హుజురాబాద్ రాజకీయం రోజు రోజుకు హీటెక్కుతోంది. కౌశికి రెడ్డిని హుజురాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడంతో స్థానిక ఎమ్మెల్సీతో వెళ్లాలో..లేక పార్టీ ఇన్ ఛార్జీతో నడవాలో తెలియక హుజూరాబాద్ బీఆర్ఎస్ క్యాడర్ లో గందరగోళం నెలకొంది. బై ఎలక్షన్స్ లో అధికార పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగి ఈటల రాజేందర్ పై ఓడిపోయిన గెల్లు శ్రీనివాస్ యాదవ్ నియోజవర్గం ఇన్ ఛార్జిగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆయనకు పార్టీలో స్థానం తగ్గినట్లు కనిపిస్తోంది. ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన రెండు నెలల నుంచి పాడి కౌశిక్ రెడ్డి పార్టీ కార్యక్రమాల్లో దూకుడు పెంచడం, తన అనుచరులతో మీటింగులు నిర్వహిస్తుండడం గెల్లు శ్రీనివాస్ ను ఆత్మరక్షణలో పడేసింది.
గెల్లుకు ఇన్ ఛార్జి బాధ్యతలు ఇచ్చినట్లే ఇచ్చి..అధిష్టానం ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డిని ఎంకరేజ్ చేయడం పార్టీ శ్రేణుల్లోనూ చర్చనీయాంశంగా మారింది. తాజాగా మంత్రి కేటీఆర్ హుజూరాబాద్ పర్యటన, బహిరంగ సభ ఏర్పాట్లను కౌశిక్ రెడ్డి అంతా తానై చూసుకోవడం గెల్లు శ్రీనివాస్ అనుచరులకు మింగుడు పడడం లేదు. ఇరువర్గాల మధ్య కోల్డ్ వార్ నడుస్తున్నట్లు కనిపిస్తోంది. కౌశిక్ రెడ్డి, గెల్లు శ్రీనివాస్ యాదవ్ మధ్య నడుస్తున్న ఆధిపత్య పోరుతో కేడర్ కు నామినేటెడ్ పోస్టులు దక్కడం లేదు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ ను పార్టీ నుంచి బహిష్కరించిన తర్వాత సీఎం కేసీఆర్ , మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు ఇచ్చిన హామీలతో చాలా మంది లీడర్లు ఈటల వెంట వెళ్లకుండా పార్టీలోనే ఉండిపోయారు.
బై ఎలక్షన్స్ టైంలో చాలా మందికి మార్కెట్ కమిటీలు, ఆలయ కమిటీలు, కోఆప్షన్ మెంబర్లు తదితర నామినేటెడ్ పోస్టులు ఇస్తామని ఆశ చూపారు. గతేడాది మార్చి 23న ఎమ్మెల్సీ కౌశిర్రెడ్డి సూచించిన వారితో దేవస్థానం కమిటీని నియమించి, అందుకు సంబంధించిన ఉత్తర్వులను రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ చేతుల మీదుగా అందజేశారు. దీనిపై నియోజకవర్గ ఇంఛార్జి గెల్లు శ్రీనివాస్ యాదవ్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో నియామక ప్రక్రియ వాయిదాపడింది. తర్వాత అధికార పార్టీ నాయకులు రెండు గ్రూపులుగా విడిపోయి రహస్య సమావేశాలు నిర్వహించారు. దీంతో పార్టీ అధిష్టానం నామినేటెడ్ పోస్టుల భర్తీ జోలికెళ్లడం లేదు. జమ్మికుంట, హుజూరాబాద్ మార్కెట్ కమిటీలు, దుబ్బ మల్లన్న టెంపుల్ కమిటీలు, జమ్మికుంట, హుజూరాబాద్ మున్సిపల్ కోఆప్షన్ సభ్యుల ఎంపిక నిలిచిపోయాయి.
ఆధిపత్య పోరు కారణంగా తమకు పదవులు రాకుండా పోతున్నాయని సెకండరీ లీడర్ షిప్ ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఈటల రాజేందర్ రాజీనామాతో 2021 అక్టోబర్ లో హుజూరాబాద్ బై ఎలక్షన్స్ జరిగిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా సుమారు ఆర్నెళ్ల పాటు నియోజకవర్గంలో వాడీవేడి ప్రచారం కొనసాగింది. ఏడాది తిరగకముందే ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. ఎమ్మెల్సీ అయినా తనకు తృప్తి లేదని, వచ్చే హుజూరాబాద్ ఎన్నికల్లో ఎమ్మెల్యే అయినప్పుడే తనకు తృప్తి అని, ఈ ఒక్కసారి అవకాశం ఇవ్వాలంటూ వీణవంక మండలం కొండపాకలో చేసిన కామెంట్స్ అప్పట్లో హాట్ టాపిక్ గా మారాయి. పార్టీ మీటింగ్ జరిగినా, ప్రెస్ మీట్ పెట్టినా కౌశిక్ రెడ్డి వచ్చే ఎన్నికల గురించే మాట్లాడుతున్నారు.
మంగళవారం నిర్వహిస్తున్న బహిరంగ సభతో బలప్రదర్శనకు దిగుతున్నట్లు తెలుస్తోంది. సభను సక్సెస్ చేసి వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ తనకే కన్ఫాం అనే మెసేజ్ జనాల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు గెల్లు శ్రీనివాస్ యాదవ్ కూడా స్థానికంగా పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ మెడికల్ ట్రీట్ మెంట్ కోసం ఎన్వోసీలు, సీఎం రిలీఫ్ ఫండ్, ఆర్థిక పరమైన చెక్కులు ఇప్పించడం, పార్టీ కార్యకర్తల కుటుంబాల్లో ఎవరైనా చనిపోతే పరామర్శించడం, పెళ్లిళ్లు, పేరంటాలకు వెళ్లి కలిసి రావడం చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయాననే సానుభూతి ప్రజల్లో ఉందని, ఉద్యమకారుడిగా సీఎం కేసీఆర్ తనకే టికెట్ ఇస్తారని ఆయన ధీమాతో ఉన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Gellu Srinivas Yadav, Huzurabad, Telangana, Telangana Politics