కరీంనగర్‌లో ఘోర ప్రమాదం... వంతెన పైనుంచీ కారు పడి ఇద్దరు మృతి

Karimnagar Road Accident : ఈమధ్య రోడ్డు ప్రమాదాలు ఎక్కువైపోతున్నాయి. ముఖ్యంగా కార్లు రోడ్లపై నుంచీ పక్కకు వెళ్లిపోతున్నాయి. ఈ ఘటనలో కారు ఏకంగా వంతెన పైనుంచీ నీటిలో పడింది.

news18-telugu
Updated: February 16, 2020, 11:58 AM IST
కరీంనగర్‌లో ఘోర ప్రమాదం... వంతెన పైనుంచీ కారు పడి ఇద్దరు మృతి
ఘోర ప్రమాదం... వంతెన పైనుంచీ కిందపడిన కారు... (File)
  • Share this:
అది తెలంగాణ... కరీంనగర్‌లోని అల్గునూరు. రోజూలాగే వాహనాలు కరీంనగర్-హైదరాబాద్ హైవేపై అటూ ఇటూ వెళ్తున్నాయి. ఇంతలో ఓ కారు మానేరు వంతెన పై నుంచీ అదుపు తప్పి... కిందపడింది. మిగతా వాహనదారులంతా షాకయ్యారు. ఆటోమేటిక్‌గా వాళ్ల కాళ్లు బ్రేకుల మీద పడ్డాయి. ఏం జరిగింది? ఆ కారు వంతెన కిందకు ఎందుకు పడింది? లోపల ఎంత మంది ఉన్నారో, వాళ్ల పరిస్థితేంటే అంటూ చాలా మంది వంతెన కిందకు పరుగులు పెడుతూ వెళ్లారు. ఈ ప్రమాదంలో శ్రీనివాస్ అనే వ్యక్తి చనిపోయాడు. ఆయన భార్యకు తీవ్రగాయాలయ్యాయి. మరో విషాదమేంటంటే... వంతెన పైనుంచీ కారును గమనిస్తున్న వన్ టౌన్ పోలీస్‌స్టేషన్ కానిస్టేబుల్ శంకర్ కూడా కాలుజారి పైనుంచీ కిందపడ్డారు. ఆయనకు తీవ్రగాయాలయ్యాయి. అందర్నీ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కానిస్టేబుల్ చనిపోయారు.

చనిపోయిన శ్రీనివాస్... కరీంనగర్‌లోని సుభాష్‌నగర్ వాసి అని భార్య ద్వారా తెలిసింది. ఈ దంపతులు... కరీంనగర్ నుంచీ వరంగల్ వెళ్తున్నారు. కారు డ్రైవింగ్ చేస్తూ... తేడాగా స్టీరింగ్ తిప్పడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లుగా అంచనా వేస్తున్నారు పోలీసులు. ఈ ఘటనతో హైదరాబాద్‌ కరీంనగర్‌ హైవేపై ట్రాఫిక్‌ సమస్య తలెత్తింది. పోలీసులు కొంత సేపటి తర్వాత ట్రాఫిక్ క్లియర్ చేశారు. కారు వల్ల నాశనమైన వంతెన దగ్గర ఇతర వాహనాలు అటుగా వెళ్లకుండా... తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

First published: February 16, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు