునిచ్చారు. నిన్ననే 100 కోట్ల టీకా డోసులు పూర్తయ్యాయని, ప్రతి పేదవాడికి ఉచిత వ్యాక్సిన్ ఇచ్చే బాధ్యత మోడీ తీసుకున్నారని ఆయన చెప్పారు. మాస్క్ లేకుండా తిరుగుతున్నామంటే టీకానే కారణమని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
కేసీఆర్ కుటుంబానికి అబద్ధాల ఆడటమే తెలుసని, అబద్ధాలు పుట్టి ఆ తర్వాత వీళ్లు పుట్టారని ఆయన ఎద్దేవా చేశారు. హుజురాబాద్‌లోని ప్రతి దళిత బిడ్డ ఈటలకే ఓటేయాలని, దళిత బంధు పథకం రావడానికి కారణం ఈటల రాజేందర్ అని కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఆ పథకానికి ఈటల రాజేందర్ హుజురాబాద్ పథకంగా పేరు పెట్టాలని డిమాండ్ చేస్తున్నానని ఆయన వ్యాఖ్యానించారు. తాము పథకం ఆపామని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని, తప్పుడు ప్రచారం చేస్తున్న వారికి తాను సవాల్ చేస్తున్నానని, మీకు చిత్తశుద్ధి ఉంటే ఎన్నికలయ్యాక ఒకే రోజు దళిత బంధు ఇవ్వాలని అధికార పక్షానికి కిషన్ రెడ్డి ఛాలెంజ్ విసిరారు. గతంలో ఒకే రోజు కుటుంబ సమగ్ర సర్వే చేసినట్లుగా ఒకే రోజు దళిత బంధు పథకం రాష్ట్రమంతా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ ఎన్నికల్లో నియంతృత్వానికి, కుటుంబ రాజకీయాలకు చరమ గీతం పాడే అవకాశం హుజురాబాద్ ప్రజలకు వచ్చిందని ఆయన చెప్పారు. కేసీఆర్ డబ్బులను, అబద్ధాలను, మోసాలను, ఫిరాయింపులను, కొనుగోళ్లను నమ్ముకున్నాడని.. కానీ ఈటల రాజేందర్ ప్రజలను నమ్ముకుని మీ దగ్గరకు వచ్చాడని కిషన్ రెడ్డి ఓటర్లకు తెలిపారు. తామెవరమూ డబ్బులిచ్చి గెలవలేదని, ఈటల కూడా సేవ చేసి గెలిచాడని చెప్పారు. ఆత్మగౌరవం కలిగిన హుజురాబాద్ ప్రజలను కొనే శక్తి కేసీఆర్‌కు లేదని ఆయన వ్యాఖ్యానించారు. 15 వందల మంది బలిదానం చేసి, సకల జనులు ఉద్యమిస్తే తెలంగాణ వచ్చిందని.. అమరవీరుల కుటుంబాలను కేసీఆర్ ఎప్పుడైనా పలకరించారా అని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు.
ఎవరి కోసం ఇంత మంది ప్రాణ త్యాగం చేశారని, కేసీఆర్ కుటుంబం కోసమేనా అని కిషన్ రెడ్డి ఓటర్లను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కాపలకుక్కలా కేసీఆర్ ఉంటానన్నాడని, దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానన్న కేసీఆర్.. ఎన్నికలయ్యాక ఆయనే కుర్చీపై కూర్చున్నాడని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. దళితులకు మూడెకరాలు ఇస్తానన్న కేసీఆర్, ఇప్పుడు అనలేదని అసెంబ్లీ సాక్షిగా చెప్పాడని ఆయన వ్యాఖ్యానించారు.
నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తానన్న కేసీఆర్ ఇప్పుడు తెరవనంటున్నాడని, ఇదో నిజాం, నిరంకుశత్వ ప్రభుత్వమని కిషన్ రెడ్డి విమర్శించారు. నీతికి, అవినీతికి, ధర్మానికి-అధర్మానికి మధ్య జరుగుతున్న ఎన్నికల్లో మీరు ధర్మం వైపు ఉండండని హుజురాబాద్ ఓటర్లకు ఆయన పిలుపునిచ్చారు. సీఎం పదవి తన ఎడమకాలి చెప్పుతో సమానమని, మనల్ని అవమానించిన వ్యక్తి మళ్లీ ఎందుకు ఓటు అడుగుతున్నాడని నిలదీశారు. గెలవడానికి ఎన్నో అడ్డదారులు తొక్కుతున్నారని, కేసులు, అబద్ధాలు, బెదిరింపులు, ప్రలోభాలకు గురిచేస్తున్నారని టీఆర్ఎస్ను ఉద్దేశించి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
డబ్బులతో ప్రజల అభిప్రాయాన్ని కాలరాయాలని చూస్తున్నవారికి బుద్ధి చెప్పాలని, తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ఆ మార్పుకు మొదటి అడుగు మీరే వేయాలని హుజురాబాద్ ఓటర్లకు ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజల జీవితాలు ఇప్పుడు హుజురాబాద్ ప్రజల చేతిలో ఉన్నాయని, అమరవీరులకు ఆత్మశాంతి చేకూరాలంటే టీఆర్ఎస్ ప్రభుత్వం పోవాలని, ఈ పులి బిడ్డలు ప్రలోభాలకు లొంగకుండా ఈటలను అసెంబ్లీకి పంపిస్తారని హుజురాబాద్ ఓటర్లపై కిషన్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు.
శ్రీనివాస్.పి, న్యూస్ 18 తెలుగు కరస్పాండెంట్ కరీంనగర్ జిల్లా
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.