అక్బరుద్దీన్‌కు క్లీన్ చిట్... కరీంనగర్ ప్రసంగంలో తప్పులేదన్న కమిషనర్

Akbaruddin | అక్బరుద్దీన్ ప్రసంగానికి కరీంనగర్ పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి క్లీన్ చిట్ ఇచ్చారు. ఆ ప్రసంగంలో ఎలాంటి తప్పులేదని అన్నారు.

news18-telugu
Updated: July 27, 2019, 5:12 PM IST
అక్బరుద్దీన్‌కు క్లీన్ చిట్... కరీంనగర్ ప్రసంగంలో తప్పులేదన్న కమిషనర్
అక్బరుద్దీన్ ఒవైసీ(ఫైల్ ఫోటో)
  • Share this:
కరీంనగర్‌లో ఓ వర్గం ప్రజలను మరో వర్గం వారిపై దాడికి ఉసిగొల్పేలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌కు ఊరట లభించింది. అక్బరుద్దీన్ ప్రసంగానికి కరీంనగర్ పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి క్లీన్ చిట్ ఇచ్చారు. ఆ ప్రసంగంలో ఎలాంటి తప్పులేదని అన్నారు. ఆయన ప్రసంగంలో ఉద్దేశపూరి వ్యాఖ్యలు లేవని సీపీ ప్రకటించారు. అక్బరుద్దీన్‌పై ఈ అంశంలో ఎలాంటి కేసులు పెట్టలేమని స్పష్టం చేశారు. న్యాయ నిపుణులతో చర్చించిన తరువాతే ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు.

కరీంనగర్‌లో ఎంఐఎం ముఖ్యనేత అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు,హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఆయన వ్యాఖ్యలు ఇరువర్గాల మధ్య ఘర్షణలు సృష్టించే విధంగా ఉన్నాయంటూ బీజేపీ నేతలు రాష్ట్రంలోని పలు పోలీస్ స్టేషన్‌లలో ఫిర్యాదు చేస్తున్నారు. ఈ మేరకు కరీంనగర్ కమీషనర్‌కు ఫిర్యాదు చేసిన బీజేపీ నేతలు... మహబూబ్ నగర్ టూ టౌణ్ పోలీస్ స్టేషన్‌లోనూ అక్బరుద్దీన్‌కు వ్యతిరేకంగా ఫిర్యాదు చేశారు. హైదరాబాద్‌లోని సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్‌లో అక్బరుద్దీన్‌పై కేసు నమోదు చేయాలంటూ బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు.

అయితే కరీంనగర్‌లో తాను చేసిన ప్రసంగంపై వచ్చిన విమర్శలను అక్బరుద్దీన్ కొట్టిపారేశారు. తన ప్రసంగంలో ఎలాంటి రెచ్చగొట్టే అంశాలు లేవని, ఎవరి వర్గానికి వ్యతిరేకంగా తాను మాట్లాడలేదని వివరించారు. కొందరు వ్యక్తులు తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఈ ప్రసంగానికి కొన్ని పదాలను జోడించి అర్థం మారేలా చేస్తున్నారని ఆరోపించారు. తన ప్రసంగం ద్వారా తాను రాజ్యాంగాన్ని ఏ రకంగానూ ఉల్లంఘించలేదని అక్బరుద్దీన్ ఓవైసీ స్పష్టం చేశారు. ఈ నెల 23న కరీంనగర్‌లో పర్యటించిన అక్బరుద్దీన్ అక్కడ బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలపై ఈ మొత్తం దుమారం చెలరేగింది.

First published: July 27, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు