తెలంగాణలో స్థానిక సంస్థల కోటాలోని ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ ముగియగా, ఈనెల 14న ఫలితాలు వెలువడనున్నాయి. అయితే, అత్యధికంగా (99.69శాతం) పోలింగ్ నమోదైన కరీంనగర్ జిల్లాలో ఒక స్థానంలో తానే గెలవబోతున్నానని, ఓటింగ్ సరళిని బట్టి విజేత తానేనంటూ టీఆర్ఎస్ రెబల్ సర్దార్ రవీంద్ సింగ్ ముందస్తుగా సంబురాలు చేసుకున్నారు. శుక్రవారం నాడు పోలింగ్ ముగిసిన వెంటనే సర్దార్ వర్గీయులు ఆయనను భుజాలపై ఎత్తుకుని పురవీధుల్లో సందడి చేశారు. పటాకులు పేల్చుతూ టీఆర్ఎస్, సీఎం కేసీఆర్ వ్యతిరేక నినాదాలు చేశారు. ఫలితాల వెల్లడికి మరో మూడు రోజుల సమయం ఉండగా సర్దార్ ఇలా ముందస్తు వేడుకలు జరుపుకోవడం జిల్లాలో చర్చనీయాంశమైంది. ఇదే అంశంపై కరీంనగర్ మేయర్ సునీల్ రావు శనివారం నాడు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సర్దార్ పై నిప్పులు చెరిగిన సునీల్ రావు సంచలన ప్రకటన చేశారు..
స్థానిక సంస్థల కోటాలో మొత్తం 12 స్థానాలుండగా, 6స్థానాలను టీఆర్ఎస్ ఏకగ్రీవం చేసుకోగా, మిగిలిన 6 స్థానాలకు శుక్రవారం నాడు పోలింగ్ జరిగింది. తొలి నుంచీ అందరి దృష్టిని ఆకర్షిస్తోన్న కరీంనగర్ జిల్లాలో అత్యధిక పోలింగ్ నమోదైంది. ఉమ్మడి కరీంనగర్ లో రెండు సీట్లలో టీఆర్ఎస్ నుంచి ఎల్.రమణ, భాను ప్రసాదరావు పోటీ చేశారు. మాజీ మేయర్ రవీందర్ సింగ్, ఎంపీపీ ల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు సారబుడ్ల ప్రభాకర్ రెడ్డి ఇండిపెండెంట్లుగా బరిలో దిగడంతో ఎన్నిక ఆసక్తికరంగా మారింది. రెండు స్థానాల్లో గెలుపుపై టీఆర్ఎస్ దీమా వ్యక్తం చేయగా, కాదూ తానే గెలవబోతున్నానంటూ సర్దార్ రవీందర్ సింగ్ సందడిచేస్తున్నారు. ఈ పరిణామాలపై కరీంనగర్ మేయర్ సునీల్ రావు తీవ్రంగా స్పందించారు.
కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సర్దార్ రవీందర్ సింగ్ గనుక విజయం సాధిస్తే నగర్ మేయర్ పదవికి రాజీనామా చేస్తానంటూ సునీల్ రావు సంచలన సవాలు విసిరారు. పోలింగ్ ముశాక, ఫలితాలు రాకుండానే సర్దార్ సంబురాలు చేసుకోవడం శోచనీయమని మేయర్ అన్నారు.ఎమ్మెల్సీ ఎన్నికల్లో సర్దార్ దిగజారుడు రాజకీయాలు చేశాడని, టీఆర్ఎస్ ఓటర్లు(స్థానిక ప్రజా ప్రతినిధులు) ఇళ్లల్లో లేకున్నా, సర్దార్ ఆయా ఇళ్లకు వెళ్లి మొబైల్స్, డబ్బులు పంపిణీ చేసేందుకు ప్రయత్నిచారని, నీతి మాలిన రాజకీయాలతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కౌన్సిలర్, కార్పొరేటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు సర్దార్ ప్రయత్నించారని మేయర్ సునీల్ రావు ఆరోపించారు.
సర్దార్ కుటిల నీతిని అడ్డుకుంటూ టీఆర్ఎస్ కుటుంబం ఏకతాటిపై నిలిచిందని, హైకమాండ్ నిలబెట్టిన ఇద్దరు అభ్యర్థులకే ఓట్లు వేశామని, కరీంనగర్ జిల్లాలోని రెండు ఎమ్మెల్సీ స్థానాలను టీఆర్ఎస్ పార్టీనే కైవసం చేసుకోబోతున్నదని మేయర్ సునీల్ రావు చెప్పారు. సర్దార్ రవీందర్ సింగ్ కు మద్దతు తెలిపిన బీజేపీ నాయకులే ఓటింగ్ కు దూరంగా ఉన్నారని సునీల్ రావు ఎద్దేవా చేశారు. ఈనెల 14తో సర్దార్ భవితవ్యం తేలిపోతుందని, ఒకవేళ ఆయన గెలిస్తే మేయర్ పదవికి రాజీనామా చేస్తానని సునీల్ రావు ప్రకటించారు.
కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ రెబల్ సర్దార్ రవీందర్ సింగ్ కు తొలి నుంచీ మద్దతు ఇస్తోన్న హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఓటు వేయలేకపోయారు. స్థానిక సంస్థల ఎన్నికల ఓటర్ల జాబితా విడుదయ్యేనాటికి ఈటలకు ఎలాంటి పదవి లేకపోవడంతో ఆయనకు ఓటు హక్కు లభించలేదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ముందునుంచీ చెబుతున్నట్లే ఓటింగ్ కు దూరంగా ఉన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Karimnagar, Mlc elections, Trs