హోమ్ /వార్తలు /తెలంగాణ /

Kidnap: ముంబైలో జగిత్యాల వాసి కిడ్నాప్​.. రూ. 15 లక్షలిస్తేనే వదిలిపెడతామని బెదిరింపులు

Kidnap: ముంబైలో జగిత్యాల వాసి కిడ్నాప్​.. రూ. 15 లక్షలిస్తేనే వదిలిపెడతామని బెదిరింపులు

కిడ్నాపర్లు పంపిన ఫొటో

కిడ్నాపర్లు పంపిన ఫొటో

ఈ ఏడాది జూన్ 22న దుబాయ్ నుండి శంకరయ్య ముంబైకి వచ్చాడు. అనంతరం కనిపించలేదు. శంకరయ్య ను తాళ్లతో కట్టేసి బంధించిన ఫొటోను కిడ్నాపర్లు అతడి కుమారుడు హరీశ్‌కు పంపించారు. దీంతో శంకరయ్య కిడ్నాపర్ల చేతిలో బందీగా ఉన్నట్లు తేలిపోయింది.

పొట్టకూటి కోసం దుబాయ్​కి వెళ్లిన తెలంగాణ (Telangana)కు చెందిన వ్యక్తి జీవితం ప్రమాదంలో పడింది. జగిత్యాల (Jagityal) జిల్లా నందగిరికి చెందిన మత్తమల్ల శంకరయ్య (50) అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ (Kidnap) చేశారు. ఈ ఏడాది జూన్ 22న దుబాయ్ నుండి శంకరయ్య ముంబై (Mumbai)కి వచ్చాడు. అనంతరం కనిపించలేదు. శంకరయ్య ను తాళ్లతో కట్టేసి బంధించిన ఫొటోను కిడ్నాపర్లు అతడి కుమారుడు హరీశ్‌కు పంపించారు. దీంతో శంకరయ్య కిడ్నాపర్ల చేతిలో బందీగా ఉన్నట్లు తేలిపోయింది. వివరాల్లోకి వెళ్తే..  జగిత్యాల (Jagityal) జిల్లా పెగడపల్లి మండలం నందగిరి గ్రామానికి చెందిన శంకరయ్య (Shankarayya) ఈ నెల 22న దుబాయి నుంచి ముంబైకి వచ్చారు. ఎయిర్‌పోర్టు నుంచి బయటకు వచ్చి ట్యాక్సీ ఎక్కే క్రమంలో అతను కిడ్నాప్‌కు గురయ్యారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో మహారాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే కిడ్నాపర్లు శంకరయ్య ఫొటోను ఇంటర్‌నెట్‌ ద్వారా అతడి కుమారుడు హరీశ్‌ వాట్సాప్‌కు గురువారం పంపించారు. ఇంటర్‌ నెట్‌ ద్వారా ఫోన్‌ చేసిన కిడ్నాపర్లు తమిళ, మళయాల భాషల్లో మాట్లాడారు. రూ.15 లక్షలు ఇస్తేనే శంకరయ్యను వదిలిపెడతామని తేల్చి చెప్పారు.

శంకరయ్య (ఫైల్​)

మధ్య తరగతి కుటుంబానికి చెందిన తాము రూ.15 లక్షలు ఎక్కడి నుంచి తేవాలని కుటుంబ సభ్యులు బోరుమంటున్నారు. ఇంటి పెద్ద దిక్కు కిడ్నాప్​ కావడంతో అతని భార్య అంజవ్వ, కుమారుడు హరీశ్, కూతురు గౌతమి వారం రోజులుగా క్షణక్షణం భయం భయంగా గడుపుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం, మంత్రి కేటీఆర్, మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ప్రత్యేక చొరవ చూపి శంకరయ్య క్షేమంగా ఇంటికి చేరేలా తగిన చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు కుటుంబ సభ్యులు. కాగా, ఈ ఘటనపై ముంబైలో కేసు నమోదైందని కానీ, ఇప్పటికీ ఎలాంటి పురోగతి లేదని కుటుంబీకులు వాపోతున్నారు.

ఆ కిడ్నాప్​ టాక్​ ఆఫ్​ ది టౌన్​గా..

ముంబై లాంటి మహానగరం అభివృద్ధికే కాదు నేరాలకూ అడ్డానే. ఇటీవలె అంధేరీలో జరిగిన ఓ కిడ్నాప్​ టాక్​ ఆఫ్​ ది టౌన్​గా మారింది. అంధేరి లో ఉంటున్న ఒక వ్యక్తి రియల్ ఎస్టేట్ డెవలపర్. అతడికి ఇద్దరు పిల్లలు. వారిని స్కూల్ లో దింపడం, తన వ్యాపార పనుల నిమిత్తం తన కారుకు డ్రైవర్ ను నియమించుకున్నాడు. ఎప్పటిలాగే సోమవారం సాయంత్రం ఆ పిల్లలను తీసుకొని వస్తుండగా.. కారును అడ్డగించిన పలువురు కిడ్నాపర్లు వారిని బెదిరించారు. బలవంతంగా డోర్ తీసి ఇద్దరు పిల్లలను, డ్రైవర్ తో పాటు బిల్డర్ లకు కత్తులు చూపి బెదిరించారు. డ్రైవర్ ను కొట్టి పిల్లలను ఎత్తుకెళ్లారు. అదే సమయంలో కిడ్నాపర్ డ్రైవర్, పిల్లలకు మత్తు మందు ఇచ్చి వారిని జూహూ పివిఆర్ ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ ఒక పిల్లవాడిని, డ్రైవర్ ను ఒక బస్సులో ఉంచి.. మరో పిల్లవాడితో తాను పరార్ అయ్యాడు.

కూతురు వివాహం కోసం..

ఆ తర్వాత మరో మూడు బైకుల్లో వచ్చిన ఆరుగురు కిడ్నాపర్లు.. బస్సులో ఉన్న డ్రైవర్ తో పాటు పిల్లవాడిని బయటకు తీసుకెళ్లి వారిపై దాడి చేశారు. మరో వైపు తండ్రి ఫిర్యాదుతో జుహూ-వెర్సోవా రోడ్డుకు చేరుకున్న పోలీసులు.. ఒక పిల్లవాడిని రక్షించారు. కానీ ఇదే సమయంలో మరో పిల్లవాడు కిడ్నాపర్ల చెరలో ఉండటంతో వారికి ముప్పు ఇంకా పొంచే ఉందని తల్లిదండ్రులు ఆందోళన చెందారు. ఇంతలోనే బిల్డర్ భార్యకు ఒక కిడ్నాపర్ ఫోన్ చేసి తమకు రూ. 1 కోటి ఇస్తేనే పిల్లవాడిని వదిలిపెడతామని చెప్పారు. కాగా.. పోలీసులు మాత్రం డ్రైవర్ ను విచారిస్తుండగా అతడి మాట తీరు తేడాగా ఉండటంతో పోలీసులకు అనుమానం వచ్చింది. అతడికి ఇవ్వాల్సిన రీతిలో ట్రీట్మెంట్ ఇవ్వడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కిడ్నాప్ డ్రామా అంతా అతడు నడిపించిందేనని.. తన కూతురు వివాహం కోసం డబ్బులు అవసరముండగా తానే.. తన బంధువుతో కలిసి ఈ డ్రామా ఆడానని డ్రైవర్ ఒప్పుకున్నాడు.

First published:

Tags: Jagityal, Karimangar, Kidnap, Mumbai

ఉత్తమ కథలు