Telangana: కబలించిన కరోనా.. కళ్లెదుటే అన్నయ్య మృతి.. అన్నీ తానై దహన సంస్కారాలు.. అనాథగా మారిన బాలిక..

దహన సంస్కార కార్యక్రమంలో పాల్గొన్న బాలిక

Jagityala: బాల్యదశలోనే అమ్మానాన్నలను కోల్పోయింది. ఎదుగుతున్న వయసులో అన్నీ తానై పెంచుతున్న తన అన్నయ్యను కూడా కరోనా రూపంలో మృత్యువు వెంటాడింది. అన్నీ తానే ఆమె తన అన్నకు అంత్యక్రియలను నిర్వహించింది. అందరినీ కోల్పోయి ఒంటరిగా మారిన ఆమెను చూసి ప్రజలు అయ్యో పాపం అంటున్నారు.

  • Share this:
    (పి. శ్రీనివాస్, కరీంనగర్ జిల్లా, న్యూస్ 18 తెలుగు)

    కష్టాలే ఆమెకు నేస్తాలు అన్నట్టు పుట్టినప్పటి నుంచి వెన్నంటే ఉన్నాయి. తన వాళ్లంతా ఒకరి తర్వాత ఒకరు చనిపోతుంటే ఏడ్చి ఏడ్చి కన్నీళ్లు కూడా ఇంకిపోయాయి. బాల్య దశలో అమ్మానాన్నలను.. ఎదుగుతున్న వయసులో తోడుగా ఉన్న సోదరుడిని మృత్యువు కబళించింది. అందరినీ కోల్పోయి ఒంటరిగా మిగిలిన ఆమె.. అన్నకు అన్నీతానై అంతిమ సంస్కారాలు చేసింది . ఈ హృదయవిదారకర ఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది. ఊహ తెలియనప్పుడే తండ్రిని కోల్పోయింది . మాటలు తిరుగుతున్న దశలో తల్లి మరణం చూసింది . ఉన్న తోడు అన్న ఒక్కడే . లేని అమ్మానాన్నను అన్నలో చూసుకుంటూ అమ్మమ్మ ఇంట్లోనే పెరుగుతోంది . పగబట్టిన విధి ఆమెను వెంటాడుతూనే ఉంది . ఉన్న ఒక్క ఆశ ... అన్నను తీసుకుపోయి తనను ఒంటరిదాన్ని చేసింది . చిన్ననాటి నుంచి తనను ఆడించి పెంచిన అన్నకు తానే తలకొరివి పెట్టింది.

    జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన నరెడ్ల మల్లేశ్ , రాధ దంపతులకు వెంకటేష్ , శరణ్య పిల్లలు . 15 ఏళ్ల క్రితం మల్లేశ్ అనారోగ్యంతో మృతి చెందాడు . అతని భార్య రాధ 12 ఏళ్ల క్రితం అనారోగ్యంతోనే ప్రాణాలు విడిచింది . తల్లిదండ్రులను కోల్పోయిన ఇద్దరు పిల్లలు వెల్గటూరు మండలం స్తంభంపల్లిలోని అమ్మమ్మ వద్ద ఉంటున్నారు . 20 ఏళ్లున్న వెంకటేష్ కరోనా, ఊపిరితిత్తులు, వ్యాధితో బాధపడుతూ మృతిచెందాడు . తల్లిదండ్రులు , ఉన్న ఒక్కదిక్కు అయిన అన్నను కోల్పోయిన శరణ్య ఒంటరిగా మిగిలింది .

    తన కుటుంబసభ్యులతో బాలిక(ఫైల్ ఫొటో)


    సోదరుడి మృతదేహానికి తానే అంత్యక్రియలు నిర్వహించింది . ఆ బిడ్డకొచ్చిన కష్టం చూపరుల హృదయాన్ని కలచివేసింది . శరణ్య ప్రస్తుతం ఇంటర్ చదువుతోంది . ఆమె చదువుకు మనసున్న మారాజులు సాయం అందించాలని పలువురు కోరుతున్నారు.
    Published by:Veera Babu
    First published: