Huzurabad: హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి గా తెరపైకి కొత్తపేరు.. పూర్తి వివరాలివే..

హుజురాబాద్ సూచిక

Huzurabad: హుజూరాబాద్ నియోజకవర్గం ఉప ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. నేడో రేపో ' నోటిఫికేషన్ అంటూ ప్రచారం జోరందుకున్న నేపథ్యంలో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరనే దానిపై రాజకీయ విశ్లేషకుల్లో ఉత్కంఠగా మారింది. రోజు రోజుకూ మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రధాన పార్టీలు చివరి నిమిషంలో ఎవరిని బరిలోకి దింపుతాయన్న చర్చ సాగుతోంది.

  • Share this:
    (పి. శ్రీనివాస్, కరీంనగర్ జిల్లా, న్యూస్18 తెలుగు)

    హుజూరాబాద్ నియోజకవర్గం ఉప ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. నేడో రేపో ' నోటిఫికేషన్ అంటూ ప్రచారం జోరందుకున్న నేపథ్యంలో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరనే దానిపై రాజకీయ విశ్లేషకుల్లో ఉత్కంఠగా మారింది . నియోజకవర్గంలో రోజు రోజుకూ మారుతున్న రాజకీయ పరిణామాలు , పెరుగుతున్న పార్టీ ఫిరాయింపుల దరిమిలా ప్రధాన పార్టీలు చివరి నిమిషంలో ఎవరిని బరిలోకి దింపుతాయన్న చర్చ సాగుతోంది . ప్రధాన పార్టీలు అభ్యర్థులపై ఆచీతూచి వ్యవహరిస్తుండటం మరింత ఉత్కంఠగా మారింది. బీజేపీ అభ్యర్థిగా మాజీ మంత్రి ఈటల రాజేందర్ పోటీలో ఉండనున్నారు . అయితే అభ్యర్థి ఎంపిక విషయంలో టీఆర్ఎస్ తీసుకునే నిర్ణయాన్ని బట్టి కొంత శాతం మార్పులు ఉండొచ్చన్న చర్చ కూడా జరుగుతోంది. అదే జరిగితే రాజేందర్ సతీమణి జమునారెడ్డి బరిలో ఉండొచ్చని చెబుతున్నారు. కాగా , నియోజకవర్గానికి ఇన్ చార్జులను నియమించినా కాంగ్రెస్ ఇంకా స్తబ్దతగానే ఉంది .

    అయితే ఈ పార్టీ నుంచి మాజీ మంత్రి కొండా సురేఖను బరిలో దింపే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది . కాంగ్రెస్ తరుఫున హుజురాబాద్లో కొండా సురేఖను పోటీలో దింపే అవకాశం ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి . హుజురాబాద్ అభ్యర్థి ఎంపిక బాధ్యతను దామోదర రాజనర్సింహకు అప్పగించిన నేపథ్యంలో ... ఇటీవల జరిగిన నియోజకవర్గ సమావేశంలో ఈ మేరకు సంకేతాలు ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది . కొండా సురేఖతో పాటు దామోదర రాజనర్సింహ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ దళిత సామాజికవర్గానికి చెందిన నేతకు అవకాశం ఇవ్వాలనుకుంటే ... వరంగల్‌కు చెందిన సీనియర్ నేత దొమ్మాటి సాంబయ్య , కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణలకు అవకాశం ఇవ్వొచ్చుననే ప్రచారం జరుగుతోంది. టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను టీఆర్ఎస్ అభ్యర్థిగా సీఎం కేసీఆర్ దాదాపుగా ఖరారు చేశారనే ప్రచారం జరుగుతోంది .

    ఈ నెల 16 న హుజురాబాద్ పర్యటనలో గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరును కేసీఆర్ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది . పాడి కౌశిక్ రెడ్డి , ముద్దసాని పురుషోత్తం రెడ్డి , ముద్దసాని మాలతి , వకుళాభరణం కృష్ణ మోహన్ , స్వర్గం రవి , పొనగంటి మల్లయ్య పేర్లను పరిశీలించిన కేసీఆర్ ... చివరకు గెల్లు శ్రీనివాస్ వైపే మొగ్గుచూపినట్లు తెలుస్తోంది . హుజురాబాద్ ఉపఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కేసీఆర్ .. ఆ నియోజకవర్గానికే చెందిన బండ శ్రీనివాసు ఎస్సీ కార్పోరేషన్ ఛైర్మన్ గా నియమించారు. అదే నియోజకవర్గానికి చెందిన పాడి కౌశిక్ రెడ్డికి ఇటీవలే ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఇక హుజురాబాద్ లోనే దళిత బంధు పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టబోతున్నారు . హుజురాబాద్ లో అసలైన పోటీ కేసీఆర్ వర్సెస్ ఈటలనే అన్న ప్రచారంతో గులాబీ బాస్ ఉపఎన్నికను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నారు.
    Published by:Veera Babu
    First published: