రెండు తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకు రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. అతివేగం, మద్యం సేవించి వాహనం నడపడం, నిద్రలేమి, రాంగ్ రూట్ వంటి కారణాలు ప్రమాదాలకు నిలయంగా మారుతున్నాయి. ఇలాంటి ఘటనలు నిత్యకృత్యంగా మారుతున్నాయి. అయితే జరిగే ప్రమాదం ఒకటే అయిన ఆ దుర్ఘటనలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఆ దుర్ఘటన ఎన్నో కుటుంబాల్లో తీరని దుఃఖాన్ని మిగులుస్తుంది.
తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం రెండు నిండు జీవితాలను బలి తీసుకుంది. జిల్లాలోని మానకొండూర్ లో ఇద్దరు దినసరి కూలీలు ఇంటి నుండి పనికి బయలుదేరారు. ఈ క్రమంలో వారు కరీంనగర్-వరంగల్ జాతీయ రహదారి పక్కనే ఉన్న హోటల్ లో టీ తాగారు. అనంతరం పని కోసం వెళ్తున్నారు. కానీ జరగబోయే ప్రమాదాన్ని వారు ఊహించలేకపోయారు. రోడ్డుపై నడుస్తున్న క్రమంలో ఆర్టీసీ బస్సు ఆ ఇద్దరి మహిళలను మృత్యువు రూపంలో కబళించింది. మృతులు పస్తం లచ్చవ్వ, కడమంచి రాజవ్వగా తెలుస్తుంది. సమాచారం అందుకున్న పోలిసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన వివరాలను స్థానికులను అడిగి తెలుసుకుంటున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకొని స్థానిక సీసీటీవి ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.
కొండంత విషాదం..గుండెల్లో భారం..
కాగా ఈ ప్రమాదంతో బాధిత కుటుంబంలో కొండంత విషాదం నెలకొంది. తమ వారి మృతదేహాలను చూసి బోరున విలపిస్తున్నారు. ఈ ఘటన స్థానికులను కంటతడి పెట్టించింది. నెత్తుటి మడుగులో ఉన్న లచ్చవ్వ, రాజవ్వల మృతదేహాలపై పడి బంధువుల రోదనలు మిన్నంటాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Road accident, Telangana