KARIMNAGAR FAMILY COMPLIANT TO COLLECTOR FOR CASTE BOYCOTT IN KARIMNAGAR SNR KNR
Telangana:కరీంనగర్ జిల్లాలో ఫ్యామిలీని వెలివేసిన కులపెద్దలు..చావే గతి అంటున్న బాధితులు
(కులదురంహకారం)
Karimnagar:కులం పేరుతో ఆధిపత్యం చలాయిస్తున్నారు ఆ ఊరి జనం. ఓ కుటుంబాన్ని ఐదేళ్లుగా కులబహిష్కరణకు గురి చేసి వేధిస్తున్నారు. బాధితులు కలెక్టర్‌కి మొరపెట్టుకున్నా ప్రయోజనం లేకపోవడంతో..చావే శరణ్యమంటున్నారు.
(P.Srinivas,New18,Karimnagar)
జనం అభివృద్ధిపథంలో చంద్రమండలం దిశగా అడుగులు వేస్తుంటే ..మారుమూల పల్లెల్లోని కొందరు చాదస్తం వీడటం లేదు. ఆచారాలు, కట్టుబాట్లు అంటూ అనాగరికంగా అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. తెలంగాణలోని కరీంనగర్ (Karimnagar) జిల్లాలో అలాంటి ఘటనే ఒకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వీణవంక (Veenavanka)మండలం బేతిగల్(Betigal)గ్రామంలో యాదవ సామాజిక వర్గానికి చెందిన బైకని లింగమూర్తి(Bikani Lingamurthy)కుటుంబానికి సంబంధించిన విషయంలో కులపెద్దలు జోక్యం చేసుకున్నారు. దాన్ని లింగమూర్తి తప్పుపట్టాడు. అదే అతను చేసిన పొరపాటు. ఈ సాకుతోనే కులపెద్దలు లింగమూర్తి కుటుంబాన్ని వెలివేశారు. తమ బంధువులు, కులస్తులు ఎలాంటి శుభకార్యం చేసుకున్నా లింగమూర్తి కుటుంబాన్ని ఆహ్వానించకుండా, తమలో కలవకుండా కొత్త కట్టుబాట్లు ఏర్పాటు చేస్తూ తీర్మానించారు. అంటరానితనం, అనాగరిక సమాజం నుంచి జనం బయటకు వచ్చి ఆధునిక జీవనం గడుపున్న ఈ క్రమంలో ఇలాంటి ఘటన జరగడం..ఆలస్యంగా వెలుగులోకి రావడం జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది.
కుటుంబంపై కులాధిపత్యం ..
ఈ అనాగరిక చర్య ఇప్పుడు జరిగింది కాదు. గత ఐదేళ్లుగా ఓ అంటరాని వాళ్లను పెట్టినట్లుగా దూరం పెట్టారు కులపెద్దలు. ఫ్యామిలీ పంచాయితీలో కులపెద్దల జోక్యం ఎందుకన్న అభిప్రాయాన్ని చెప్పినందుకు లింగమూర్తికి ఇంతటి పరాభవం జరిగింది. గ్రామంలో తమ కులస్తులు దూరం పెట్టడమే కాకుండా గ్రామంలో ఏటా యాదవ కుల దైవమైన బీరన్న కొలువు పట్నాలు ఉన్నాయని ఈ పండగకు తమ కుటుంబాన్ని రాకూడదని హుకుం జారీ చేశారంటూ లింగమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో తమ దయనీయ పరిస్థితిని ప్రజావాణి ద్వారా స్వయంగా జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.
ఐదేళ్లుగా కులబహిష్కరణ..
కలెక్టర్ ఆదేశాల మేరకు స్థానిక తాసిల్దార్ సరిత ,పోలీసులతో కలిసి గ్రామంలో కుల పెద్ద మనుషులతో విచారించారు. ఇలా చేయడం సరికాదని వారికి సూచించినప్పటికి వాళ్లు మారడం లేదని..అంతే మొండిగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు లింగమూర్తి కుటుబం సభ్యులు. ఉన్నతాధికారులు పట్టించుకోని తమ కుటుంబాన్ని తమ సామాజికవర్గానికి చెందిన వాళ్లతో కలిపే విధంగా చర్యలు తీసుకోవాలని లేకపోతే కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంటామంటున్నారు. ప్రభుత్వ అధికారులు చెప్పినప్పటికి వినిపించుకోకుండా తమను చిత్రహింసలకు గురి చేస్తున్నారని వాపోతున్నారు.
ఆత్మహత్య శరణ్యమంటున్న బాధితులు..
జగిత్యాలలో కూడా ఇదే తరహా ఘటన జరిగితే బాధితులంతా అంబేద్కర్ విగ్రహం ముందు ధర్నా చేసి ఆత్మహత్యాయత్నానికి దిగారు. అధికారులు స్పందించి కులస్తుల్ని మందలించడంతో వారికి ఆరు నెలల జైలుశిక్ష విధించారు.ఇది జరిగిన కొద్ది రోజుల్లోనే మరోచోట కులాధిపత్యం చెలాయించడం సరికాదని..ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కి ఫిర్యాదులు చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.