(K.Lenin,News18,Adilabad)
మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలంలోని ఒడ్డుగూడెం గ్రామం వద్ద మత్తడి వాగుపై ఉన్న వంతెన కూలిపోవడంతో ప్రజల వాహనాల రాకపోకులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ వంతెన కూలి పోవడం వల్ల సుమారు 10 గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. వాగుపై గతంలో ఉన్న వంతెన కూలిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా, రోజు పాఠశాలలకు వెళ్లవలసిన స్కూల్ పిల్లలు, హాస్పిటల్ కు వెళ్లవలసిన వృద్దులు, గర్భిణీలు రహదారి సౌకర్యం లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
గతంలో కురిసిన భారీ వర్షాలకు మత్తడి వాగు ఉప్పొంగి ప్రవహించి, వాగు పై ఉన్న వంతెన కుంగి కూలిపోయింది.దీంతో, వేమనపల్లి మండలంలోని పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ముఖ్యంగా, సంపుటం, ఒడ్డుగూడెం, జాజులపేట, ముక్కిడి గూడెం, కల్లంపల్లి గ్రామాల లోని ప్రజలు రవాణా సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా, ఆ గ్రామాలలోని పాటశాలల విద్యార్థులు వాగు దాటి వేమనపల్లి మండల కేంద్రంలోని స్కూళ్లకు వెళ్లవలసి వస్తుంది. అయితే, స్కూలుకు వెళ్లడానికి విద్యార్థులు పుస్తకాలు చేతబట్టి వాగు దాటి వెళ్తూ ప్రతిరోజు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఆ గ్రామాలలో ప్రభుత్వ పాఠశాలు ఉన్నా అక్కడసరిపడా వసతులు, పాఠశాల సిబ్బంది లేక చాలామంది పాఠశాల విద్యార్థులు వేమనపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలకు వెళ్తున్నారు.
ఐతే,ప్రతిరోజు సుమారు 60 మంది విద్యార్థులు నిత్యం ఈ వాగు దాటి వేమనపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వం, ప్రైవేటు పాఠశాలలకు వెళ్తుంటారు. ఆ గ్రామాలలోని ప్రజలు ఏ చిన్న అవసరం ఉన్న వాగు దాటి అటు వేమనపల్లి, కోటపల్లి, చెన్నూర్ మండలాలకు అవసరాల నిమిత్తం నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. ఇటీవల వాగులో వరద నీరు తగ్గు ముఖం పట్టడంతో స్థానిక గ్రామాలలోని ప్రజలు వాగుపై వెంటనే వంతెన నిర్మాణం చేపట్టి రవాణా సౌకర్యాలను మెరుగుపరచాలని కోరుతున్నారు. ఇప్పటికైనా, వేమనపల్లి మండల ప్రజా ప్రతినిధులు, అధికారులను, తమ గోడును పట్టించుకోని వీలైనంత త్వరగా మత్తడి వాగు పై నూతన వంతెనను నిర్మించి ప్రజల రవాణా సౌకర్యాలను మెరుగుపరచాలనివేడుకుంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Mancherial, Telangana