Telangana News: జ్వరం వచ్చిందని ఆసుపత్రులకు వెళ్తే.. రోగులను ఇలా చేస్తున్నారు..

ప్రతీకాత్మక చిత్రం

Telangana News: సీజనల్ వ్యాధులు ప్రైవేటు ఆసుపత్రుల నిర్వాహకుల పంట పండిస్తున్నాయి . జ్వరం వచ్చిందంటే చాలు వ్యాధి నిర్ధారణ పరీక్షల పేరిట వేలాది రూపాయలు దండుకుంటున్నారు డెంగ్యూ బూచిని చూపి అవసరం లేకున్నా ప్లేట్లెట్స్ ఎక్కిస్తున్నట్లు ఆరోపణలున్నాయి.

 • Share this:
  (P. Srinivas, News18, Karimnagar)

  సీజనల్ వ్యాధులు ప్రైవేటు ఆసుపత్రుల నిర్వాహకుల పంట పండిస్తున్నాయి . జ్వరం వచ్చిందంటే చాలు వ్యాధి నిర్ధారణ పరీక్షల పేరిట వేలాది రూపాయలు దండుకుంటున్నారు డెంగ్యూ బూచిని చూపి అవసరం లేకున్నా ప్లేట్లెట్స్ ఎక్కిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. జ్వరాల బారిన పడి ప్రభుత్వాసుపత్రిని ఆశ్రయిద్దామనుకుంటే అక్కడ బెడ్లు లేవన్న సమాధానం ఒక్కటే ఎదురవుతోంది .. అసలే అరకొర సౌకర్యాలు , బెడ్లు కూడా దొరకకపోవ డంతో జ్వర పీడితులు ప్రైవేటు బారిన పడాల్సిన దుస్థితి వస్తుంది. ఇదే అదనుగా భావిస్తున్న ప్రైవేటు ఆసుపత్రుల నిర్వాహకులు వ్యాధి నిర్ధారణ పరీక్షలు జరిపి బాధితులను ఐసియుల్లో చేర్చి అవసరం లేని వైద్యాన్ని అందిస్తూ వేలాది రూపాయలు వసూలు చేస్తున్నట్లు బాధి తులు వాపోతున్నారు .

  Weight loss: అధిక బరువు నుంచి బయటపడేందుకు డైటింగ్ చేస్తున్నారా..? అయితే ఈ తప్పులు అస్సలు చేయకండి..


  కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రతి ప్రైవేటు ఆసుపత్రిలో ఇదే రీతిన దందా కొనసాగుతున్నట్లు అనేక మంది నెత్తి నోరు కొట్టుకుంటున్నారు. సంబంధిత అధికారులు మాత్రం చూసీ చూడనట్లు వ్యవహరిస్తుండడం పలు అనుమానాలకు తావిస్తోంది . జిల్లాలోని గ్రామాల వారీగా ఉన్న ఆర్ఎంపి , పిఎంపిలను మధ్య వర్తులుగా నియమించుకుని , వారికి కమిషన్లు ముట్టజెప్పుతూ జ్వర పీడితులను తమ ఆసుపత్రులకు రప్పించు కుంటున్నారు . మామూలు జ్వరం వచ్చినప్పటికీ అవసరం లేని నిర్ధారణ పరీక్షలు , స్కానింగ్ పేరిట వేలాది రూపాయలు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి . జ్వరం గానీ , ఇతరత్రా అనారోగ్యo సంభవించినప్పుడు ప్లేట్లెట్స్ కౌంట్లో హెచ్చుతగ్గులు సర్వసాధారణమే అయినప్పటికీ , దాన్ని భూతద్దంలో చూపిస్తూ ప్లేట్ లెట్స్ అందించాలని వేలాది రూపాయలు దండుకుంటున్నట్లు సమాచారం .

  ఒక్కో వ్యక్తికి ప్లేట్ లెట్స్ ఎక్కించడానికి 20 వేల నుంచి 30 వేల రూపాయల వరకు వసూలు చేస్తున్నట్లు బాధితులు పేర్కొంటున్నారు. ఇలా ముగ్గురు, లేదా నాలుగురు బాధితులు వస్తే వారి నుండి లక్షలు కజేస్తున్నారు.ఈ ప్లేట్ లెట్స్ అందించే వ్యక్తులు అందుబాటులో లేని వారికి తమ ఆసుపత్రుల్లో పనిచేసే వారి నుంచి రక్తాన్ని సేకరిస్తామని పేర్కొంటూ , సదరు ప్లే లైట్స్ అందించే వ్యక్తికి చెల్లించాలని అదనంగా ఐదు వేల రూపాయలు వసూలు చేస్తున్న వైనం వెలుగుచూసింది . ధనార్జనే ధ్యేయంగా ఆసుపత్రులను నిర్వహిస్తున్న పలువురు వైద్యులు మామూలు జ్వరాలు వచ్చిన వారికి సైతం ప్లేట్ లెట్స్ అందిస్తూ లక్షల రూపాయలు దండుకుంటున్నట్లు సమాచారం .

  గత ఇరవై రోజులుగా జిల్లా వ్యాప్తంగా విషజ్వరాల బాధితుల సంఖ్య పెరుగుతోంది . ప్రతి రోజు ప్రభుత్వాసుపత్రిలో ఓపి కూడా అదే స్థాయిలో పెరుగుతోంది . రోజుకు వంద వరకు ఉన్న ఓపి , జ్వరాల కారణంగా మూడు వందలకు పైగానే ఉంటుందని వైద్యులు పేర్కొంటున్నారు . చికున్ గున్యా , టైఫాయిడ్ , ఇతర జ్వరాలతో బాధపడుతూ ప్రభుత్వాసుపత్రిని ఆశ్రయిస్తే అక్కడ బెడ్లు ఖాళీలేక అనేక మంది ప్రైవేటు ఆసుపత్రుల బారిన పడుతున్నారు . ఇదే అదనుగా భావిస్తున్న ప్రైవేటు ఆసుపత్రుల నిర్వాహకులు అందినకాడికి దోచుకుంటున్నారు . రోజుకు దాదాపు వెయ్యి నుంచి పది హేను వందల మంది వరకు జ్వరాలతో బాధపడుతూ జిల్లా కేంద్రంలోని వివిధ ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నట్లు తెలిసింది .

  KTR-Revath Reddy: రేవంత్ రెడ్డి సవాల్ ను స్వీకరించిన మంత్రి కేటీఆర్.. ఏ పరీక్షలకైనా సిద్దం అంటూ ట్వీట్..


  వీరి వద్ద నుంచి వ్యాధి నిర్ధారణ పరీక్షల పేరిటనే ఆసుపత్రుల నిర్వాహకులు రోజుకు లక్షలాది రూపాయలు ఆర్జిస్తున్నట్లు సమాచారం . అవసరం లేకున్నప్పటికీ ఐసియుల్లో చేర్పిస్తూ బెడ్ ఛార్జీల కింద రోజుకు 15 వందల నుంచి మూడు వేల రూపాయల వరకు వసూలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం . ఆసుపత్రి ఛార్జీలను తెలియపర్చే చాలు అన్ని ఆసుపత్రుల్లో ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ పలు ఆసుపత్రుల్లో ఇవి కనిపించడం లేదు . చార్టులను ఉంచిన ఆసుపత్రుల్లో సైతం ప్రకటించిన దానికంటే రెట్టింపు ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు సమాచారం .

  స్వయానా జిల్లా కేంద్రంలోనే జ్వరాల పేరిట ప్రైవేటు ఆసుపత్రులు ఇంత దోపిడీకి పాల్పడుతున్నా సంబంధిత ఆరోగ్య శాఖ అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది . అవసరం లేని చికిత్స పేరిట లక్షలాది రూపాయలు దోచుకుంటున్న ప్రైవేటు ఆసుపత్రుల నిర్వాకంపై జిల్లా కలెక్టర్ దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు . అమాయక ప్రజలను నిలువుదోపిడీకి గురి చేస్తున్న ప్రైవేటు ఆసుపత్రుల నిర్వాహకులపై కఠిన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
  Published by:Veera Babu
  First published: