Home /News /telangana /

KARIMNAGAR HUZURABAD MLA ETALA RAJENDER IS NOT RESPECTED AND VALUED IN TELANGANA BJP AND DID HE TAKE A WRONG STEP HERE THE STORY KNR PRV

Political Leader: ఈటెల మౌనం వెనుక కారణం ఏంటి..? మాజీ మంత్రికి బీజేపీలో ప్రాధాన్యం దక్కడం లేదా..?

ఈటల రాజేందర్

ఈటల రాజేందర్

రాష్ట్ర బీజేపీ (BJP)లో కేంద్ర బిందువుగా మారుతారన్న ప్రచారానికి తగ్గట్టుగా హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Etala rajendar) ప్రభావం చూపలేకపోతున్నారా ? తెలంగాణ రాజకీయాల్లో ఇపుడు ఇదే హాట్​ టాపిక్​. స్పెషల్ స్టోరీ మీ కోసం ..

  (P. Srinivas, News 18, Karimnagar)

  తెలంగాణ బీజేపీ (BJP)లో కేంద్ర బిందువుగా మారుతారన్న ప్రచారానికి తగ్గట్టుగా హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Huzurabad MLA Etala Rajender,) ప్రభావం చూపలేకపోతున్నారా ? తెలంగాణ రాజకీయాల్లో ఇపుడు ఇదే హాట్​ టాపిక్​.  . కీలక నాయకునిగా మారి రాష్ట్ర బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రత్యేక పాత్రపోషించే అవకాశాలు ఉన్నాయని ఉప ఎన్నికలకు ముందు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది . కానీ ఆయన గెలిచిన తరువాత టీఆర్ఎస్ (TRS) నుంచి బీజేపీలోకి పెద్దగా వలసలు లేకపోవడం మైనస్ గా మారిందని చెప్పవచ్చు . కనీసం ఆయన నియోజకవర్గానికి చెందిన క్యాడర్ కూడా వెన్నంటి నడవడానికి విముఖత చూపుతున్నట్టుగా స్పష్టం అవుతున్నది. ఉప ఎన్నికల (By elections) సమయంలో టీఆర్ఎస్ పార్టీలో ఉన్న వారంతా ఆయన కోవర్టు లేనన్న ప్రచారం గుప్పుమని వినిపించింది. కోవర్టు ముసుగు పడ్డ వారు కూడా నేటికీ గులాబీ పంచనే ఉన్నారు తప్ప రాజేందర్ అడుగు జాడల్లో నడిచేందుకు ముందుకు రాకపోవడం గమనార్హం . దీంతో ఎన్నికల తరువాత ఈటల వ్యూహ ప్రతి వ్యూహాలు ఫలించడం లేదా లేక ఆయనపై జరిగిన ప్రచారం అంతా వట్టిదేనా అన్న భావన వ్యక్తం అవుతున్నది .

  జాతీయ పార్టీ పంచన చేరి ఎదురీదాల్సిన పరిస్థితి..

  అసలు ఈటెల సైలెంట్ వెనుక కారణాలు ఏంటి.?  ఒకప్పుడు ఆయన వేదిక ఎక్కారంటే తాను చేసిన అభివృద్ధి పనులను సుదీర్ఘంగా వివరించేవారు. పార్టీలోనూ తన పంతాన్ని నెగ్గించుకోవడంలో వెనక్కి తగ్గే వారు కాదు. ఇప్పుడా పరిస్థితి లేదు . రాష్ట్రంలో ముఖ్య నాయకుల్లో ఒకడిగా ఎదిగిన ఆయన, జాతీయ పార్టీ పంచన చేరి ఎదురీదాల్సిన పరిస్థితి తయారైంది.  ఈటల రాజేందర్ రాజకీయ భవిష్యత్తుపై (Political Future) ఎలాంటి ప్రభావం ఉండబోతుందోనన్న అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది . వారిలో నైరాశ్యం గతేడాది టీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరిన ఈటల రాజేందర్ ఉప ఎన్నికలో గెలిచినప్పటికీ ఇంటా బయట సానుకూలత కనిపించినట్టుగా అనిపిం చడం లేదు . ఆయనతోపాటు కాషాయ కండువా కప్పుకున్న జడ్పీ మాజీ చైర్ పర్సన్ తుల ఉమ భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకంగా మారింది .

  వేములవాడ నుండి పోటీ చేయాలని భావిస్తున్న తుల ఉమను ఎక్కడి నుండి బరిలో నిలుపుతారోనన్నది అంతుచిక్కకుండా పోయింది. అధిష్టానం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో తుల ఉమకు ఎలాంటి ప్రాధాన్యం లభిస్తుందోనన్నది మిస్టరీగా మారింది. కోరుట్ల నుంచి పోటీ చేయించే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం ఉన్నా, పార్టీ నాయకత్వం మాత్రం ఎలాంటి హామీ ఇవ్వనట్టుగా తెలుస్తున్నది .

  పార్టీలో చేరిన వారికి గుర్తింపు ఇవ్వడం లేదని..

  నియోజకవర్గంలో కూడా ఆయనతోపాటు బీజేపీలో చేరిన వారికి అంతగా ప్రాధాన్యం దొరకడం లేదు. ఇటీవల బీజేపీ ఏర్పాటు చేసిన సమావేశంలో కూడా ఈటల మాట్లాడుతూ.. తనతో పాటు పార్టీలో చేరిన వారికి గుర్తింపు ఇవ్వడం లేదని జిల్లా నాయకత్వంపై వ్యాఖ్యానించారు. వారికి కూడా సముచిత స్థానం కల్పించాలంటూ రాజేందర్ చేసిన కామెంట్స్ బీజేపీలో చర్చకు దారి తీశాయి . దీంతో పార్టీలో ఈటల వర్గానికి అంతగా గుర్తింపు రావడం లేదని స్పష్టం అయింది .

  హుజురాబాద్ బై పోల్ కారణంగానే దళిత బంధు కార్యక్రమం ప్రారంభించారని ఈటల పదే పదే చెప్తున్నప్పటికీ లబ్ధిదారుల ఎంపిక బాధ్యతలను ప్రభుత్వం ఆయనకు అప్పగించలేదు. మంథని లో కాంగ్రెస్ నేత శ్రీధర్ బాబు, దుబ్బాకలో బీజేపీ నేత రఘునందన్ రావు ఎమ్మెల్యేలుగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నియోజకవర్గాల్లో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ బాధ్యతలను సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్న వీరికే అప్పగించిన ప్రభుత్వం.. హుజురాబాద్ లో మాత్రం ఈటలను కాదని ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డికి కట్టబెట్టినట్టు సమాచారం. ఈ స్కీంలో లబ్ది పొందిన వారు మాత్రం ఈటల వల్లే తమకు లాభం చేకూరిందని ప్రకటనలు ఇస్తున్నారు. కొంతమంది ప్రత్యేకంగా ఈటలను కలిసి ప్రకటనలు చేస్తున్నప్పటికీ ఇదంతా పొలిటికల్ స్టంట్ అని అంటున్న వారూ లేకపోలేదు  నియోజకవర్గంలో ఎప్పుడూ అభివృద్ధి మంత్రం జపించే రాజేందర్ ఇప్పుడా పరిస్థితికి భిన్నంగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఏర్పడినట్టుగా కనిపిస్తున్నది .

  ముదిరాజ్ సామాజిక వర్గానికి ప్రతినిధిగా..

  గతంలో మాదిరిగా భారీ సభలు ఏర్పాటు చేసే అవకాశం లేకుండా పోవడం కూడా ఆయనకు మైనస్​గా మారిందన్న వాదనలు వినిపిస్తున్నాయి . ప్రధానంగా రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తారని , బీజేపీలో క్రియాశీలక పాత్ర పోషిస్తారన్న అంచనాల మేరకు ఈటల ప్రస్థానం సాగడం లేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి . రాష్ట్ర వ్యాప్త పర్యటనలు చేస్తున్న రాజేందర్ తన సామాజిక వర్గానికి చెందిన కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటున్నారని, ముదిరాజ్ సామాజిక వర్గానికి ప్రతినిధిగా మారిపోయారన్న చర్చ సాగుతున్నది . ఇప్పటికే పలు జిల్లాల్లో తిరిగిన ఆయనతో పాటు కార్యక్రమాల్లో పాల్గొంటున్న వారు పట్టుకుంటున్న జెండాల్లో ఎక్కువగా ముదిరాజ్ సామాజిక వర్గ చిహ్నపు జెండాలే ఎక్కువగా కనిపిస్తుండటం గమనార్హం . దీంతో ఈటెల రాజేందర్ తన సామాజిక వర్గానికి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తు న్నారా ? అనే చర్చ పార్టీలో సాగుతున్నది.
  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Eetala rajender, Karimangar, Telangana bjp, Telangana Politics

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు