(P.Srinivas,News18,Karimnagar)
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు బీజేపీలో ముసలం పుట్టించాయి . ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ .. ఇటీవలే కాషాయం కప్పుకొన్న ఈటల మధ్య విభేదాలు బగ్గు మంటున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టడం లేదని అధ్యక్ష హోదాలో ప్రకటించిన బండి సంజయ్ మాటలను బేఖాతరు చేస్తూ స్వతంత్ర అభ్యర్థి రవీందర్ సింగ్ కు ఈటల మద్దతు ప్రకటించడం .. ముగ్గురు బీజేపీ కార్పొరేటర్లు రవీందర్ సింగ్ కు ఓటువేయడంతో లుకలుకలు బయటపడ్డాయి.
రవీందర్సింగ్ కు ఓటేసిన ముగ్గురు కార్పొరేటర్లకు రాష్ట్రపార్టీ నోటీసులు జారీచేసింది . పార్టీ అనుమతి లేకుండా స్వతంత్ర అభ్యర్థిని ఎలా బలపరుస్తారని నోటీసులో ప్రశ్నించినట్టు సమాచారం . నోటీసులకు వివరణ ఇవ్వాలని ముగ్గురిని ఆదేశించినట్టు తెలుస్తున్నది . అయితే సదరు కార్పొరేటర్లు ఈ నోటీసులను సీరియస్ గా తీసుకోలేదని స్థానిక బీజేపీ నేతలు చెప్తున్నారు .
ఎందుకంటే ఈ ముగ్గురు కార్పొరేటర్ల వెనుక ఈటల హస్తం ఉన్నదని స్థానిక నేతలు అంటున్నారు . కరీంనగర్లో స్వతంత్ర అభ్యర్థిని బలపరచాలని సోషల్ మీడియాలో బాజాప్తా వీడియో సందేశం ఇచ్చిన ఈటల రాజేందరు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా .. ముగ్గురు కార్పొరేటర్లకు మాత్రం ఇవ్వడమే మిటని స్థానిక బీజేపీ నేతలు అధిష్టానాన్ని ప్రశ్నించినట్టు సమాచారం .
కార్పొరేటర్లకు ఒక నీతి .. ఎమ్మెల్యే లకు ఒక నీతా ? అని వాపోయినట్టు తెలుస్తున్నది . రవీందర్ సింగ్ తరపున ఈటల చేసిన ప్రచారం .. వీడియో సందేశాన్ని అధిష్టానం ముందుంచినట్టు తెలుస్తున్నది . పైగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు స్వయంగా ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్లోనే ఆయన అభిప్రాయానికి భిన్నంగా ' ఈటల వ్యవహరించడమేమిటని నిలదీస్తున్నట్టు సమాచారం. చినికిచినికి గాలివాన అయినట్లుగా .. కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈటల రాజేందర్ వ్యవహరించిన తీరు ప్రస్తుతం బీజేపీలో రగడ పుట్టించింది .
అధిష్టానం నిర్ణయానికి భిన్నంగా వ్యవ హరించడమే కాకుండా .. బండి సంజయ్ అభిప్రాయానికి వ్యతిరేకంగా సదరు రవీందర్ సింగ్ కు బీజేపీలోకి తీసుకొనేందుకు రాజేందర్ ప్రయత్నిస్తున్నారని బండి వర్గీయులు మండిపడుతున్నారు . ఇందు కోసం రాజేందర్ తన ప్రయత్నాలను మొదలు పెట్టగా .. మరో వర్గం అడ్డుపడుతున్నట్టు తెలుస్తున్నది .
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి పార్టీ వ్యవహారం నచ్చక ఇద్దరు కార్పొరేటర్లు టీఆర్ఎస్తో కలిసి నడిచారు . ఈటల ఇలాగే వ్యవహరిస్తే తాము టీఆర్ఎస్ లో చేరుతామంటూ మరో నలుగురు గులాబీ నేతలను ఆశ్రయించినట్టు తెలిసింది . ఈటలకు నోటీసులు ఇచ్చి చర్యలు చేపట్టకపోతే .. పార్టీ శ్రేణులు రెండు వర్గాలుగా చీలిపోవడం ఖాయమని ఆ పార్టీలో ప్రస్తుతం తీవ్రస్థాయిలో చర్చ జరుగుతున్నట్లు సమాచారం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Karimnagar, Telangana Politics