Dalit Bandhu: హుజురాబాద్‌‌లో ఈ ఒక్క ఫ్లెక్సీ చూసి ముక్కున వేలేసుకుంటున్న జనం.. ఎందుకంటే..

కలెక్టర్ పేరుతో కనిపిస్తున్న ఫ్లెక్సీ

తెలంగాణలో మరో ప్రతిష్టాత్మక పథకాన్ని సీఎం కేసీఆర్ నేడు ప్రారంభించనున్నారు. హుజురాబాద్‌లో సీఎం కేసీఆర్ ఇవాళ ‘దళిత బంధు’ పథకాన్ని అట్టహాసంగా ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా హుజురాబాద్‌లో సీఎం కేసీఆర్, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఫ్లెక్సీలను భారీగా ఏర్పాటు చేశారు.

  • Share this:
    కరీంనగర్: తెలంగాణలో మరో ప్రతిష్టాత్మక పథకాన్ని సీఎం కేసీఆర్ నేడు ప్రారంభించనున్నారు. హుజురాబాద్‌లో సీఎం కేసీఆర్ ఇవాళ ‘దళిత బంధు’ పథకాన్ని అట్టహాసంగా ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా హుజురాబాద్‌లో సీఎం కేసీఆర్, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఫ్లెక్సీలను భారీగా ఏర్పాటు చేశారు. దళిత బాంధవుడిగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కీర్తిస్తూ గులాబీ పార్టీ నేతలు, కార్యకర్తలు హుజురాబాద్‌లో దారి పొడవునా ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేశారు. అంతా బాగానే ఉందిగానీ.. హుజురాబాద్‌లో ఏర్పాటు చేసిన ఓ ఫ్లెక్సీ మాత్రం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. పార్టీ నేతలు, కార్యకర్తలు ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేయడం ఎక్కడైనా జరిగే తంతే. కానీ.. హుజురాబాద్‌లో ‘దళిత బాంధవుడు’ పేరుతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై.. కలెక్టర్, కరీంనగర్ జిల్లా అని కనిపించడం విస్మయానికి గురిచేసింది. కలెక్టర్లు, ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ పథకాల ప్రారంభోత్సవాల్లో పాల్గొనడం, పాలు పంచుకోవడం మనం చూస్తూనే ఉంటాం. కానీ.. ముఖ్యమంత్రికి పార్టీ నేతలు, కార్యకర్తల మాదిరిగా ఏకంగా జిల్లా కలెక్టర్ ఫ్లెక్సీ ఏర్పాటు చేయడమేంటని ఆ ఫ్లెక్సీ చూసిన వారు ముక్కున వేలేసుకుంటున్నారు. అయితే.. ఈ ఫ్లెక్సీని నిజంగానే కలెక్టర్ ఏర్పాటు చేయించారా లేక టీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలే కలెక్టర్ పేరును వాడారా అనేది తెలియాల్సి ఉంది. ఈ ఫ్లెక్సీని జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాటు చేయించి ఉంటారనే అనుమానాన్ని కూడా స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా ఇప్పుడీ ఫ్లెక్సీ హుజూరాబాద్‌లో చర్చనీయాంశంగా మారింది.

    ఇదిలా ఉంటే.. సీఎం కేసీఆర్ ‘దళితబంధు’ పథకం ప్రారంభించే విషయంలో కూడా ఒక సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్నారు. రైతుబంధు పథకానికి వేదిక అయిన శాలపల్లి, ఇందిరానగర్ గ్రామాలనే దళితబంధుకు కూడా వేదికలుగా ఎంచుకున్నారు. ఈ ‘దళితబంధు’ పథకం ప్రారంభోత్సవం సందర్భంలో ఏర్పాటు చేయనున్న బహిరంగ సభలో లక్ష మందికి పైగా పాల్గొననుండటం గమనార్హం. వర్షం వచ్చినా ఇబ్బందులు కలగకుండా సభా ప్రాంగణంలో రెయిన్ ఫ్రూఫ్ టెంట్లు ఏర్పాటు చేశారు.

    ఇది కూడా చదవండి: Karimnagar: హైదరాబాద్ వరుడు.. కరీంనగర్ జిల్లా వధువు.. పెళ్లి అయ్యాక తిరిగి వెళుతుండగా...

    హుజూరాబాద్ నియోజకవర్గంతో పాటు పలు జిల్లాల నుంచి 825 ఆర్టీసీ బస్సుల్లో దళిత కుటుంబాలను ఈ సభా వేదిక వద్దకు తరలించనున్నారు. ఇదిలా ఉంటే.. ఈ దళిత బంధు పథకాన్ని కేవలం హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలోనే ముఖ్యమంత్రి తెరపైకి తీసుకొచ్చారని విపక్షాలు ఇప్పటికే అధికార పార్టీపై దుమ్మెత్తిపోస్తున్నాయి. ఈ పథకానికి సంబంధించి లబ్దిదారుల ఎంపికలో కూడా కేవలం టీఆర్‌ఎస్ కార్యకర్తలకే ప్రాధాన్యమిస్తున్నారని కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. టీఆర్‌ఎస్‌లోని దళిత నేతలు ఈ ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు ఇప్పటికే ప్రెస్‌మీట్‌లు పెట్టి ‘దళితబంధు’ పథకంపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
    Published by:Sambasiva Reddy
    First published: